మగవారూ బురఖా ధరిస్తున్నారు...

31 Jul, 2016 11:09 IST|Sakshi
మగవారూ బురఖా ధరిస్తున్నారు...

ఇరాన్‌ పురుషులు ఇప్పుడు ట్రెండ్‌ మార్చారు. వాళ్లు కూడా బురఖా ధరిస్తున్నారు. ముస్లిం సంప్రదాయ వస్త్రమైన బురఖాపై ఒకవైపు మహిళా సంఘాల నుంచి విమర్శలు వ్యక్తమవుతుంటే.. పురుషులు కూడా బురఖా ధరించడమేమిటని ఆశ్చర్యపోతున్నారా? దీని వెనుక ఒక నిరసన ఉంది.

సంప్రదాయ ముస్లిం దేశమైన ఇరాన్‌లో మహిళల వస్త్రధారణపై కఠినమైన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు కచ్చితంగా బురఖా ధరించాలని, కళ్లు మాత్రమే కనిపించేలా వస్త్రధారణ ఉండాలనే కఠినమైన నిబంధనలను ఆ దేశం అమలు చేస్తోంది. మహిళల వస్త్రధారణపై ఆంక్షలు విధిస్తూ.. వారికి అడుగడుగునా ప్రతిబంధకాలు సృష్టించడంపై నిరసన వ్యక్తం చేస్తూ వెలుగులోకి వచ్చిందే ఈ నిరసన. ఇందులో భాగంగా పురుషులు కూడా మహిళల మాదిరిగా బురఖా లేదా, తలపై వస్త్రం (హిజాబ్‌) ధరించి ఫొటోలు పంపించాలని ‘మై స్టీల్‌థీ ఫ్రీడమ్‌’ ఫేస్‌బుక్‌ పేజీ పిలుపునిచ్చింది.

మహిళల వస్త్రధారణపై ఆంక్షలను నిరసిస్తూ సోషల్‌ మీడియాలో చేపట్టిన ఈ ఉద్యమానికి ఇప్పుడు మంచి స్పందన వస్తోంది. ఇరాన్‌కు చెందిన చాలామంది పురుషులు హిజాబ్‌ లేదా బురఖా ధరించి ఆ ఫొటోలు ఫేస్‌బుక్‌లో పెడుతున్నారు. ఇరాన్‌లోని సంస్కరణవాదులు, మహిళలు ధైర్యంగా తమ హక్కుల కోసం చేస్తున్న ఉద్యమానికి పురుషులు ఈవిధంగా తమవంతు మద్దతు అందిస్తున్నారు.  ఈ క్రమంలో ఈ ఫేస్‌బుక్‌ పేజీ అనతికాలంలో సోషల్‌ మీడియాలో బాగా పాపులర్ అయింది.

మరిన్ని వార్తలు