జనవరి 20నే ప్రమాణం ఎందుకు?

18 Jan, 2017 20:06 IST|Sakshi
జనవరి 20నే ప్రమాణం ఎందుకు?

(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌): లీప్‌ సంవత్సరం నవంబర్‌లో అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన అభ్యర్థి జనవరి 20న ప్రమాణం చేసే సంప్రదాయం 1937లో ఆరంభమైంది. దేశ 32వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డి.రూజ్వెల్ట్‌  రెండోసారి 1936లో ఎన్నికయ్యాక జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు వరకూ మార్చి4న కొత్త అధ్యక్షుడు ప్రమాణం చేయడం సంప్రదాయంగా 140 ఏళ్లు కొనసాగింది. ఎఫ్‌డీ రూజ్వెల్ట్‌ తొలిసారి 1932లో గెలిచి మార్చి4న ప్రమాణం చేశారు. ఇలా ఆయన మార్చి4న ప్రమాణం చేసిన చివరి అధ్యక్షునిగా, జనవరి 20న పదవీ స్వీకారం చేసిన తొలి దేశాధినేతగా చరిత్రకెక్కారు.

అమెరికా తొలి అధ్యక్షుడి తొలి ప్రమాణం ఏప్రిల్‌ 30న
ఎన్నికైన అధ్యక్షుడి ప్రమాణం తేదీని మార్చి4గా అమెరికా రాజ్యాంగం నిర్ణయించింది. నవంబర్‌ మొదటివారంలో జరిగిన పోలింగ్‌ తర్వాత ఎన్నికల ప్రక్రియ సంబంధించిన  పూర్తి చేయడానికి, అధ్యక్షుడితోపాటు ఎన్నికైన ప్రజాప్రతినిధులు దేశ రాజధానికి చేరుకోవడానికి(18 శతాబ్దం చివరిలో ఇప్పటిలా రవాణా సౌకర్యాలు లేవు) తగినంత అంటే దాదాపు నాలుగు నెలల సమయం ఇవ్వడానికి మార్చి 4ను ముహూర్తంగా నిర్ణయించారు. అయితే, కొన్ని కార ణాల వల్ల తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్‌ మొదటిసారి 1789 ఏప్రిల్‌ 4న ప్రమాణం చేశారు. రెండోసారి ఆయన 1797 మర్చి4న ప్రమాణం చేయడంతో ఈ రాజ్యాంగ సంప్రదాయం 1933 వరకూ కొనసాగింది. 1789 మార్చి 4న అమెరికా రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే అప్పట్లో మార్చి 4కు అంత ప్రాధాన్యం ఇచ్చారు. 1933లో 20వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రమాణం తేదీ మార్చారు.


ప్రమాణం ఎలా? ఎవరితో?
జనవరి 20 మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో లేదా తర్వాత అధ్యక్షునితో ప్రమాణం చేయిస్తారు. సాధారణంగా అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొత్త అధ్యక్షునితో ప్రమాణం చేయిస్తారు. ప్రమాణం తర్వాత అధ్యక్షుడు తొలిసారి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో రెండుసార్లూ(2009, 2013) అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్‌ రాబర్ట్స్‌ ప్రమాణం చేయించారు. రేపు జనవరి 20న కూడా డొనాల్డ్‌ ట్రంప్‌తో రాబర్ట్స్‌ ప్రమాణం చేయిస్తారు. ఇండియాలో మాదిరిగా వయసును బట్టి అమెరికాలో జడ్జీలు రిటైరుకారు.

అధ్యక్షుడు మరణిస్తే ఉపాధ్యక్షుడే వారసుడు
రాజ్యాంగం ప్రకారం పదవిలో ఉన్న అధ్యక్షుడు మరణించడం, రాజీనామా చేయడం జరిగితే ఉపాధ్యక్షుడు అధ్యక్షుడవుతారు. సాధారణంగా మరణించిన రోజు లేదా రాజీనామా అమోదించిన రోజు ఉపాధ్యక్షుడు దేశాధ్యక్షునిగా ప్రమాణం స్వీకారం చేస్తారు. ఇలా పదవిలో ఉన్న అధ్యక్షుల మరణం(సహజ మరణం లేదా హత్యకు గురికావడం) లేదా రాజీనామా ఫలితంగా ఇప్పటి వరకూ 9 మంది అమెరికా ఉపాధ్యక్షులు అధ్యక్షులయ్యారు.

