ఉమ్మడి పౌరస్మృతిపై వైఖరేంటి?

14 Oct, 2015 04:00 IST|Sakshi

కేంద్రానికి సుప్రీం కోర్టు ప్రశ్న
 
 న్యూఢిల్లీ: దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని తేవాలనుకుంటున్నారా? లేదా? ఈ అంశంపై మీ వైఖరేమిటో చెప్పండని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్రాన్ని నిలదీసింది. విడాకుల చట్టాన్ని సవరించే ప్రతిపాదనతో మూడువారాల్లో తమ ముందుకు రావాలని, ఆలోగా ఉమ్మడి పౌరస్మృతిపై కేంద్రప్రభుత్వ వైఖరినీ కూడా స్పష్టంగా తమకు చెప్పాలని ఆదేశించింది. ఢిల్లీకి చెందిన అల్బర్ట్ ఆంథోనీ విడాకుల చట్టం 10ఏ లోని సెక్షన్ (1)ను ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా సవాల్ చేశారు. ఇతర మతస్తులైతే... దంపతులిద్దరూ ఏడాదిపాటు విడిగా ఉన్నాక విడాకులు కోరవచ్చని ఈ చట్టం చెబుతోందని, అదే క్రైస్తవులైతే దంపతులు రెండేళ్లు ఒకరికొకరు దూరంగా ఉన్నాకే విడాకులు కోరడానికి వీలు కల్పిస్తోందని ఆంథోనీ అభ్యంతరం లేవనెత్తారు. ఇది క్రైస్తవుల పట్ల వివక్ష చూపడమేనన్నారు.

జులైలో ఈ పిటిషన్ దాఖలు కాగా... సమాధానం ఇవ్వాలని న్యాయశాఖకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. అలాగే ‘10ఏ’లోని సెక్షన్ (1)కు సవరణ తెచ్చే అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఈ పిటిషన్ మంగళవారం మళ్లీ విచారణకు రాగా.. ‘అంతా గందరగోళంగా ఉంది. ఉమ్మడి పౌరస్మృతిపై దృష్టి పెట్టాల్సిందే. ఏం జరిగింది? కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతిని తేవాలనుకుంటే... తెచ్చి అమలులో పెట్టండి. ఈ దిశగా చర్యలెందుకు లేవు’ అని జస్టిస్ విక్రమ్‌జిత్ సేన్, జస్టిస్ శివకీర్తి సింగ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. సొలిసిటర్ జనరల్ అభ్యర్థన మేరకు కేంద్రానికి మూడు వారాల సమయమిస్తూ పిటిషన్‌ను వాయిదా వేసింది.

 ఉమ్మడి పౌరస్మృతి అవసరమే.. కానీ..
 ‘జాతి సమైక్యతకు ఉమ్మడి పౌరస్మృతి అవసరమే. అయితే దీన్ని తీసుకొచ్చే అంశంపై విస్తృత సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకోవాలి’ అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ మంగళవారమిక్కడ అన్నారు. రాజ్యాంగ ప్రవేశిక, 44వ అధికరణలు కూడా దేశంలో ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని చెబుతున్నాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు