పిడుగుపాటుకు భారత్ లోనే ఎందుకు చనిపోతున్నారు?

27 Jun, 2016 18:29 IST|Sakshi
పిడుగుపాటుకు భారత్ లోనే ఎందుకు చనిపోతున్నారు?

న్యూఢిల్లీ: ‘వెన్ థండర్ రోర్స్, గో ఇన్‌డోర్స్’ అమెరికాలో ఎప్పుడూ వినిపించే సలహా ఇది. ఈ సలహా ఇప్పుడు భారత్ కచ్చితంగా పాటించాలి. ఎందుకంటే భారత్‌లో పిడుగుపాటుకు ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారు. ఉరుములతో కూడిన వర్షం పడుతుందంటే గుండెల్లో దడ తప్పని పరిస్థితి. గత వారమే, కేవలం 48 గంటల్లోనే దేశంలో పిడుగులు పడి 120 మంది మరణించారు. బిహార్‌లో 57 మంది, ఉత్తరప్రదేశ్‌లో 41 మంది, మధ్యప్రదేశ్‌లో 12 మంది, జార్ఖండ్‌లో పది మంది మరణించారు.

భారత్‌లో ఎందుకు ఎక్కువ మంది పిడుగుపాటుకు మరణిస్తున్నారంటే మూఢనమ్మకమే కారణం. పిడుగుపాటు అనేది భగవంతుడి క్రియని, దాన్ని ఎవరూ తప్పించలేరని ఇటు ప్రజలు, అటు ప్రభుత్వ యంత్రాంగం భావించడమే. ‘లైట్నింగ్‌కా క్యా ప్రిఫెన్షన్ హో సక్తా హై’ అని ఉత్తరప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ చంద్ర వ్యాఖ్యానించడమే ఈ విషయాన్ని సూచిస్తోంది. భారత్‌లో ఏ ప్రకృతి విలయంకన్నా ఎక్కువ మంది పిడుగుపాటుకే మరణిస్తున్నారనే విషయాన్ని అందుబాటులో ఉన్న మన గణాంకాలే తెలియజేస్తున్నాయి.

ఏడాదికి సరాసరి 1750 మంది పిడుగుపాటుకు మరణిస్తున్నారు. 2014లో 2,582 మంది, అంతకుముందు 2,833 మంది మరణించినట్లు మన నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో లెక్కటే చెబుతున్నాయి. 1967 నుంచి 2012 వరకు భారత్‌లో ప్రకృతి విలయం కారణంగా మరణించిన వారిలో పిడుగుపాటుకు మరణించిన వారి సంఖ్య 39 శాతం ఉందటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రకృతి విలయం అంటే భారీ వర్షాలు, కొండ చెరియలు విరిగి పడిన కారణంగా సంభవించిన మరణాలే కాదు. కరువు కారణంగా, వేడి, శీతల వాయువులకు బలైన వారిని కూడా కలుపుకొని చెప్పడమని గ్రహించాలి. ఈ మరణాలు అన్నీ కూడా అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం చెబుతున్నవే. సంబంధిత అధికారుల దృష్టికిరాని మూరుమూల కుగ్రామాల్లో సంభవించిన మరణాలను కలుపుకుంటే ఇంకా ఎక్కువే ఉంటాయి.


ఒకప్పుడు పిడుగుపాటుకు మరణించిన వారి సంఖ్య అమెరికాలో కూడా ఎక్కువే ఉండేది. ఆ దేశంలో 1970వ దశకం వరకు ఏటా సరాసరి 100 మంది మరణించేవారు. ఆ సంఖ్య 2015 నాటికి సరాసరి 27కు పడిపోయింది. అందుకు కారణాలు వెతికితే మనకూ తరుణోపాయం దొరకుతుంది. పిడుగుపాటు నుంచి ఎలా రక్షించుకోవాలో అమెరికా ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేసింది.

అందులో భాగంగానే ‘వెన్ థండర్స్ రోర్స్, గో ఇన్‌డోర్స్’ అన్న సలహా ఓ నానుడిలా ప్రజల్లో ప్రాచుర్యంలోకి వచ్చింది. అమెరికా ప్రభుత్వం కేవలం ప్రచారానికే పరిమితం కాలేదు. తుఫానులు, వర్షాల సమయంలో ఏయే ప్రాంతాలు ప్రమాదకరమైనవో, ఆ ప్రాంతాల్లో ఎప్పుడు పిడుగు పడే ప్రమాదం ఉందో కనిపెట్టి ఎప్పటికప్పుడు ప్రజలను హెచ్చరించేందుకు వారికి ఓ అధికార వ్యవస్థ ఉంది. అందుకే అక్కడ ఎక్కువ పిడుగుపాటు మరణాలు బీచ్‌ల ఒడ్డున మాత్రమే సంభవిస్తున్నాయి.