పదవిలో ఉండగా మరణించినవారు(సహజ మరణం) నలుగురు
అధ్యక్షపదవిలో ఉండగా సహజ మరణం పొందినవారు నలుగురు. వారు:1841లో విలియం హెన్రీ హ్యారిసన్‌(9వ అధ్యక్షుడు), 1850లో జకారి టేలర్‌(12), 1923లో వారెన్‌ జి.హార్డింగ్‌(29),  1945లో ఫ్రాంక్లిన్‌ డి.రూజ్వెల్ట్‌(32).

హత్యకు గురైన నలుగురు అధ్యక్షులు
అమెరికా చరిత్రలో గొప్ప అధ్యక్షుల్లో ఒకరైన అబ్రహం లింకన్‌(16) పదవిలో ఉండగా(1865 ఏప్రిల్‌15న రెండోసారి ఎన్నికై ప్రమాణం చేసిన నెలకే) హత్యకు గురైన తొలి అధ్యక్షునిగా చరిత్రకెక్కారు. మిగిలినవారు: 1881లో జేమ్స్‌ ఎ.గార్‌ఫీల్డ్‌(20), 1901లో విలియం మెక్‌కిన్లీ(25), 1965లో జాన్‌ఎఫ్‌ కెనడీ(35).

అభిశంసన తప్పించుకుని రాజీనామాచేసిన ఒకే ఒక్కడు రిచర్డ్‌ నిక్సన్‌
35వ అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌కు(రిపబ్లికన్‌) అనేక ప్రత్యేకతలున్నాయి. 1960 అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయి 1968 ఎన్నికల్లో గెలవడం నిక్సన్‌ ప్రత్యేకత.1972 ఎన్నికల్లో రెండోసారి గెలిచాక, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణ, అమెరికా కాంగ్రెస్‌ తీర్పు కారణంగా రాజీనామా చేశారు నిక్సన్‌. అధ్యక్ష పీఠం వైట్‌హౌస్‌లో కూర్చుని ఇలా రాజ్యాంగ, చట్ట ఉల్లంఘనకు పాల్పడి, కాంగ్రెస్‌ అభిశంసనను తృటిలో తప్పించుకుని, రాజీనామా చేసి అపకీర్తి మూటగట్టుకున్న అధ్యక్షునిగా చరిత్రలో ఆయన నిలిచిపోయారు.

నాలుగుసార్లు గెలిచిన ఏకైక నేత ఫ్రాక్లిన్‌ రూజ్వెల్ట్‌
32వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డి.రూజ్వెల్డ్‌ 12 ఏళ్ల ఒక నెల 8 రోజులు పదవిలో ఉండి రికార్డు సృష్టించారు. దేశ చరిత్రలో తొలి ప్రెసిడెంట్‌ జార్జి వాషింగ్టన్‌ సహా 15 మంది అధ్యక్షులు రెండుసార్లు ఎన్నికయ్యారు. 23 మంది ఒక్కసారి మాత్రమే ఎన్నికయ్యారు. ఫ్రాంక్లిన్‌ రూజ్వెల్ట్‌ మాత్రం నాలుగుసార్లు ఎన్నికయ్యారు. ఆయన నాలుగోసారి గెలిచాక మూడు నెలలే పదవిలో ఉండి మరణించారు.

22వ రాజ్యాంగ సవరణతో పదవి 8 ఏళ్లకే పరిమితం
రూజ్వెల్ట్‌ మరణించాక 1947లో 22వ రాజ్యాంగ సవరణ తెచ్చి, రెండుసార్లకు మించి అధ్యక్షపదవిలో ఉండకూడదనే నిబంధన తీసుకొచ్చారు. ఇలాంటి నిబంధన ఏదీలేకున్నా తొలి అధ్యక్షుడు వాషింగ్టన్‌ మూడోసారి అధ్యక్షుడుకావడానికి అంగీకరించలేదు. అధ్యక్షుడి మరణం కారణంగా ఈ పదవిలోకి వచ్చిన తొమ్మిది మందిలో నలుగురు ఒక్కొక్కసారి ఈ పదవికి ఎన్నికయ్యారు. ఇలా అధ్యక్ష పదవి ఖాళీ కావడంతో ప్రెసిడెంట్‌ అయిన చివరి నేత జెరాల్డ్‌ ఫోర్డ్‌ సహా ఐదుగురు రెండోసారి అధ్యక్షులు కాలేకపోయారు.

