కేసీఆర్ ఓటమే ప్రజా గెలుపు

16 Nov, 2015 01:35 IST|Sakshi
కేసీఆర్ ఓటమే ప్రజా గెలుపు

- వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, దిగ్విజయ్
- తెలంగాణ బిల్లు ఆమోదం ఓ చరిత్రాత్మక ఘట్టం
- ఉద్విగ్న క్షణాల మధ్య బిల్లు ప్రవేశపెట్టా: లోక్‌సభ మాజీ స్పీకర్
- ఆ సమయంలో బలిదానాలు నన్ను కదిలించాయి
- ఇద్దరు ఎంపీలున్న టీఆర్‌ఎస్‌తో బిల్లు పాస్ కాలేదు
- కాంగ్రెస్, సోనియా కృషి వల్ల ప్రత్యేక రాష్ట్రం వచ్చింది
- కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు ఇదే సరైన సమయం: దిగ్విజయ్
- మాల, మాదిగలకు కేబినెట్‌లో చోటేది: పీసీసీ చీఫ్ ఉత్తమ్
- సీఎంకు ఝలక్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: పొన్నాల
- భూపాలపల్లి, పరకాలలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభలు
 
సాక్షి, హన్మకొండ:
  ‘‘వరంగల్ ఉప ఎన్నికలో కేసీఆర్ ఓటమే ప్రజల గెలుపు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి’’ అని లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. వరంగల్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు మద్దతుగా కాంగ్రెస్ ఆదివారం భూపాలపల్లి, పరకాలలో భారీ బహిరంగ సభలు నిర్వహించింది.

ఈ సందర్భంగా మీరాకుమార్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌పై విమర్శలు కురిపించారు. మాయమాటలు చెప్పే కేసీఆర్, ప్రధాని మోదీలకు ఈ ఉప ఎన్నికలో ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. ‘‘పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం ఓ చరిత్రాత్మక ఘట్టం. పార్లమెంట్ చరిత్రలోనే అత్యంత ఉద్విగ్న క్షణాల మధ్య తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాను. బిల్లు సభలో ప్రవేశపెట్టినప్పుడు పెప్పర్‌స్ప్రేలతో, సభ్యుల నినాదాలతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బిల్లు ప్రవేశపెట్టొద్దంటూ కొందరు నన్ను కోరారు. ఆ క్షణాన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న అలుపెరుగని పోరాటం, బలిదానాలు నా మనసును కదిలించాయి. అందుకే బెదరకుండా బిల్లు ప్రవేశపెట్టేందుకు మొగ్గుచూపాను’’ అంటూ నాటి ఘటనలను మీరా కుమార్ గుర్తుచేసుకున్నారు.
 
సోనియా కృషి వల్లే తెలంగాణ
ఇద్దరు ఎంపీలున్న టీఆర్‌ఎస్‌తో బిల్లు పాస్ కాలేదని, సోనియాగాంధీ, కాంగ్రెస్ కృషి వల్లే పార్లమెంటులో బిల్లు ఆమోదానికి అవసరమైన మద్దతు సమకూరిందని మీరా కుమార్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్‌ఎస్ ఎన్నడూ చిత్తశుద్ధితో పనిచేయలేదని, ఎప్పుడూ ప్రజలను రెచ్చగొట్టడమే ఆ పార్టీ పనంటూ విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదని, కేబినెట్‌లో మహిళలకు స్థానం కల్పించకపోవడం వారిని అవమానించడమేనని అన్నారు.

‘‘నా జీవిత చరిత్రలో అబద్ధాలు చెప్పే ప్రధానిని ఇప్పటి వరకు చూడలేదు. అందుకే మొన్నటి ఎన్నికల్లో మా బిహారీలు బీజేపీకి బుద్ధి చెప్పారు’’ అంటూ మోదీపై మండిపడ్డారు. మాయమాటలు చెప్పే ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లకు వరంగల్ ఉప ఎన్నికలో గుణపాఠం చెప్పాలన్నారు. సర్వే సత్యనారాయణ సమర్థుడని, 24 క్యారెట్ల బంగారమని వ్యాఖ్యానించారు.

చికెన్ కంటే పప్పు ధర ఎక్కువా?
చికెన్ ధర కంటే పప్పు ధర ఎక్కువగా ఉండటం ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని దిగ్విజయ్ సింగ్ దుయ్యబట్టారు. అబద్ధాలు చెప్పి గద్దె నెక్కిన మోదీ, కేసీఆర్‌లకు బుద్ధి చెప్పేందుకు ఇది సరైన సమయమన్నారు. విదేశాలకు వెళ్లి భారత్ ఎంతగానో అభివృద్ధి చెందిందనడం, మన దేశంలో మాత్రం కాంగ్రెస్ పాలన వల్ల దేశం వెనుకబడి ఉందనడం ప్రధాని మోదీకే చెల్లిందన్నారు. దేశంలో కాంగ్రెస్ పాలనలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరిగిందన్నారు.

సకల జనుల సమ్మె కాలాన్ని సెలవు దినంగా ప్రకటించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఎన్నికల కమిషన్ ఈ విషయంపై చూస్తూ ఊరుకోవడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి అన్నారు. మాల, మాదిగలకు రాష్ట్ర కేబినేట్‌లో చోటులేకపోవడం బాధాకరమని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. నక్సలైట్ల అజెండానే తమ అజెండా అని చెప్పి.. శృతిని ఎన్‌కౌంటర్ చేశారని విమర్శించారు.

 

హమీలను విస్మరించిన కేసీఆర్‌కు ఝలక్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆకాశంలో నడుస్తున్న కేసీఆర్‌ను నేలపైకి దించాలంటే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. హిట్లర్ కంటే హీనంగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని సర్వే సత్యనారాయణ అన్నారు. ఈ బహిరంగ సభలో కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, బలరాంనాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, వి.హనుమంతరావు, మధుయాష్కీ గౌడ్, జనక్ ప్రసాద్, సంపత్, రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు