మిస్త్రీ తొలగింపు వెనుక షాకింగ్‌ మిస్టరీ!

25 Oct, 2016 10:30 IST|Sakshi
మిస్త్రీ తొలగింపు వెనుక షాకింగ్‌ మిస్టరీ!
  • బోర్డు సమావేశంలో తీవ్ర గందరగోళం
  • చెప్పపెట్టకుండా తొలగించిన టాటా గ్రూప్‌
  • కారణమిదే అంటున్న ఇన్‌సైడర్లు

  • దేశ కార్పొరేట్‌ రంగాన్ని ఒక కుదుపు కుదిపిన సంఘటన.. టాటా సన్స్‌ చైర్మన్‌ పదవి నుంచి సైరస్‌ పల్లోంజీ మిస్త్రీని తొలగించడం.. వందల బిలియన్ డాలర్లకుపైగా విలువైన టాటా గ్రూప్‌నకు సారథిగా వచ్చిన మిస్త్రీని... నిండా నాలుగేళ్లు కూడా కొనసాగకముందే సాగనంపారు. దేశ పారిశ్రామిక వర్గాల్ని తీవ్ర షాక్‌కు గురిచేసిన ఈ ఘటనకు అసలు కారణం ఏమిటి? సైరస్‌ మిస్త్రీని ఉన్నపళంగా అర్ధంతరంగా, అత్యంత అగౌరవమైనరీతిలో ఎందుకు తొలగించారు. మిస్త్రీని తొలగించడానికి కారణమైన సోమవారం నాటి బోర్డ్‌ మీటింగ్‌లో ఏం జరిగింది? ఈ ఘటనకు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన వివరాల్ని ఒక జాతీయ మీడియా చానెల్‌ తన ఎక్స్‌క్లూజివ్‌ కథనంలో వివరించింది. ఆ వివరాలివి..

    సాధారణంగా టాటా సన్స్‌ బోర్డ్‌ సమావేశాలు ప్రశాంతంగా ఒకింత ఊహించేరీతిలోనే జరుగుతాయి. కానీ సోమవారం నాటి భేటీ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. ఈ భేటీలోనే సైరస్‌ మిస్త్రీని ఉన్నపళంగా తొలగించాలన్న షాకింగ్‌ నిర్ణయాన్ని తీసుకొన్నారు. ఈ ఘటన గురించి విశ్వసనీయంగా తెలిసిన ఇద్దరు కంపెనీ ఇన్‌సైడర్లు (ఒకరు ఈ బోర్డు మీటింగ్‌లో పాల్గొన్నారు కూడా) అసలు ఏం జరిగిందో వివరించారు. మిస్త్రీ ఉద్వాసన నిర్ణయం ప్రకటించడంతో ఒక్కసారిగా బోర్డు మీటింగ్‌లో గందరగోళంతోపాటు అసాధారణ దృశ్యాలు కనిపించాయని వారు వివరించారు. కావాలనే బోర్డు ఎజెండాలో మిస్త్రీ ఉద్వాసన అంశాన్ని చేర్చలేదని తెలుస్తోంది. ఇతరత్రా కేటగిరీలో భాగంగా బోర్డు భేటీ ముందుకు వచ్చే అదనపు అంశంగా దీనిని చేపట్టినట్టు ఒక ఇన్‌సైడర్‌ తెలిపారు. (టాటా తదుపరి చైర్మన్ ఎవరు..?)

    తన తొలగింపు అంశం చర్చకు రావడంతో షాక్‌ తిన్న మిస్త్రీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది అక్రమమని మండిపడ్డారు. టాటా నిబంధనల పుస్తకం ప్రకారం కనీసం 15రోజుల ముందైనా నోటీసు ఇచ్చిన తర్వాత బోర్డు ఎదుట దీనిపై చర్చించాలని, అప్పుడు తన వాదన వినిపించుకొనేందుకు అవకాశముంటుందని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. అయితే, తాము ముందే "న్యాయసలహా' తీసుకున్నట్టు బోర్డు ఆయనకు స్పష్టం చేసింది. ఆ న్యాయసలహా తనకు చూపించాల్సిందిగా మిస్త్రీ డిమాండ్ చేయగా.. ఇదేమీ కోర్టు హియరింగ్‌ కాదంటూ తోసిపుచ్చింది.

    బోర్డు నిర్ణయాన్ని సవాల్‌ చేయాలని మిస్త్రీ నిర్ణయించారు. మంగళవారం మధ్యాహ్నంలోపు ఆయన బొంబాయి హైకోర్టును ఆశ్రయించనున్నారు. టాటా సన్స్‌ బోర్డులో మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉండగా.. అందులో ఆరుగురు మిస్త్రీ ఉద్వాసనకు మద్దతు పలికారు. ఇద్దరు గైర్హాజరయ్యారు. తొమ్మిదో సభ్యుడైన మిస్త్రీ ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు నిరాకరించారు. అయితే, టాటా బోర్డు సభ్యుడిగా, డైరెక్టర్‌గా ఆయన కొనసాగనున్నారు. సైరస్‌ మిస్త్రీ ఉద్వాసనకు కారణం ఏమిటన్న దానిపైనా ఇన్‌సైడర్లు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. మిస్త్రీపై టాటా బోర్డుకు వ్యక్తిగత కోపం ఏమీ లేదని, కేవలం సీఈవోగా ఆయన పనితీరు నచ్చకపోవడం వల్లే ఇలా అర్థంతరంగా తొలగించారని చెప్తున్నారు. టాటా గ్రూప్‌లోని ఎన్నో కంపెనీలు ఉండగా మిస్త్రీ సారథ్యంలో కేవలం రెండు కంపెనీలు మాత్రమే లాభాల్లో ఉన్నాయని, మిగతా కంపెనీలు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాయని వారు తెలిపారు. టాటా గ్రూప్‌ సంప్రదాయ మర్యాదలు పాటించడం కంటే.. అంతర్జాతీయ పద్ధతి అయిన ఒక్కవేటుతో మిస్త్రీని తొలగించడానికి బోర్డు మొగ్గు చూపిందని మరో ఇన్‌సైడర్‌ వివరించారు.

మరిన్ని వార్తలు