అబ్బే.. అలా అనలేదు: షిండే

26 Feb, 2014 03:58 IST|Sakshi
అబ్బే.. అలా అనలేదు: షిండే

షోలాపూర్: కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియాలోని ఒక వర్గాన్ని అణచేస్తామంటూ హెచ్చరించిన కేంద్ర హోం మంత్రి షిండే.. తన మాటలను సవరించుకున్నారు. నలువైపులా విమర్శలు రావడంతో.. సోషల్ మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించానే గానీ, జర్నలిస్టులను తానేమీ అనలేదని షిండే స్పష్టం చేశారు. ఈ మేరకు మహారాష్ట్రలోని తన సొంత నియోజకవర్గమైన షోలాపూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియా గురించి.. హైదరాబాద్‌లో, కర్ణాటకలో ఈశాన్య ప్రజలపై జరిగిన హింసను ఉద్దేశించి మాట్లాడానని వివరించారు.
 
 నిజానికి షిండే ఎలక్ట్రానిక్ మీడియాను ఉద్దేశించే ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎలక్ట్రానిక్ మీడియాలో ఏం జరుగుతుందో నాకు తెలుసు. నాలుగు నెలలుగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఒక వర్గం తప్పుడు ప్రచారానికి పాల్పడుతోంది. నా పరిధిలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఎవరు అలా చేస్తున్నారో నాకు తెలుసు. అలాంటి శక్తులను అణచివేస్తాం’’ అని షిండే హెచ్చరికగా మాట్లాడారు. ఇటీవల కొన్ని జాతీయ చానెళ్లు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏ హవా గురించిన సర్వే ఫలితాలను ప్రముఖంగా ప్రసారం చేస్తుండడంతో షిండే ఇలా మాట్లాడటం గమనార్హం.
 
 ‘పార్టీ ఆఫీసుల్లోని పెళ్లిళ్లు చెల్లవు’
 కోచి: రాజకీయ పార్టీల కార్యాలయాల్లో జరిపే వివాహాలు చట్టపరంగా చెల్లబోవని కేరళ హైకోర్టు తీర్పుచెప్పింది. వివాహ నమోదు అధికారి (రిజిస్ట్రార్) ముందు లేదా మతపరమైన సంప్రదాయాల ప్రకారం జరిగిన వివాహాలకే చట్టపరంగా గుర్తింపు ఉంటుందని స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు