చంద్రబాబు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?

1 Jul, 2016 19:48 IST|Sakshi
పెట్టుబడుల కోసమే చైనా పర్యటన: చంద్రబాబు

విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో చైనా కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా శ్రమిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన శుక్రవారం చైనా పర్యటన గురించి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వివరించారు. పెట్టుబడులు ఆకర్షించేందుకే తాను చైనా వెళ్లినట్లు చంద్రబాబు తెలిపారు. చైనాలో పర్యటించడం ఇది రెండోసారని, విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమన్నారు. సంస్కరణలతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు.

ఆంధ్రప్రదేశ్ కు ముందుగా బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాల్సి వుందన్నారు. రాష్ట్రాభివృద్ధి గురించి తాను నిరంతరం ఆలోచిస్తున్నానని ఆయన తెలిపారు. ఇప్పటికీ ప్రపంచంలో ఆంద్రప్రదేశ్ అంటే హైదరాబాద్ అనే అనుకొంటున్నారన్నారు. పదేళ్లపాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారని, అయితే పది సంవత్సరాలు హైదరాబాద్లో వుంటే.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం సాధ్యం కాదని చంద్రబాబు అన్నారు.

మనకంటే 13ఏళ్ల ముందే చైనా సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని చంద్రబాబు తెలిపారు. అక్కడ పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించిందని, అందుకే చైనాను మన రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామి చేయాలని చూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విశాలమైన రహదారులు, స్పీడ్ రైళ్లు, అత్యుత్తమ పోర్టుల్లో చైనానే ముందుందని చంద్రబాబు తెలిపారు. ప్రపంచంలోని వేగవంతమైన రైళ్లలో 60శాతం చైనాలోనే ఉన్నాయన్నారు. 60 అంతస్తుల భవనాన్ని నెల రోజుల్లో కట్టిన సాంకేతికత చైనాకు సొంతమని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే 500 చైనా కంపెనీలు దేశంలో ఉన్నాయన్నారు.

బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే...
చైనా పర్యటన గురించి వివరిస్తూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనాలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది...భూగర్భజలాలు ఎంతమేర వున్నాయి, ఎంత వర్షపాతం నమోదైంది వంటి విషయాలన్నీ ఎప్పటికప్పుడు టెక్నాలజీ ద్వారా తెలుసుకోగలిగానని... ఎందుకంటే టెక్నాలజీనే తన బెస్ట్ ఫ్రెండ్ అని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. టెక్నాలజీ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నట్లు చెప్పారు.

టెక్నాలజీతో భవిష్యత్‌లో విప్లవాత్మక మార్పులు సంభవిస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన ఎల్ఈడీ బల్బులు, ఫైబర్ గ్రిడ్, సోలార్ పంపు సెట్లు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. గ్రీన్ ఫీల్డ్ కేపిటల్ కట్టే మహత్తర అవకాశం మన రాష్ట్రానికే దక్కిందన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థలు దొనకొండలో పెట్టుబడులు పెట్టేలా ప్రయత్నిస్తున్నానని, దొనకొండలో రూ.44 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు చైనా కంపెనీలు ముందుకొచ్చాయని చంద్రబాబ తెలిపారు.

కాగా తాను ఎవరితోనూ విభేదాలు పడదలచుకోలేదని, సయోధ్యగా సమస్యలు పరిష్కారం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్, అమరావతి రెండు బావుండాలన్నారు. తన శక్తిసామర్ధ్యాలను రాష్ట్రాభివృద్ధి కోసమే వినియోగిస్తానని, విభేదాలు, విమర్శల కోసం కాదని ఆయన అన్నారు. పక్క రాష్ట్రాలతో సన్నిహిత సంబంధాలనే కోరుకుంటున్నానని చంద్రబాబు తెలిపారు. జల సమస్యల పరిష్కారం బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. ఇక హైకోర్టు ఐకాన్ భవనం అనుకున్నామని, అందుకే కొంత సమయం పడుతుందన్నారు.

మరిన్ని వార్తలు