-

సౌరవిద్యుత్‌లోనూ ముందడుగు వేస్తాం: నాయిని

8 Sep, 2015 01:54 IST|Sakshi
సౌరవిద్యుత్‌లోనూ ముందడుగు వేస్తాం: నాయిని

సాక్షి, హైదరాబాద్: తెలంగాణను కరెంట్ కోతల్లేని రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ఇందుకోసం సౌరవిద్యుత్‌ను కూడా పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలోనూ సౌరశక్తిని వాడుకోవాలన్న నిపుణుల సూచనలను కూడా పరిగణలోకి తీసుకుంటామని, తగిన ప్రణాళికతో దీన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో సోమవారం ‘ఎకోష్యూర్’ పేరుతో సోలార్ ఎనర్జీపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రం సౌరశక్తి రంగంలోనూ గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. తెలంగాణ పోరాట సమయంలోని విద్యుత్ కోతలను అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళితే... తెలంగాణ ఏర్పడితే విద్యుత్ ఉండదని, అంధకారంలో బతకాలని చులకన చేశారని, కానీ కేసీఆర్ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేశారని చెప్పారు.
 
 అన్ని వీధిదీపాలూ సోలార్‌తో: రాష్ట్రం లోని అన్ని వీధిదీపాలనూ సౌరశక్తితో పనిచేయించడం ద్వారా డిమాండ్, సరఫరాల మధ్య అంతరాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు మాజీ చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర టి.ఎల్.శంకర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 3.27 లక్షల వీధిదీపాలను సౌరశక్తితో పనిచేయిస్తే దాదాపు 4.5 కోట్ల యూనిట్ల విద్యుత్తు ఆదా అవుతుందని తేలిందని చెప్పారు. వ్యవసాయ విద్యుత్తు కోసం ప్రత్యేక ఫీడర్ ఏర్పాటు చేస్తే మరింత మేలు జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఈపీటీఆర్‌ఐ చైర్మన్ కళ్యాణ చక్రవర్తి, యూకేఎం సోలార్ మంథా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు