పాకిస్థాన్‌కు ఆఫ్గనిస్థాన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్

11 Sep, 2016 14:04 IST|Sakshi
పాకిస్థాన్‌కు ఆఫ్గనిస్థాన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్

ఇస్లామాబాద్‌: అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో పొరుగుదేశం పాకిస్థాన్‌ను ఆఫ్గనిస్థాన్‌ గట్టిగా హెచ్చరించింది. భారత్‌తో వాణిజ్యానికి వాఘా సరిహద్దును ఉపయోగించుకోవడానికి తమకు అనుమతి ఇవ్వకపోతే.. మధ్య ఆసియా దేశాలకు వెళ్లేందుకు తమ దేశం మీదుగా పాకిస్థాన్‌ను అనుమతించబోమని తేల్చిచెప్పింది. ఈ మేరకు తమ దేశం మీదుగా ఉన్న పాకిస్థాన్‌ అంతర్జాతీయ రవాణా మార్గాన్ని మూసివేస్తామని ఆఫ్గన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘని తెలిపారు.

ఆఫ్గన్‌, పాక్‌ దేశాల బ్రిటన్‌ ప్రత్యేక రాయబారి ఓవెన్‌ జెంకిన్స్‌తో అష్రఫ్‌ ఘనీ భేటీ అయిన ఈ సందర్భంగా ఈ హెచ్చరిక చేశారు. 'ఆఫ్గన్‌ వ్యాపారులు వాఘా సరిహద్దు మీదుగా ఎగుమతి, దిగుమతులు చేసుకునేందుకు అనుమతించకపోతే.. మా దేశం మీదుగా మధ్య ఆసియా, ఇతర దేశాలకు ఎగుమతులు చేసుకునేందుకు పాక్‌కు మేం అనుమతి ఇవ్వబోం' అని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక సహకారానికి అడ్డంకిగా మారిన అన్ని సాంకేతిక సమస్యలను పాక్‌, ఆఫ్గన్‌లతోపాటు ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు తొలగించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉన్న వాఘా సరిహద్దును పండ్ల సీజన్‌లో పాకిస్థాన్‌ మూసివేస్తుండటంతో ఆఫ్గన్‌ వ్యాపారులకు మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పండ్ల ఎగుమతి విషయంలో తమకు ఫైనాషియల్‌ టారిఫ్‌ను మినహాయించడానికి భారత్‌ ఒప్పుకున్నదని అష్రఫ్‌ ఘనీ తెలిపారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ భూభాగం మీదుగా వాఘా సరిహద్దుల్లోని భారత పట్టణం అట్టారీకి పండ్లను ఎగుమతి చేసేందుకు పాక్‌ అనుమతించాలని ఆఫ్గన్‌ అధికారులు కోరుతూ వస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు