‘ముందస్తు’కు కాంగ్రెస్ కసరత్తు?

24 Aug, 2013 04:50 IST|Sakshi

న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఐదురాష్ట్రాల ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు కూడా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నదా..? ఢిల్లీలో పరిణామాలు, అందుతున్న సంకేతాలు ఈ దిశగానే ఉన్నాయంటూ పీటీఐ వార్తాసంస్థ కథనం తెలియజేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టో కోసం 15 రోజుల్లోగా సమాచారం పంపాల్సిందిగా శుక్రవారంనాడు వివిధ రాష్ట్రాల విభాగాలకు కాంగ్రెస్ పార్టీ నుంచి వర్తమానమందింది. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సమాచారంతో పాటు దేశం మొత్తానికి వర్తించే సూచనలు, సలహాలు కూడా పంపించవచ్చని కోరినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
 
  నవంబర్ - డిసెంబర్‌లలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఢిల్లీ, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు కూడా నిర్వహించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం అధిష్టానాన్ని గట్టిగా కోరుతున్నట్లు సమాచారం. ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు నిర్వహించడం వల్ల మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారంలో ఉన్న బీజేపీని ఇరుకున పెట్టవచ్చని ఆ వర్గం పేర్కొంటున్నది. అదీగాక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గనుక మెరుగైన ఫలితాలు సాధించలేకపోతే తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మరిన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుందని ఆ వర్గం హెచ్చరిస్తున్నది. లోక్‌సభ ఎన్నికలు వచ్చే ఏడాది మేలో జరగాల్సి ఉంది.
 
 అయితే మరి కొందరు నాయకులు మాత్రం ముందస్తు ఎన్నికల ఊహాగానాలను కొట్టిపడేస్తున్నారు.  చివరిరోజు వరకూ పదవీకాలం పూర్తి చేయడానికే పార్టీ మొగ్గుచూపుతుందంటున్నారు. లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం కావడం కోసం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నాయకత్వంలో ఏఐసీసీ ఇప్పటికే ఒక ఉన్నతస్థాయి సమన్వయ కమిటీని నియమించింది. పొత్తుల అంశాన్ని పరిశీలించడం కోసం సీనియర్ నాయకుడు, రక్షణమంత్రి ఏకే ఆంటోనీ నాయకత్వంలో ఉప సంఘాన్ని కూడా నియమించారు. అయితే ఆంటోనీ కమిటీ ఇప్పటివరకూ పని ప్రారంభించిన దాఖలాలు లేవు. కమిటీ ఇంతవరకూ ఎన్నిసార్లు సమావేశమైందనే విషయాన్ని కూడా ఆంటోనీ వెల్లడించడం లేదు. మేనిఫెస్టో, ప్రభుత్వ కార్యక్రమాలపై వేసిన ఉపసంఘానికి కూడా ఆంటోనీయే నాయకత్వం వహిస్తున్నారు. కమ్యూనికేషన్, పబ్లిసిటీపై ఉపసంఘానికి దిగ్విజయ్‌సింగ్ నేతృత్వం వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు