రియోలో మనకు ఆశించిన ఫలితాలు ఎందుకు రాలేదు?

22 Aug, 2016 19:33 IST|Sakshi
రియోలో మనకు ఆశించిన ఫలితాలు ఎందుకు రాలేదు?
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ లో తెలుగు తేజం పీవీ సింధుకు బ్యాడ్మింటన్ లో  రజత పతకం, హర్యానా అమ్మాయి సాక్షి మాలిక్‌కు రెజ్లింగ్‌లో కాంస్యం వచ్చినందుకు మనమంతా ఆనందిస్తున్నాం. హర్షిస్తున్నాం. అది సరే, రియో ఒలింపిక్స్‌పై మనం ఎన్ని ఆశలు పెట్టుకున్నాం? ఎంత మంది క్రీడాకారులను పంపించాం? ఎన్ని పతకాలను సాధించాం? ఆశించిన స్థాయిలో రాణించామా, లేదా ? లేకపోతే ఎందుకు ? అన్న అంశాలను ఇప్పడు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
 
రియో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి దాదాపు వంద మంది క్రీడాకారుల బృందాన్ని పంపించినప్పుడు మనవాళ్లు దాదాపు పది నుంచి పన్నెండు పతకాలను సాధించుకొస్తారని మీడియా ప్రచారం చేసింది. మనకు బీజింగ్ ఒలింపిక్స్‌లో మూడు, లండన్ ఒలింపిక్స్‌లో ఆరు పతకాలు రాగా ఈసారి  కచ్చితంగా రెండంకెల్లో పతకాలు వస్తాయని, 12 వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని గత మే నెలలో నాటి కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి సర్వానంద సోనోవాల్ బల్లగుద్ది మరీ చెప్పారు. ఎప్పటికప్పుడు క్రీడాకారుల ప్రతిభా పాటవాలను అంచనా వేస్తూ వచ్చిన భారతీయ క్రీడల సంఘం (ఎస్‌ఏఐ) 12 నుంచి 19 పతకాలు వస్తాయని అంచనా వేసింది. మరి జరిగిందేమిటీ?
 
కేవలం రెండు పతకాలతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఇలా ఎందుకు జరిగింది? ఆ....అమెరికా లాంటి దేశాలెక్కడా, మన దేశం ఎక్కడ? అక్కడ క్రీడలను ప్రోత్సహిస్తారు, క్రీడా సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. బ్రిటన్ లాంటి దేశాల్లో ఒక్క పతకం రావడానికి సరాసరి 46 కోట్ల రూపాయల చొప్పున క్రీడాకారులపై ఖర్చు పెడతారని అభినవ్ భింద్రా లాంటి వారే కామెంట్ చేశారు. ఆ స్థాయిలో భారత్‌లో క్రీడా సౌకర్యాలు లేవని, నిధులు లేవని చెబుతారు. వాస్తవానికి ఇది అర్ధ సత్యమే. 
 
2016-2017 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో భారత ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు కేటాయించింది. ఆ నిధులు ఎక్కడికి వెళుతున్నాయో, ఎక్కడ ఖర్చు చేస్తున్నారో, ఆ ఖర్చుకు వస్తున్న ఫలితాలేమిటో, అందుకు ఎవరు బాధ్యత వహిస్తున్నారో అన్న అంశాలను ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. భారత్ లాంటి దేశాల్లో అన్ని క్రీడలను ప్రోత్సహించాల్సిందే. కానీ ఏ క్రీడల్లో మనం రాణించగలం, ఎంత వరకు ప్రపంచ స్థాయిని అందుకోగలం? ముఖ్యంగా ఒలింపిక్స్‌లో మనకు మెడల్స్ దక్కాలంటే మనం ఏ ఆటలపైన ప్రధాన దృష్టిని కేంద్రీకరించాలి? అన్న అంశాలపై స్పష్టమైన అవగాహన అవసరం. 
 
భారతీయులు ఏ ఆటల్లో రాణిస్తున్నారో, వాటి మీదనే దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఒలింపిక్స్‌లో ఆర్చరి, బ్యాడ్మింటన్, టెన్నిస్, బాక్సింగ్, రెజ్లింగ్, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో భారత్ క్రీడాకారులు రాణి స్తున్నారు. వాటిలోనే వారిని ప్రోత్సహించేందుకు నిధులు ఎక్కువ ఖర్చు పెట్టాలి. కానీ అందుకు విరుద్ధంగా 2014-2015 సంవత్సరానికి భారత ప్రభుత్వం టెన్నిస్, బాక్సింగ్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్ విభాగాలకన్నా క్వాష్, యాటింగ్, వాలీబాల్ క్రీడలకు ఎక్కువ నిధులను కేటాయించింది.
 
అమెరికా జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్ మీద, దక్షిణ కొరియా ఆర్చరీ మీద, బ్రిటన్ సైక్లింగ్ మీద, చైనా టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ మీద, బెల్జియం హాకీ మీద, జర్మనీ ఫుట్‌బాల్ మీద దృష్టిని కేంద్రీకరించి, ఆ క్రీడల్లో రాణించడమే లక్ష్యంగా కృషి చేస్తున్న విషయం తెల్సిందే. మనం దేశం కూడా టార్గెట్ లక్ష్యంగానే కృషి చేయాలి. అభినవ్ భింద్రా, గగన్ నారంగ్, రాజ్యవర్ధన రాథోర్, మైఖేల్ ఫెరీరా, గీత్ సేథి, పంకజ్ అద్వానీ లాంటి క్రీడాకారుల అనుభవాలను ఉపయోగించుకోవాలి. 
 
పతకాలు గెలుచుకున్న క్రీడాకారులపై కాసుల వర్షం కురిపించి క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు ఎవరికివారు భుజాలు చరచుకుంటే సరిపోదు. ఇచ్చే కాసులకు కూడా క్రీడలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వారిని బాధ్యులను చేయాలి. క్రీడాకారులకు వ్యక్తిగత లబ్ధి చేకూర్చడం కన్నా క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల రాణింపునకు ఎక్కువ నిధులను ఖర్చు చేయాలి. ఖర్చు పెట్టే ప్రతి పైసాకు క్రీడా విభాగాల అధికారులను బాధ్యుల్ని చేయాలి. అంతవరకు ఒలింపిక్స్ లాంటి క్రీడల్లో మనం రాణించలేం. 
మరిన్ని వార్తలు