‘చచ్చినా’ వదలరు!

10 Sep, 2015 01:58 IST|Sakshi
‘చచ్చినా’ వదలరు!

కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల ధనదాహం  
అడ్మిట్ నుంచి డిశ్చార్జి దాకా దోపిడీ
రోగులను కాసులిచ్చే యంత్రాల్లా చూస్తున్న వైనం
బీమా కార్డు దొరికిందా.. లిమిట్ అయ్యే దాకా గుంజుడే
కొన్ని సందర్భాల్లో చనిపోయినా బయటకు చెప్పకుండా చికిత్స
అవసరం లేకున్నా ఆపరేషన్లు చేయాల్సిందేనని భయపెడుతున్న తీరు
కాలికి నొప్పి అని వెళ్తే ‘చిప్ప’ మార్చాల్సిందేనంటూ సలహాలు
ఇరు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో ‘చిప్ప’ బాధితులు
వైరల్ ఫీవర్లకూ రూ.70 వేల దాకా పిండుతున్న ‘వైరస్’లు
ఇన్సూరెన్స్‌లోనూ దగా.. ప్రైవేటు కంపెనీ అయితే సై.. ప్రభుత్వమైతే నై

 
మెహిదీపట్నంలోని ఓ ఆసుపత్రి. విప్రోలో ఉద్యోగం చేస్తున్న యువతి పచ్చకామెర్ల సమస్యతో చేరింది. ఒళ్లు కూడా పసుపు రంగులోకి మారటంతో పరిస్థితి సీరియస్‌గా ఉంది. వెళ్లగానే ఆమె బీమా కార్డును తీసుకున్నారు ఆసుపత్రి సిబ్బంది. రూ.6 లక్షల వరకూ క్యాష్‌లెస్ సౌకర్యం ఉండటంతో చికిత్స మొదలుపెట్టారు. ఆమెతో వచ్చిన బంధువులకు మాత్రం ఏమీ చెప్పటం లేదు. రెండ్రోజులు గడిచాయి. అప్పటికే రెండు సర్జరీలు చేశామన్నారు. అసలు పరిస్థితి ఎలా ఉంది? ఏం ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు? అని అడిగిన బంధువులకు కేసు చాలా సీరియస్ అని, మరో సర్జరీ చేయాలని చెప్పారు. అది కూడా చేసేశారు. ఇప్పుడు ఓకేనా? అని అడిగితే... చెప్పలేమని, 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పారు.
 
 మూడోరోజు మధ్యాహ్నం వచ్చి... సాయంత్రం మేజర్ సర్జరీ చేస్తామని, ఆ తరవాతే కండిషన్ చెబుతామని చెప్పారు. ఇంతలో అమ్మాయి తరఫున వచ్చిన బంధువులు తమ దగ్గరి చుట్టమైన ఓ డాక్టర్‌కు ఫోన్ చేశారు. ఆయన ఆసుపత్రి సిబ్బందితో నేరుగా ఫోన్లో మాట్లాడారు. ఏ సర్జరీ చేస్తున్నారు? ఏ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు? అని అడిగితే వాళ్లు నీళ్లు నమిలారు. ఏమీ  చెప్పలేకపోయారు. ఇంతలో అనుమానం వచ్చిన ఆ బంధువులు మీడియాలో ఉన్న తమ మిత్రుడికి చెప్పారు. ఆయన కూడా ఫోన్ చేసి అడిగారు. ఇంతలో ఆసుపత్రి సిబ్బంది బంధువుల దగ్గరకు వచ్చారు. ‘‘సారీ! ఇక సర్జరీ అవసరం లేదు. ఇప్పుడే ఆమె మరణించింది. మీరు బిల్లులు క్లియర్ చేసి బాడీ తీసుకెళ్లొచ్చు’’ అన్నారు. బాడీ కోసం ఎంతైనా ఇస్తారనే బలహీనతను ఆసరా చేసుకుని... చివరికి బీమా సొమ్ము కాకుండా 1.5 లక్షలు గుంజి... బాడీని అప్పగించారు!    
 - సాక్షి ప్రత్యేక బృందం
 
 ఈ సీన్‌కు ‘అంకురార్పణ’ జరిగింది కూకట్‌పల్లిలోని ఓ పిల్లల ఆసుపత్రిలో. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్  జి.నరసింహారావు కుటుంబంతో సహా తన స్వగ్రామం నుంచి హైదరాబాద్‌కు బస్సులో వచ్చాడు.10 గంటలకు పైగా ప్రయాణం. విపరీతమైన వేడి కావటంతో... తన 11 నెలల పాప యూరిన్‌కు వెళ్లటం కష్టమై అదేపనిగా ఏడవటం మొదలెట్టింది. రాత్రి 10 దాటినా ఏడుపు ఆపకపోవటంతో కంగారుపడి దగ్గర్లోని పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లాడు. విషయం చెప్పటంతో డాక్టరో, స్టూడెంటో తెలియని ఓ 20 ఏళ్ల అమ్మాయి... చెకప్ చేసి ఐస్ గడ్డలతో ప్రాథమిక చికిత్స చేసింది. బాడీ చల్లబడటంతో పాప ఏడుపు మాని... రెండు గంటల తరవాత నిద్రపోయింది.
 
 హమ్మయ్య! అనుకుని అప్పటికైన బిల్లులు చెల్లించాడు. పాపను తీసుకెళదామనుకున్నాడు. అయితే అంతటితో వదలటానికి ఇష్టపడని ఆసుపత్రి సిబ్బంది... నిద్రపోతున్న పాపను లేపి తల్లిదండ్రులిద్దరినీ బయటకు పంపేశారు. వారి అనుమతి లేకుండానే ఆపరేషన్ మొదలెట్టారు. మూడు నిమిషాల తరవాత సందేహం వచ్చిన నరసింహారావు... బలవంతంగా తలుపు తోసుకుని లోపలికెళ్లాడు. పాపకు బ్లీడింగ్ అవుతుండటం చూశాడు. అదేమని అడిగితే... యూరిన్ రావటంలేదు కనక ఆపరేషన్ చేస్తున్నామన్నారు ఆ సిబ్బంది. అరిచి, వారిని తిట్టి పాపను ఇంటికి తీసుకెళ్లిపోయాడాయన. రాత్రి నిద్రపోయాక పరిస్థితి సద్దుమణిగింది. ఆపరేషన్ పేరిట వాళ్లు చేసిన గాయం మానటానికి కొద్దిరోజులు పట్టింది.
 
 ‘కాసు’పత్రుల ధనదాహానికి అంతులేదని చెప్పటానికి ఒకటా... రెండా!! వందలు, వేల ఉదాహరణలున్నాయి. బతికున్నవారిని పీల్చి పిప్పిచేసి జీవచ్ఛవాలుగా మార్చటమే కాదు. చచ్చిన వారికి కూడా ట్రీట్‌మెంట్ చేసి కాసులు గుంజగల నేర్పరితనం వీళ్ల సొంతం. రేపోమాపో చనిపోయే వ్యక్తి కూడా.. బతకటానికి అవకాశముందంటే ఎంతైనా ఖర్చుపెడతాడు. అదే ఈ కార్పొరేట్ ఆసుపత్రుల బలం... పేషెంట్ల బలహీనత. నిజానికి వైద్యమనేది సామాన్యులకు అర్థంకాని వ్యవహారం. టెస్టులు, మందులతో సహా చికిత్స కూడా ఏది అవసరమో, ఏది అనవసరమో తనను చూసే డాక్టరుకు తప్ప వేరెవ్వరికీ తెలిసే అవకాశం లేదు.
 
 అక్కడ సరిగా ఉంటే అంతా బాగున్నట్టే. సరిగా లేనప్పుడే సమస్య. కొన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల వైఖరితో ఈ సమస్య పెరిగిపోతూనే ఉంది. మరిన్ని బ్రాంచీలు పెట్టడం, మరింత విస్తరించటం.. మరిన్ని లాభాలు ఆర్జించటం.. ఇలా వాటి ధనదాహానికి అంతు లేకుండాపోతోంది. ఈ మధ్య జరిగిన ఓ సంఘటన చూద్దాం.. రోడ్డుపై ఆడుకుంటున్న కోయ బాలుడిని ఓ వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది.
 
 కాలు బాగా దెబ్బతిన్న ఆ చిన్నారిని అబ్బాయి తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారి దగ్గర రూ.10 వేలే ఉన్నాయి. అది కనిపెట్టారు హాస్పిటల్‌లోని ‘బ్రాండింగ్’ సిబ్బంది. ‘‘వాళ్ల దగ్గరున్న 10 వేలకు వైద్యం చేయలేం కనక కాలు తీసేద్దాం’’ అని వాళ్లు డాక్టర్‌తో చెప్పారు. ‘చిన్నారి బతకాలంటే ఎలాగూ కాలు తొలగించాల్సిందే కదా’ అని తమ వాదనను సమర్థించుకున్నారు కూడా. కానీ ఆ డాక్టర్‌లో కాస్త మానవత్వం ఉంది. అందుకే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత, సొంతగా తను కొంత భరించి ఆ చిన్నారికి చికిత్స చేశారు. అదృష్టవశాత్తు ఆ చిన్నారి కాలు బాగయ్యింది. మరి ఆ బ్రాండింగ్ గోముఖాల మాటను డాక్టర్ విని ఉంటే? దీని పర్యవసానం ఆలోచించడానికే భయమేస్తుంది.
 
సీజనల్ జ్వరాలైనా దోపిడీనే..
 కొన్ని సీజన్లలో వైరల్ ఫీవర్లు సహజం. కొన్ని ఫీవర్లు పారాసిటమాల్ ట్యాబ్లెట్లతో తగ్గిపోతాయి. కానీ పొరపాటున ఈ ఫీవర్లతో కార్పొరేట్ ఆసుపత్రులకు గనక వెళ్లారా.. అంతే!! వెళ్లగానే ‘డెంగీ’ లేదా ‘స్వైన్ ఫ్లూ’ అనుమానిత కేసుగా పేర్కొంటారు. అక్కడ్నుంచి మొదలవుతుంది అసలు డ్రామా. నిజానికి డెంగీ చికిత్సకు పారాసిటమాల్ మాత్రలు చాలు. ప్లేట్‌లెట్ ప్యాక్ కూడా రూ.900 మించదు. ఇక స్వైన్‌ఫ్లూ అయితే మెడిసిన్‌ను పూర్తిగా ప్రభుత్వమే సరఫరా చేస్తోంది.
 
 కార్పొరేట్ ఆసుపత్రులకు కూడా సర్కారే ఉచితంగా ఇస్తోంది. కానీ ఈ జ్వరాలకు చికిత్స పూర్తయ్యేసరికి కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.60 నుంచి 70 వేల వరకూ బిల్లు తయారవుతోంది. ప్లేట్‌లెట్లు తగ్గాయంటూ రోగుల్ని భయపెడుతూ దోపిడీకి తెరదీస్తున్నారు. రూ.500-600ల్లో డెంగీ నిర్ధారణ చేయొచ్చు. వారంపాటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేసినా రూ.5 వేల నుంచి 6 వేల ఖర్చవుతుందని కొందరు సీనియర్ వైద్యులు చెబుతున్నారు. అయితే పలు కార్పొరేట్ ఆసుపత్రులు ఒక్కో రోగి నుంచి వేలకు వేలు గుంజుతున్నాయి.
 
రోగుల చేతికి చిప్పలు...
కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్ల దోపిడీ ఎంత అమానవీయంగా ఉందో చెప్పేందుకు మరో ఉదాహరణ చూద్దాం. ఒక హాస్పిటల్ మోకాళ్ల చిప్పల మార్పిడికి పేరు పొందింది.  కాలిలో చిన్న నొప్పొచ్చి అక్కడికి వెళితే చాలు. మోకాలి చిప్ప అరిగిపోయిందనీ, శస్త్రచికిత్స తప్పదని రోగిని భయపెడతారు. సర్జరీ చేయించకపోతే భవిష్యత్తు ఘోరంగా ఉంటుందని భయపెడతారు. ఇలాంటి అనుభవం చవిచూసిన చాలా మంది మరోచోట సెకండ్ ఒపీనియన్ పొంది, ఆపరేషన్ అవసరం లేదని ఊరట పొందిన దాఖలాలు చాలా ఎక్కువ. ఈ రంగంలో రోగుల పట్ల మానవీయ, నైతిక వర్తన ఉన్న డాక్టర్లను వేళ్లమీద లెక్కించొచ్చు.
 
 ఈ చిప్పల మార్పిడి చికిత్స పొంది చేతికి చిప్పను పొందినవారి సంఖ్య.. ఇరు రాష్ట్రాల్లో వేల కొద్దీ ఉంటుందంటే వీళ్ల స్థాయిని అర్థం చేసుకోవచ్చు. ఇక తాము ఇన్నిన్ని సర్జరీలు చేశామంటూ వాళ్లు ప్రచారం చేసుకోవడం మరో ప్రహసనం. కానీ ఆ సర్జరీల్లో విజయవంతమైనవి ఎన్ననేది ఏ ఆసుపత్రీ చెప్పదు. దీనికే కాదు. అన్ని శస్త్రచికిత్సల విషయంలోనూ టార్గెట్స్ కోసమే చేయటమనే ధోరణి సాగుతూనే ఉంది.
 
ఇన్సూరెన్స్‌లోనూ వివక్ష...
 ప్రజల్లో ఆరోగ్య ఖర్చులపై అవగాహన గతం కన్నా పెరిగింది. దాంతో ఇటీవల ఆరోగ్య బీమా తీసుకునే వారి సంఖ్య పెరిగింది. దాంతో పాటే ఇన్సూరెన్స్ కంపెనీలకు క్లెయిముల తాకిడి కూడా పెరిగింది. దీంతో బీమా కంపెనీలు ఆయా రోగులకు సదరు చికిత్స అవసరమో, కాదో నిర్ణయించేందుకు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ) పేరిట నియంత్రణాధికారిని నియమిస్తున్నాయి.
 