70 ఏళ్ల వయసులో ప్రమాణం చేస్తున్న 45వ అధ్యక్షుడు
అధ్యక్షునిగా తొలిసారి ప్రమాణం చేసినప్పుడు ఎక్కువ వయసు ఉన్న నేతగా ఇప్పటి వరకూ రోనాల్డ్‌ రీగన్‌(69 ఏళ్ల 345 రోజులు) రికార్డుల్లో ఉన్నారు. 1981లో మొదటిసారి ప్రమాణంచేసిన రీగన్‌ రికార్డును రేపు జనవరి 20న డొనాల్డ్‌ జె.ట్రంప్‌ బద్దలగొట్టబోతున్నారు. ఆ రోజున ట్రంప్‌ వయసు 70 సంవత్సరాల, ఏడు నెలల, ఏడు రోజులు. జీవించి ఉన్న నలుగురు మాజీ అధ్యక్షుల్లో ఇద్దరు బిల్‌ క్లింటన్, జార్జి డబ్ల్యూ బుష్‌ మాదిరిగానే ట్రంప్‌ కూడా 1946లో పుట్టారు.

అందరి చిన్న అధ్యక్షుడు థియోడర్‌ రూజ్వెల్ట్‌
ఇప్పటి వరకూ అధ్యక్షులైన 44 మంది నేతల్లో తొలి ప్రమాణం నాటికి అందరికన్నా చిన్నవాడిగా థియోడర్‌ రూజ్వెల్ట్‌(27వ) రికార్డు సృష్టించారు. అప్పటికి ఆయన వయసు 42 ఏళ్ల 322 రోజులు. అప్పటి అధ్యక్షుడు విలియం మెక్‌కిన్లీ రెండోసారి గెలిచి ప్రమాణం చేసిన ఆరు నెలలకే హత్యకుగురవడంతో రూజ్వెల్ట్‌కు అవకాశం వచ్చింది. ఆయన తర్వాత చిన్నవాడు జాన్‌ ఎఫ్‌ కెనడీ. ఆయన వయసు 43 ఏళ్ల 236 రోజులు. ఆ తర్వాత తక్కువ వయసులో ప్రమాణం చేసిన ప్రెసిడెంట్‌ బిల్‌ క్లింటన్‌ వయసు 1993 జనవరి 20 నాటికి 46 ఏళ్ల 156 రోజులు.

50 నిండకుండా అధ్యక్షులైన 9 మంది నేతలు
227 ఏళ్ల అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో 50 ఏళ్లు నిండకుండా మొదటిసారి అధ్యక్షునిగా ప్రమాణం చేసిన నేతలు 9 మంది. వారిలో అయిదో నేత ప్రస్తుత(44వ) అధ్యక్షుడు బారక్‌ హుసేన్‌ ఒబామా. ఆయన వయసు 2009 జనవరి 20 నాటికి 47 ఏళ్ల 167 రోజులు.
జీవించి ఉన్న మాజీ అధ్యక్షులు నలుగురులో ఇద్దరికి 92 ఏళ్లు

ఒక్కొక్కసారే అధ్యక్షులుగా ఉన్న 39వ అధ్యక్షుడు జిమీ కార్టర్, 41వ అధ్యక్షుడు జార్జి హెచ్‌డబ్ల్యూ బుష్‌–ఇద్దరూ 1924లో జన్మించారు. ఈ నెల 20 సాయంత్రానికి బతికి ఉన్న మాజీ అధ్యక్షులు అయిదుగురవుతారు..