 భారత్‌లో పిడుగుపడే ప్రమాదకర స్థలాలు ఎక్కడొన్నాయో, ఎలాంటి పరిస్థితుల్లో పిడుగులు పడతాయో, ఎప్పుడు పడుతాయో తెలియజేసేందుకు ఎలాంటి వ్యవస్థ ఇంతవరకు లేదు. కనీసం పిడుగుపాటు నుంచి ఎలా తమను తాము రక్షించుకోవాలో ప్రజలకు చెప్పే వ్యవస్థ కూడా లేదు. దేశంలోని భూభౌతిక పరిస్థితులను అంచనావేసి వర్షాకాలంలో పిడుగుపడే ప్రమాదకర ప్రాంతాలు ఏమిటో మ్యాపింగ్ చేయవచ్చు. ఈ మ్యాపింగ్ ద్వారా అధిక వర్షపాతం ఎక్కడ పడుతుందో, కరువు పరిస్థితులు ఎక్కడుంటాయో గుర్తించడమే కాకుండా కొండ చెరియలు ఎక్కడ విరిగి పడే ప్రమాదం ఉందో, భూకంపాలు ఎక్కడ వచ్చే ప్రమాదం ఉందో కూడా గుర్తించే సౌలభ్యం ఉంటుంది. పిడుగుపాటుకు సంబంధించి మ్యాపింగ్ వ్యవస్థ అమెరికాలోనే కాకుండా కెనడాలో కూడా పటిష్టంగానే అమలు చేస్తున్నారు.

 భారత్‌లో పిడుగుపాటు మృతులను కనీసం ప్రకృతి విపత్తు కింద గుర్తించి ‘జాతీయ ప్రకృతి విపత్తు సహాయ నిధి’ నుంచి ఆర్థిక సహాయం అందించే పద్ధతి కూడా లేదు. పిడుగుపాటు మృతుల గురించి పలు సార్లు వివిధ రాష్ట్రాల నుంచి కేంద్రం ముందు చర్చకురాగా, ఈ విషయంలో రాష్ట్రాలే తమ ప్రకృతి విపత్తుల నిధి నుంచి ఓ పది శాతం నిధులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవచ్చనే, నష్టపరిహారం ఎంతివ్వాలన్నది రాష్ర్ట ప్రభుత్వాల చిత్తమేనంటూ కేంద్రం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. దీనిపై ఇంతవరకు దేశంలో ఒక్క బీహార్ రాష్ట్రమే స్పందించి పిడుగుపాటు బాధితులను ఆదుకునేందుకు ఇటీవల ఓ చట్టమే తీసుకొచ్చింది.

ఈ కొత్త చట్టప్రకారమే గతవారం పిడుగుపాటుకు మరణించిన 57 మందికి బీహార్ ప్రభుత్వం బాధితుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది. అలాగే ఆవులు, బర్రెలు, మేకలు, గొర్రెలు లాంటి జంతువులు మరణించినప్పుడు వాటి యజమానులకు చట్టప్రకారం 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ చ ట్టం కారణంగా పిడుగుపాటు నుంచి ప్రజలు తమను తాము రక్షించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చో పత్రికల ముఖంగా, టీవీ ఛానెళ్ల ద్వారా విస్తృత ప్రచారాన్ని కూడా కల్పించింది. అందులో కొన్ని.....

 తీసుకోవాల్సిన జాగ్రత్తలు
 1. ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉన్నప్పుడు సమీపంలోని పక్కా భవనంలోకి వెళ్లి తలదాచుకోవాలి.
 2. మైదాన  ప్రాంతాల్లో చెవులు మూసుకొని వంగి, మోకాళ్లపై కూర్చోవాలి.
 3. ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై సమాంతరంగా పడుకోవద్దు.
 4. ఓ బృందంగా వెళుతున్నప్పుడు. విడి విడిగా విడిపోయి నడవాలి.
 5. వీలైనంత వరకు మైదాన ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
 6. పర్వతాలలాంటి ఎత్తై ప్రదేశాలకు వెళ్లకూడదు.
 7. ఎత్తై చెట్ల కింద తలదాచుకోవద్దు.
 8. చార్జింగ్ అవుతున్న ఫోన్‌ను వినియోగించవద్దు.

మరిన్ని వార్తలు