బాబూ.. సమైక్య లేఖ ఎక్కడ?

12 Dec, 2013 02:53 IST|Sakshi
బాబూ.. సమైక్య లేఖ ఎక్కడ?

టీడీపీ అధినేతకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్న
 
 న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజెప్పడానికే యూపీఏపై అవిశ్వాసానికి మద్దతు ప్రకటించామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. అదే సమయంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ఇంతవరకు సమైక్యానికి అండగా ఉంటామని ప్రకటించలేదంటూ ఆయన విమర్శించారు.
 
 బుధవారం ఆయన పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. మీ పార్టీ, టీడీపీ, కాంగ్రెస్.. ఒకే ప్లాట్‌ఫాం మీద ఉన్నాయి కదా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ఇక్కడో విషయాన్ని అర్థం చేసుకోవాలి. లోక్‌సభలో టీడీపీ పక్ష నాయకుడు ఇంతవరకు అవిశ్వాసానికి మద్దతు ప్రకటించలేదు. టీడీపీకి ఆరుగురు ఎంపీలుంటే.. నలుగురే అవిశ్వాసానికి మద్దతుగా నిలుస్తున్నారు. మిగతా ఇద్దరు మద్దతు ఇవ్వడం లేదు. లోక్‌సభలో టీడీపీ పక్ష నేత అసలు కనిపించడమే లేదు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు అండగా ఉంటామని ఇంతవరకు లేఖ ఇవ్వనేలేదు. గతంలో తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ వెనక్కు తీసుకోలేదు. టీడీపీ ఎంపీలు అవిశ్వాసానికి నోటీసు ఇచ్చారు కానీ.. పార్టీ విధానంగా అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నట్లు చంద్రబాబు అధికారిక లేఖ ఇవ్వలేదు. ఇదీ చంద్రబాబు తీరు. ఆయన గురించి నేను వ్యాఖ్యానించ దలచుకోలేదు’’ అని జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. సమైక్యాంధ్రకు అండగా ఉండాలని, దీనికి సంబంధించి అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని తమ పార్టీ విధానంగా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. విలేకరులు అడిగిన మరికొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవీ..
 
 విలేకరులు: అవిశ్వాసానికి మద్దతు వల్ల ఏం సాధించగలరని భావిస్తున్నారు?
 జగన్: కాంగ్రెస్ ఎంపీలు తమ సొంత నాయకురాలు సోనియాగాంధీ మీదే అవిశ్వాసం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు సోనియాగాంధీ చేస్తున్న అన్యాయాన్ని హైలైట్ చేసి ప్రపంచానికి తెలియజెప్పడానికి మేం(వైఎస్సార్ సీపీ) కూడా అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించాం. ఆంధ్రప్రదేశ్‌కు సోనియాగాంధీ చేస్తున్న అన్యాయాన్ని ఈ దేశాన్ని, వీలయితే ప్రపంచాన్ని చూడనివ్వండి. సొంత పార్టీ అధినేత్రి మీదే కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాసం ప్రకటించడమే.. ఆమె రాష్ట్రానికి ఎంత అన్యాయం చేస్తున్నారో చెప్పడానికి స్పష్టమైన సంకేతం.
 విలేకరులు: మీరు ఎస్పీ, టీఎంసీ, ఇతర పార్టీలను సంప్రదిస్తున్నారు కదా! వారి పరిస్థితి ఏమిటి?
 
 జగన్: 70 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని అందరికీ తెలుసు. ఎస్పీ, టీఎంసీ.. మిగతా అన్ని పార్టీలకూ తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం మా సూత్రబద్ధ వైఖరి. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా... అవిశ్వాసానికి మద్దతు ప్రకటించడం మా విధి. కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి వ్యతిరేకంగా నిలబడాల్సిన సమయం ఇది. మా పార్టీకి లోక్‌సభలో ముగ్గురు సభ్యుల బలమే ఉంది. మా పార్టీ విధానం గురించి, నిర్ణయాల గురించి నేను రూఢీగా చెప్పగలను. కానీ ఇతర పార్టీల గురించి ఎలా చెప్పగలను? మా పార్టీ వైఖరి మేరకు.. అవిశ్వాసానికి మేం మద్దతుగా నిలుస్తున్నాం.
 
 విలేకరులు: మీ ప్రణాళిక ఏమిటి?
 
 జగన్: ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని కోరుతూ శాసనసభ తీర్మానం చేయాలని నొక్కి చెబుతున్నాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం మినహా మరేదీ అంగీకారయోగ్యం కాదు.
 

>
మరిన్ని వార్తలు