ప్రమాణం చేసిన రోజే శ్వేతసౌధంలోకి డొనాల్డ్‌ ట్రంప్‌
అమెరికా చట్టసభలకు నెలవైన సంయుక్త రాష్ట్రాల కాపిటల్‌ భవనం(వాషింగ్టన్‌ డీసీ) మెట్ల మీద కొత్త అధ్యక్షునిగా ప్రమాణం చేసిన రోజే(జనవరి 20న)డొనాల్డ్‌ జె. ట్రంప్‌ అధికార నివాసం వైట్‌హౌస్‌లోకి కుటుంబసమేతంగా ప్రవేశిస్తారు. ఆ రోజు ఉదయం అధ్యక్ష భవనంలోని తన పడకగదిలో నిద్రలేచే అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సాయంత్రానికి భార్య మిషెల్, కూతుళ్లు మాలియా, సాషాతో కలిసి నగరంలోని మరో భవనంలోకి వెళ్లిపోతారు.

నవంబర్‌ 8 పోలింగ్‌ తర్వాత పది వారాలకు జరిగే ఈ లాంఛనం సమయంలోనే ఒబామా కుటుంబానికి సంబంధించిన లగేజిని అధ్యక్ష భవనం సిబ్బంది తరలించే ఏర్పాట్లలో ఉంటారు. మరి కొందరు సిబ్బంది ట్రంప్, ఆయనతో నివసించే ఆయన కుటుంబ సభ్యుల సామాన్లు తీసుకొచ్చి వైట్‌హౌస్‌లో సర్దే పనిలో హడావుడిగా నిమగ్నమౌతారు. శుక్రవారం మధ్యాహ్నం ట్రంప్‌తో 45వ అధ్యక్షునిగా అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్‌ రాబర్ట్స్‌ ప్రమాణం చేయిస్తారు. ట్రంప్‌కు ముందు ఉపాధ్యక్షునిగా మైకేల్‌ పెన్స్‌ ప్రమాణం ఉంటుంది. ఈ ప్రమాణాల తర్వాత కొత్త అధ్యక్షుడి హోదాలో తొలి ప్రసంగం చేస్తారు.


ప్రమాణాలకు, ప్రసంగానికి మధ్య సంగీత నృత్య ప్రదర్శనలతోపాటు ధార్మిక నేతల అనుగ్రహ భాషణలుంటాయి. (1789 ఏప్రిల్‌ 30న అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్‌ కూడా ఇలాగే ప్రమాణం తర్వాత ప్రసంగించారు. తొలి అధ్యక్షుడు ప్రమాణం, మొదటి ప్రసంగం అప్పటి తొలి రాజధాని న్యూయార్క్‌ నగరం ఫెడరల్‌ హాల్‌లో చేశారు. వాషింగ్టన్‌తో న్యూయార్క్‌ చాన్సలర్‌ ప్రమాణం చేయించారు)

ఒబామాకు వీడ్కోలు
పదవీ విరమణ చేసిన అధ్యక్షుడు ఒబామా వీడ్కోలు కార్యక్రమం ముగిశాక, ట్రంప్‌ దేశాధ్యక్షుని హోదాలో తొలిసారి అమెరికా కాంగ్రెస్‌ మధ్యాహ్న భోజన విందులో పాల్గొంటారు. తర్వాత అధ్యక్ష ప్రారంభోత్సవ పరేడ్‌లో కూడా పాల్గొంటారు. వెంటనే  ప్రమాణం చేసిన ప్రదేశం కాపిటల్‌ నుంచి ట్రంప్‌ కాన్వాయ్‌తో పెన్సిల్వేనియా అవెన్యూ(కాపిటల్, వైట్‌హౌస్‌ను కలిపి మెయిన్‌రోడ్‌) ద్వారా నెమ్మదిగా అధ్యక్షభవనం శ్వేతసౌధానికి చేరుకుంటారు.

మైలున్నర పొడవున్న దారికి ఇరు వైపులా శ్రేయోభిలాషులు, నిరసనకారులు ఉంటారు. ఇలా నాలుగేళ్ల అధ్యక్ష పదవి కారణంగా ట్రంప్‌ బస వైట్‌హౌస్‌లో జనవరి 20 సాయంత్రం నుంచి మొదలవుతుంది. మరుసటి ఉదయం వైట్‌హౌస్‌ పడకగదిలో నిద్రలేచాక ఆఫీసు సమయానికి సిద్ధమై, వెస్ట్‌ వింగ్‌లోని తన కార్యాలయానికి ట్రంప్‌ నడుకుంటూ వెళతారు.

మరిన్ని వార్తలు