చిన్నమ్మకు షాక్!

12 Dec, 2016 16:41 IST|Sakshi
చిన్నమ్మకు షాక్!

చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆంతరంగికురాలు శశికళ నటరాజన్ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా  ఎన్నిక కానున్నారనే అంచనాలపై  పార్టీ బహిష్కృత నేత, రాజ్యసభ సభ్యురాలు  శశికళ పుష్ప అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.అలా జరగడానికి వీల్లే దని  ఆమె తెగేసి చెపుతున్నారు. తన  ప్రాణం పోయేంత వరకు  చిన్నమ్మ(శశికళ) మీద పోరాటం చేస్తానని ఆమె  సవాల్  చేశారు. తన చివరి శ్వాస వరకూ  ఆమె కుట్రలను సాగనివ్వనని హెచ్చరించారు.

చెన్నైలో  మీడియాతో మాట్లాడిన శశికళ పుష్ప  కేవలం శశికళ గ్రూపు కారణంగానే అమ్మకు ఏదో జరిగిందన్న అందరూ నమ్ముతున్న  ప్రస్తుత తరుణంలో ఆమె పార్టీ భవిష్యత్ నేత ఎలా అవుతుందని ప్రశ్నించారు.  కనీసం పార్టీలో సభ్యత్వం కూడా  లేనిశశికళ నటరాజన్ కు కు ప్రధాన కార్యదర్శిగా  భాద్యతలు ఎలా అప్పగిస్తారని పార్టీ సీనియర్లను ప్రశ్నించారు. శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు తీసుకున్న తరువాత ఆ పార్టీని ఆమె భర్త నటరాజన్ నడిపిస్తాడని, అందులో ఎలాంటి డౌట్ లేదని  శశికళ పుష్ప  ఆగ్రహం వ్యక్తం చేశారు.

శశికళకు  ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై మద్దుతుపై ప్రశ్నించినపుడు అన్నాడీఎంకే పార్టీలోని సీనియర్లను శశికళ నటరాజన్ కుటుంబసభ్యులు బెదిరిస్తున్నారని, అందుకే వారు పార్టీ పగ్గాలను ఆమెకు అప్పగించడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ కుట్రలను తాను అడ్డుకుంటానని అన్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని పార్టీకి దిశా నిర్దేశం చేయాలని ఆశిస్తున్నాన్నారు.  సీనియర్లకే ఆ పదవి వచ్చేలా చెయ్యాలని, శశికళ నటరాజన్ కుట్రలను అడ్డుకోవాలని శశికళ పుష్ప  కోరారు.

జయలలితకు శశికళ 35 సంవత్సరాలు సేవ చేసినంత  మాత్రాన  అన్నాడీఎంకే పార్టీ ప్రధాని కార్యదర్శి పదవి  ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మా ఇంటిలో గత 25 సంవత్సరాల నుంచి ఒకరు పని చేస్తున్నారు అయితే తన పదవిని ఎలా ఇచ్చేస్తానంటూ ఎద్దేవా చేశారు.  అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ ఉండటానికి ఆ పార్టీ కార్యకర్తలు, తమిళనాడు ప్రజలు అంగీకరించరన్నారు. శశికళ నటరాజన్ చేతికి పగ్గాలు ఇస్తే వారి కుటుంబ సభ్యులను రాజ్యసభలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తారని ఆరోపించారు.ఇప్పటికైన పార్టీ లీడర్లు జోక్యం చేసుకుని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని తీసుకుని కార్యకర్తలకు అండగా నిలవాలన్నారు. కాగా  అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి సి. పొన్నియన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ  అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి సీనియర్లు పోటీ పడుతున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని ,శశికళనే పార్టీ పగ్గాలు చేపడుతారనే సంకేతాలు అందించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు