మాజీ భర్త హత్యకు కుట్ర..భగ్నం

14 Jul, 2017 20:27 IST|Sakshi
మాజీ భర్త హత్యకు కుట్ర..భగ్నం

హైదరాబాద్‌: మాజీ భర్తను హతమార్చేందుకు యత్నించిన భార్య పన్నిన కుట్రను పోలీసులు సకాలంలో స్పందించి భగ్నం చేశారు. మియాపూర్లోని పెట్రోల్ పంపుల యజమాని శ్యామ్ సుందర్ రెడ్డిని హతమార్చాలని మాజీ భార్య శిరీష రెడ్డి తండ్రి వాసుదేవరెడ్డి, సుపారి గ్యాంగ్ తో కలసి చేసిన ప్రయత్నాన్ని సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులు విఫలం చేశారు.

వివరాల్లోకి వెళితే... శ్యామ్ సుందర్ రెడ్డిది వరంగల్ జిల్లా పరకాల. అదే గ్రామానికి చెందిన దగ్గర బంధువైన శిరీషను ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. శిరీష తండ్రి వాసుదేవరెడ్డి బీడీ కార్మికుడు. కొంతకాలం క్రితం నగరానికి వచ్చి స్థిరపడిన శ్యామ్ సుందర్ రెడ్డి మామను, పదో తరగతి చదివిన బావమారిదిని నగరానికి తీసుకువచ్చి అతనికున్న పెట్రోల్ బంకుల్లో భాగస్వామ్యం కల్పించాడు.

వీరికి ఇద్దరు పిల్లలు వీళ్ళ వైవాహిక జీవితం కొంత కాలం బాగానే సాగింది. గత ఐదు సంవత్సరాలుగా వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి అప్పటి నుంచి ఆ గొడవలు కాస్త విడాకులకు దారి తీసింది. విడాలులు తీసుకుని శ్యామ్‌సుందర్‌ రెడ్డి, శిరీష వేర్వేరుగా ఉంటున్నారు. కాగా ఇటీవలే శ్యామ్ సుందర్ రెడ్డి వేరే వివాహం కూడా చేసుకున్నాడు. అయితే, అతడిని మట్టుబెట్టాలనుకున్న శిరీష, ఆమె తండ్రి వాసుదేవరెడ్డి సమీప బంధువైన కొండల్ రెడ్డి తో నెల రోజుల క్రితం సుపారి గ్యాంగ్ ను కలసి రూ.12 లక్షలకు డీల్ కుదుర్చుకుని 2 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు.

పని అయిన తరువాత మిగతా 10 లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఈ గ్యాంగ్ పలుమార్లు మియాపూర్ పరిసర ప్రాంతాల్లో రెక్కీ కూడా నిర్వహించింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఈ గ్యాంగ్‌ను పట్టుకోవటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే రూ.15 కోట్ల ఆస్తి శిరీష పేరుమీదనే ఉందని అది కాకుండా మెయింట్‌నెన్సుగా ప్రతినెలా లక్ష రూపాయలు భరణంగా చెల్లిస్తున్నానని, అయినా తన మీద పగబట్టి చంపాలని చూస్తుందని శ్యామ్ సుందర్ రెడ్డి వాపోయాడు.

మొత్తానికి మర్డర్ ప్లాన్ భగ్నం కావడంతో శ్యామ్ సుందర్ రెడ్డి బతికి బట్టకట్టాడు. ఈ కుట్రలో పాల్గొన్న శిరీష తండ్రి వాసుదేవరెడ్డి , కొండల్‌రెడ్డితో పాటు పాత బస్తీ హంతక ముఠాకు చెందిన మజర్, అమ్జాద్, అబ్దుల్ ఖాదర్, అప్సర్, నవీద్, సయ్యద్ వసీం పోలీసుల అదుపులో ఉన్నారు. గతంలో అమ్జద్పై రెండు మర్డర్ కేసులు, అప్సర్పై ఒక మర్డర్ కేసు ఉన్నాయని వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు