కాంట్రాక్టర్ల ఎంపికకు కమిటీలెందుకు?

20 Nov, 2015 02:55 IST|Sakshi
కాంట్రాక్టర్ల ఎంపికకు కమిటీలెందుకు?

* ‘పెద్దల’ ఇష్టప్రకారం చేసుకునేప్పుడు అధికారులెందుకు?
* హై పవర్ కమిటీని రద్దు చేయాలన్న ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రమేశ్!
* ‘సింగిల్ టెండర్’ ఆమోదించాలన్న ప్రభుత్వ పెద్దల ఒత్తిడిపై అసంతృప్తి
* కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఆర్కే ఇన్‌ఫ్రాకు కట్టబెట్టిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: సాగునీటి శాఖలో రూ.100 కోట్లు, అంతకంటే ఎక్కువ విలువైన టెండర్లను ఖరారు చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన హై పవర్ కమిటీకి పేరులో మాత్రమే పవర్ ఉంది.

అది ప్రభుత్వ పెద్దల నిర్ణయాలకు తలొగ్గి వారి ఇష్టానుసారం నడుచుకోవాలే తప్ప నిబంధనల మేరకు వ్యవహరించేందుకు వీల్లేదు. ఈ నేపథ్యంలోనే పవర్ లేని ఈ కమిటీని రద్దు చేయాలంటూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేశ్ ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. సీఎస్ నేతృత్వంలోని ఈ కమిటీలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి (పి.వి.రమేశ్) కూడా సభ్యునిగా ఉన్నారు.

కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డికి చెంది న ‘ఆర్కే ఇన్‌ఫ్రా’కు కట్టబెట్టాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో.. రమేష్ తన అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తూ సాగునీటి శాఖకు, ప్రభుత్వానికి ‘నోట్’ పం పారు. హై పవర్ కమిటీ పేరిట అడ్డగోలు వ్యవహారాలను అధికారుల మీద రుద్దడాన్ని తప్పుబట్టారు.

రూ. 413 కోట్ల అంచనా వ్యయం తో కూడిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు గత జూలై 30న టెండర్లు పిలిచారు. ‘ఆర్కే-హెచ్‌ఈఎస్-కోయ’ జాయింట్ వెంచర్, ‘గాయత్రీ-డబ్ల్యూపీఐఎల్’ జాయింట్ వెంచర్‌లు టెండర్లు దాఖలు చేశాయి. ఒక్క ఆర్కే ఇన్‌ఫ్రా జేవీకే పనుల అర్హత ఉందని నిర్ధారించారు. ఒకే ఒక్క కంపెనీకి అర్హత ఉందని తేలితే.. టెండర్‌ను రద్దు చేసి మళ్లీ పిలవాలనే నిబంధన ఉంది.  

టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి చక్రం తప్పడంతో ‘సింగిల్ టెండర్’ అయినా.. ఆర్కే ఇన్‌ఫ్రాకే పనులు కట్టబెట్టాలని ప్రభుత్వ పెద్దల నుంచి నీటిపారుదల శాఖ అధికారులపై ఒత్తిడి వచ్చింది. ఫలితంగా ఆర్కే ఇన్‌ఫ్రా ప్రైస్ బిడ్, టెక్నికల్ బిడ్ ప్రక్రియలు అధిగమించింది.

రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ (ఎస్‌ఎల్‌ఎస్‌సీ) కూడా ఓకే (సెప్టెంబర్ 4న) చేసేసింది. ఇక సీఎస్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ వంతు వచ్చింది. ఈ కమిటీ ఆమోదించకపోతే టెండర్ రద్దే మార్గం. దీంతో ప్రభుత్వ పెద్దలు సీఎస్‌పైనా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ‘సింగిల్ టెండర్’ అయితే రద్దు చేయాలని నిబంధనలుంటే.. మనం ఎలా ఆమోదముద్ర వేయగలమని పి.వి.రమేశ్ గట్టిగా వాదించినట్లు సమాచారం.

‘‘ ‘ఫస్ట్ కాల్’ లోనే సింగిల్ టెండర్‌కు ఆమోదం తెలపాల్సిన అవసరం ఏమిటి? సెకండ్ కాల్‌కు వెళ్లొచ్చుకదా? అని రమేశ్ ప్రశ్నించినట్లు సమాచారం. ప్రభుత్వ పెద్దల ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకొనే పనైతే.. హైపవర్ కమిటీ ఎందుకు? అని రమేశ్ ప్రశ్నించినట్టు తెలిసింది.దీనిపై నీటిపారుదల శాఖకు, ప్రభుత్వానికి నోట్ పంపించారు.ఎస్‌ఎల్‌ఎస్‌సీ ఆమోదముద్ర వేసిన తర్వాత.. తుది నిర్ణయం కోసం నేరుగా ప్రభుత్వానికి పంపించాలని, నీటిపారుదల శాఖ మంత్రి లేదా  సీఎం నిర్ణయం తీసుకోవడానికి ఫైల్ పంపితే సరిపోతుందని సూచించారు.

ఈ నోట్  కలకలం సృష్టించింది. దీనిపై ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పెద్దల జోక్యంతో రమేష్ కూడా దారిలో పడినట్లు తెలిసింది. కాగా గత వారం జరిగిన హై పవర్ కమిటీ సమావేశంలో ‘సింగిల్ టెండర్’కు ఆమోదముద్ర వేశారు. తద్వారా రూ.413 కోట్ల విలువైన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను 4 శాతం ఎక్సెస్‌తో రూ.430 కోట్లకు టీడీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి చెందిన ఆర్కే ఇన్‌ఫ్రాకు ప్రభుత్వం కట్టబెట్టింది.

>
మరిన్ని వార్తలు