మౌనమే నీ భాష ఓ....

11 Jun, 2015 16:27 IST|Sakshi
‘ఓటుకు నోటు’ వ్యవహారం(ఫైల్)

న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ప్రచ్ఛన్న మాటల యుద్ధానికి దారితీసిన 'ఓటుకు నోటు'  కుంభకోణంపై కేంద్రం ఎందుకు మౌనం పాటిస్తోంది? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆయన మంత్రివర్గ సభ్యులతో సమావేశమైన తర్వాత కూడా ఎందుకు మౌనం వీడడం లేదు? నకిలీ డిగ్రీ పట్టాల కేసులో ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్‌ను అరెస్టు చేయడంలో వేగంగా స్పందించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అయినా ఎందుకు స్పందించడం లేదు? కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామ్య పక్షంగా కొనసాగుతుండడం వల్ల ఆ మకిలి జోలికి వెళ్లిక పోవడమే తక్షణ కర్తవ్యంగా భావిస్తోందా?

మౌనమే మన భాష అనుకుంటుందా, వేచి చూస్తే బెటర్ అనుకుంటోందా? అవినీతి స్టింగ్ ఆపరేషన్‌లో ఉత్త పుణ్యానికి దొరికిపోయిన అలనాటి పార్టీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌కే ఉద్వాసన పలికిన చరిత్ర కలిగిన బీజేపీ.. ఈ వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదన్నది ప్రస్తుతం సామాన్యులను, అవినీతి మయమైన రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కోరుకుంటున్న తెలుగు ప్రజలను వేధిస్తున్న ప్రశ్నలు. తెలుగు ముఖ్యమంత్రుల పరస్పరారోపణలు, దూషణలతో తమకు సంబంధం లేదని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై వచ్చిన ఆరోపణల మీద అసలు విచారణ జరుగుతుందా, జరిగితే అది అర్ధవంతంగా ముగుస్తుందా? అన్న ప్రశ్నలకు కేంద్రం వైఖరి కారణం అవుతోంది.

రాజకీయాల్లో 'అంటు' ఉండదని, కేంద్రం పెద్దన్న పాత్ర నిర్వహించి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య కుదిర్చి 'ఓటుకు నోటు' కుంభకోణాన్ని ఓ రాజకీయ నాటకంగా చూసి దానికి తెరదించుతారా? అన్న అనుమానాలు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల అంతో ఇంతో విశ్వాసం కలిగిన మధ్యతరగతి మనుషుల మెదడులను తొలుస్తున్నాయి. 'ఏ కేసులోనైనా న్యాయం చేకూర్చడమే కాదు. న్యాయం జరిగినట్టు ప్రజలకు కనిపించాలి' అనే సుప్రీంకోర్టు సహజ న్యాయ సూత్రం ఈ కేసులో నిజమవుతుందా?

మరిన్ని వార్తలు