మా ఇంటికి రాని మహాలక్ష్మి

26 Dec, 2015 02:00 IST|Sakshi

భ్రూణహత్యలను నివారించేందుకు, బాలికలకు రక్షణ కల్పించేందుకు, వారు ఉన్నత చదువులు చదువుకొనేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం ‘బంగారు తల్లి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రస్తుతం ఆడబిడ్డలకు అక్కరకు రావటం లేదు. పథకాన్ని టీడీపీ ప్రభుత్వం సక్రమంగా అమలుచేయలేకపోతుంది. ఈ పథకానికి ‘మా ఇంటి మహాలక్ష్మిగా’ పేరు మార్చినప్పటికీ పథకం నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది. ఫలితంగా వేలమంది ఆడపిలల్లకు రక్షణ లేకుండా పోతుంది.
 
* బంగారు తల్లి పథకానికి మా ఇంటి మహాలక్ష్మిగా పేరుమార్చిన టీడీపీ ప్రభుత్వం
* ఆన్‌లైన్‌లో లోగోకే పరిమితం ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ డిపార్టమెంట్ ద్వారా పథకం అమలు చేయాలని వచ్చిన ఉత్తర్వులను పట్టించుకోని వైనం
* కమిషనర్ల స్థాయిలోనే ఉత్తర్వులు నిలిచిపోయాయని చెబుతున్న ఐసీడీఎస్ సిబ్బంది

 
పొందూరు: మా ఇంటి మహాలక్ష్మి పథకంపై నీలి నీడలు అలముకొన్నాయి. మే 5, 2013 తర్వాత పుట్టిన బాలికలకు మా ఇంటి మహాలక్ష్మిగా మారిన బంగారు తల్లి పథకం వర్తిస్తుంది. సమర్థంగా అమలు జరగాల్సిన ఈ పథకం ప్రభుత్వం చేతిలో బందీగా ఉంది. నిర్వహణ సరిగా లేకపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం. దీనిపై స్పందించాల్సిన మంత్రులు, అధికారులు ఏమీ తెలియనట్టు వ్యవహరించడం దురదృష్టకరం.

మా ఇంటి మహాలక్ష్మి పథకంలో చిన్నారుల నమోదు బాధ్యత ఎవరిది అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో పుట్టిన బాలికల వివరాలను వెలుగు కార్యాలయంలో నమోదు చేసేవారు. ప్రస్తుతం వారు కొనసాగించటం లేదు. ఆ పథకం వెలుగు నుంచి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేశారని వెలుగు అధికారులు జీవోలు చూపిస్తున్నారు. 2015 ఫిబ్రవరి 18న బంగారు తల్లి పథకాన్ని మా ఇంటి మహాలక్ష్మిగా మార్చినట్టు సింగిల్ ఫైల్ నంబర్ 15 తెలుపుతుంది.

2015 ఏప్రిల్ 30న విడుదల చేసిన జీవోఎంఎస్ నంబర్ 50 ప్రకారం వెలుగు నుంచి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలెప్‌మెంట్ డిపార్టమెంట్‌కు బదిలీ చేసినట్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఇవన్నీ పక్కాగా ఆన్‌లైన్‌లో పొందుపరచినప్పటికీ ఉమెన్ అండ్ చైల్డ్ డవలప్‌మెంట్ అధికారులు మాత్రం ఉత్తర్వులు కమిషనర్లు వరకే పరిమితమయ్యాయని, పథకంలో ఆడపిల్లల నమోదుపై ఎటువంటి ఉత్తర్వులు రాలేదని చెబుతున్నారు. ఇది చాలా విడ్డూరంగా ఉంది.
 
మహాలక్ష్మిలకు భరోసా ఏది?
పుట్టిన ఆడబిడ్డలకు భరోసా లేకుండా పోయింది. మా ఇంటి మహాలక్ష్మి పథకం ఉన్నప్పటికీ అరకొరగానే బాలికల నమోదు జరిగింది. నమోదు చేసిన వారిలో కొందరి ఆధార్ కార్డు అప్‌లోడ్ జరగలేదని, ఏపీఎం, డీపీఎంలు అప్‌లోడ్ చేయాల్సి ఉందని వారిని అర్హత లేకుండా చేశారు. బంగారు తల్లి పథకం ప్రవేశపెట్టిన నుంచి ఇప్పటివరకూ శ్రీకాకుళం జిల్లాలో 15,658 బాలికలను నమోదు చేశారు. వారిలో 14,865 మందిని అర్హులుగా గుర్తించారు. 793 మందిని వివిధ కారణాలతో అర్హత లేదని పెండింగ్‌లో పెట్టారు.

గత రెండేళ్లలో పుట్టిన బాలికలను ఈ పథకంలో నమోదు చేసేందుకు వేలాది మంది తల్లులు ఎదురు చూస్తున్నారు. వెలుగు, ఐసీడీఎస్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఆడ శిశువు పుట్టిన నుంచి డిగ్రీ చదువుకొనేంత వరకు ఈ పథకం కింద వారికి రూ. 2.15 లక్షలను ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఆడబిడ్డను పథకంలో నమోదు చేసేందుకు తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. త్వరగా ఈ పథకం పని చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, మంత్రులను, ఎమ్మెల్యేలను ఆడపిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు