'బడ్జెట్' తేదీలను మార్చడం అవసరమా?

19 Jan, 2017 17:29 IST|Sakshi
'బడ్జెట్' తేదీలను మార్చడం అవసరమా?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సాధారణ బడ్జెట్‌ను వాయిదా వేయాలన్న ప్రతిపక్షాల విజ్ఞప్తులను త్రోసిపుచ్చి ముందుగా నిర్ణయించినట్లు ఫిబ్రవరి ఒకటవ తేదీనే బడ్జెట్‌ ప్రవేశపెడతామని కేంద్రం ప్రకటించింది. అసలు ఏప్రిల్‌-మార్చి ఆర్థిక సంవత్సరాన్ని క్యాలెండర్‌ ఇయర్‌ కింద జనవరి-డిసెంబర్‌ సంవత్సరానికి ఎందుకు మార్చాల్సి వచ్చింది. మార్చిలో ప్రవేశ పెట్టే బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టాలని కేంద్రం ఎందుకు భావిస్తోంది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటీ?
 
న్యూఢిల్లీ: బ్రిటీష్‌ పరిపాలనా కాలం నుంచి, అంటే 1867 నుంచి భారత ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్‌-మార్చిగానే పరిగణిస్తూ వస్తున్నారు. అంతకుముందు మే-ఏప్రిల్‌ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించేవారు. భారత ఆర్థిక సంవత్సరాన్ని మార్చే అంశాన్ని పరిశీలించి అవసరమైన సిఫార్సులు చేయడం కోసం కేంద్ర ఆర్థిక శాఖ గత జూలై నెలలో మాజీ ఆర్థిక సలహాదారు శంకర్‌ ఆచార్య చైర్మన్‌గా ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకే భారత ఆర్థిక సంవత్సరాన్ని జనవరి-డిసెంబర్‌కు మారుస్తూ ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. 150 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్న ఏప్రిల్‌-మార్చి ఆర్థిక సంవత్సరాన్ని మార్చేందుకు ప్రయత్నం జరగడం ఇదేమి మొదటిసారి కాదు. 
 
భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ ఎల్‌కే లోధా చైర్మన్‌గా ఏర్పాటైన కమిటీ 1984లో మొదటిసారిగా ఆర్థిక సంవత్సరాన్ని మార్చి దానికి అనుగుణంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 1979-–80, 1982-83 సంవత్సరాల్లో దేశంలో తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో మున్ముందు కరవు పరిస్థితులను పటిష్టంగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో  ఆర్థిక సంవత్సరాన్ని ముందుకు జరపాలన్న ప్రతిపాదన వచ్చింది. దేశంలో 2014, 2015 సంవత్సరాల్లో వరుసగా వర్షపాతం తక్కువగా నమోదైన నేపథ్యంలో నేటి ప్రభుత్వం కూడా ఆర్థిక సంవత్సరాన్ని ముందుకు జరపాలన్న ప్రతిపాదనను తీసుకొచ్చింది. 
 
ప్రధానంగా వ్యవసాయ ఆధారిత  దేశమవడం వల్ల భారత్‌లో రుతుపవనాలను, పంటల ఉత్పత్తులను బడ్జెట్‌ రూపకల్పనలో ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటారు. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు నైరుతి రుతుపవనాలపై ఆధారపడి ఖరీఫ్‌ పంట కింద వరి, పప్పు దినుసులు పండిస్తారు. అదే అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు ఈశాన్య రుతుపవనాలపై ఆధారపడి గోధుమ లాంటి రబీ పంటలను పండిస్తారు. నైరుతి రుతుపవనాల కింద ప్రతి ఏటా అంతో ఇంతో వర్షాలు కురుస్తాయి. ఈశాన్య రుతుపవనాల కింద ఆ గ్యారెంటీ లేదు. అందుకని రబీ పరిస్థితులను ముందుగా అంచనావేసి అందుకు అనుగుణంగా బడ్జెట్‌ కేటాయింపులను జరిపేందుకు వీలుగా ఆర్థిక సంవత్సరాన్ని ముందుకు జరపాలని నాటి లోధా కమిటీ సూచించింది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో 58 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు. 
 
ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాల ప్రకారం భారత ఆర్థిక గణాంకాలను జనవరి-డిసెంబర్‌ సంవత్సరానికే సమర్పించాల్సి వస్తోందని, అందుకోసం బడ్జెట్‌ ప్రతిపాదనలపై పునర్‌ కసరత్తు చేయాల్సి వస్తోందని కూడా నాడు లోధా కమిటీ పేర్కొంది. అందుకోసమైనా సరే ఆర్థిక సంవత్సరాన్ని ముందుకు జరపాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పింది. ప్రయోజనాలు తక్కువ, అవాంతరాలు ఎక్కువ ఉన్నాయని, పైగా ఆర్థిక సంవత్సరాన్ని మార్చేందుకు పలు చట్ట సవరణలు తీసుకరావాల్సి ఉంటుందన్న ఉద్దేశంతో నాటి కేంద్ర ప్రభుత్వం లోధా సిఫార్సులను పక్కన పడేసింది.
 
ప్రపంచవ్యాప్తంగా స్వతంత్య్ర ఆర్థిక వ్యవస్థలు కలిగిన 227 దేశాల్లో 156 దేశాలు జనవరి-డిసెంబర్‌ క్యాలెండర్‌ ఇయర్‌నే ఆర్థిక సంవత్సరంగా పాటిస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కూడా క్యాలెండర్‌ ఇయరే మంచిదంటున్న ఆర్థిక నిపుణులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మోదీ ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలనుకుంటుందో, ఐదు రాష్ట్రాల ఎన్నికల రూపంలో కలిసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తుందో, బడ్జెట్‌ ప్రతిపాదనలు చూస్తేగానీ తెలియదు. 
 
 
మరిన్ని వార్తలు