శశికళను ఎందుకు సీఎం చేయలేదు?

12 Dec, 2016 14:48 IST|Sakshi
శశికళను ఎందుకు సీఎం చేయలేదు?

చెన్నై: నగరంలోని రాజాజీ హాల్‌లో మంగళవారం ప్రజల సందర్శణార్థం ఉంచిన జయలలిత భౌతికదేహం పక్కన ఆమె ఆప్తురాలు శశికళా నటరాజన్ నల్లటి చీరను ధరించి వైరాగ్యంతో నిలబడి ఉన్నారు. చివరి రోజుల్లో కూడా జయ వెన్నంటి ఉన్న ఆమెకు ప్రజల రోదనలుగానీ, సందడిగానీ మరేమి వినిపిస్తున్నట్లు లేదు. ఆమె అలా శూన్యంలోకి చూస్తున్నారు. ఈ దృశ్యం చూస్తుంటే 1987 నాటి సీన్ పునరావృతం అవుతుందా? అనిపించక మానదు.

1987లో ఎంజీఆర్ మరణించినప్పుడు ఆయన తలపక్కన జయలలిత కూడా 16 గంటల పాటు కదలక, మెదలక అలా మ్రాన్పడి కూర్చుండిపోయారు. వ్యతిరేకులు తిట్టినా, హింసించినా పట్టించుకోలేదు. ఆ దృశ్యమే ఎందరినో కదిలించి ఆమెను ఎంజీఆర్‌కు వారసురాలిని చేసింది. జయలలిత వారసురాలవుతుందనుకున్న శశికళ మరి ఎందుకు కాలేకపోయారు? అన్నా దురై, ఎంజీఆర్‌లు చనిపోయినప్పుడు తొందరపడి సీఎంను ఎంపిక చేసుకోలేదు. మరి నిన్న రాత్రికి రాత్రి పన్నీర్‌సెల్వంను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం, ఆయన ప్రమాణస్వీకారం చేయడం ఆగమేఘాల మీద ఎందుకు జరిగిపోయింది?

[ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ]


కాంగ్రెసేతర పార్టీలు అధికారంలో ఉన్న చోట బీజేపీ తలదూర్చి ఎదుగుతోందని, ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో తలదూర్చేందుకు అవకాశం కోసం కాచుకుకూర్చోందని, ఆ అవకాశం ఇవ్వరాదనే ఉద్దేశంతోనే ఈసారి పన్నీర్‌సెల్వం ప్రభుత్వాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సి వచ్చిందని పార్టీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శశికళ పేరును పరిశీలించలేదా? అన్న ప్రశ్నకు ఆమెకు పార్టీలో ముఖ్యమైన పదవి ఇవ్వాలనే విషయంలోనే ఆమె పేరు ప్రస్థావనకు వచ్చిందని, ముఖ్యమంత్రి పదవికి కాదని, పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ మంత్రి తెలిపారు. ఆమెపై అవినీతి కేసు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున ఆమె ముఖ్యమంత్రి లేదా మంత్రిపదవి చేపట్టేందుకు వీలు లేదని ఆయన చెప్పారు. రెండేళ్లకు మించి జైలు శిక్ష పడిన వారు, వారు విడుదలైన రోజు నుంచి ఆరేళ్లపాటు ప్రజాప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్8(3) ప్రకారం పదవులు చేపట్టరాదు.

 జయలలితపై 20 ఏళ్ల క్రితం దాఖలైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు సాంకేతికంగా ఇప్పటికీ జీవించే ఉంది. ఈ కేసులో జయలలిత, ఆమె ఆప్తురాలు శశికళ, దత్త పుత్రుడు సుధాకరన్‌లకు బెంగుళూరు స్పెషల్ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు వందకోట్ల రూపాయల జరిమానా విధించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత కొంతకాలం జైలు శిక్ష అనుభవించాక, ట్రయల్ కోర్టు తీర్పును కర్ణాటక హైకోర్టు కొట్టివేయడంతో జయలలిత తిరిగి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం, శశికళ, సుధాకరన్‌లు కూడా జైలు నుంచి విడుదలవడం తెల్సిందే. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ చేయడంతో అవినీతి కేసుకు మళ్లీ జీవం వచ్చింది. దానిపై సుప్రీం కోర్టు తన తీర్పును వాయిదా వేసింది.

 అవినీతి కేసులో ప్రధాన నిందితురాలు మరణించినప్పుడు సహ నిందితులపై కేసు నడుస్తుందా? వారికి శిక్ష పడుతుందా? అంటూ సోషల్ మీడియాలో పలువురు యూజర్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. సూటిగా చెప్పాలంటే కేసు నిలబడదు. ఇలాంటి కేసులోనే ముంబై, ఢిల్లీ హైకోర్టులు పరస్పర భిన్నమైన తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో 2014లో జితేంద్ర కుమార్ సింగ్ అనే అధికారిపై సీబీఐ దాఖలు చేసిన కేసులో సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. అవినీతి నిరోధక చట్టం ప్రధాన లక్ష్యం లంచం తీసుకున్న ప్రభుత్వాధికారిని శిక్షించడమని, ప్రధాన నిందితుడే చనిపోయినప్పుడు చట్టం లక్ష్యం నెరవేరదుకనుక కేసును విచారణను కొనసాగించి లాభం లేదని తీర్పు చెప్పింది.

మరిన్ని వార్తలు