 ప్రైవేటు బీమా కంపెనీల మాదిరి కాకుండా ప్రభుత్వ బీమా సంస్థలు ఆయా వైద్యపరీక్షలకు, చికిత్సలకూ కార్పొరేట్ హాస్పిటళ్లు నిర్దేశించిన రుసుము (టారిఫ్) కాకుండా, తాము నిర్దేశించుకున్న రుసుమునే చెల్లిస్తాయి. దీంతో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వ ఉద్యోగులకు చికిత్స నిరాకరించడానికి కూడా వెనకాడటం లేదు. అయితే ఈ విషయం నేరుగా చెప్పకుండా... తమ వద్ద పడకలు ఖాళీగా లేవనో, ఇతర సాకులు చూపించటమో చేస్తున్నారు.
 
 సాధారణ ఉద్యోగులకు ప్రభుత్వమిచ్చిన ఈహెచ్‌సీ (ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్), పోలీసులకిచ్చిన ఆరోగ్య భద్రత కార్డులు, ఎక్సైజ్ సిబ్బందికి అందించిన ఆరోగ్య సహాయత కార్డులు.. వీటన్నిటి విషయంలో ఇలానే వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన సంఘటన చూస్తే... ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళితే వైద్యం చేయటానికి నో చెప్పారు. దాంతో మరో కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడా చుక్కెదురు కావడంతో మరో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహం చెందిన తోటి పోలీసులు... వైద్యం నిరాకరించడం రోగి హక్కును హరించటమేనంటూ ఆ ఆసుపత్రులపై పోలీసు స్టేషన్లో కేసులు పెట్టారు.
 
సేవ కాదు.. వాణిజ్యమే
ఆరోగ్యం అందించే వైద్య రంగాన్ని కార్పొరేట్ ఆసుపత్రులన్నీ సేవగా కాక బిజినెస్‌గానే చూస్తున్నాయి. అందుకే మార్కెటింగ్, బ్రాండింగ్ విభాగాలనూ ఏర్పాటు చేసుకుని ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. వైద్యాన్ని సేవారంగంగానే గుర్తిం చిన కేంద్రం.. కార్పొరేట్ సంస్థల ప్రచారార్భాటాలపై ఆంక్షలు విధించింది. అయినా రకరకాల మాయో పాయాలతో ప్రచారాన్ని చేస్తూనే ఉన్నాయి.
 
 గర్భిణుల విషయంలోనూ..
 నిజానికి గతంలో డెలివరీ అనేది అంత ఖరీదైన వ్యవహారమేమీ కాదు. కానీ ఇప్పుడు కొన్ని కార్పొరేట్ల ప్రవేశంతో ఇది చాలా కాస్ట్‌లీ అయిపోయింది. ఇటీవల ఒక అంచనా ప్రకారం నగరాల్లో దాదాపు 85% మంది సిజేరియన్ ద్వా రానే బిడ్డల్ని కంటున్నారు. ఈ సిజేరియన్లకు లక్షలు గుంజుతున్న ఆస్పత్రున్నాయి. ఇక బిడ్డ పుట్టాక ఇంక్యుబేటర్లో పెట్టడం, బలహీనంగా ఉందంటూ ఆక్సిజన్ అందించటం ఇవన్నీ డబ్బులు గుంజటంలో భాగమేనని పేరు వెల్లడికి ఇష్టపడని కొందరు వైద్యులు చెప్పటం గమనార్హం.
 
 కదులుదాం.. కదిలిద్దాం
 సర్కారీ, కార్పొరేట్ వైద్యంలో మీకెదురైన చేదు అనుభవాలను.. మీరు చూసిన మంచి డాక్టర్ల గురించి ‘సాక్షి’తో పంచుకోండి. వైద్య దుస్థితిని మార్చడానికి సూచనలు కూడా తెలియజేయండి. వీటిని ప్రచురించటం ద్వారా నిర్మాణాత్మకమైన చర్చకు అవకాశమిద్దాం. మీ అనుభవాలు, ఆలోచనలను ఈమెయిల్స్, లేఖల ద్వారా ‘సాక్షి’కి పంపేటపుడు... మీ పేరు, మీకు చికిత్స చేసిన ఆసుపత్రి లేదా డాక్టరు పూర్తి పేరును, మొబైల్ నంబర్లను తప్పనిసరిగా తెలియజేయండి. మీ పేరు రహస్యంగా ఉంచాలని భావిస్తే అది కూడా రాయండి.
 లేఖలు, మెయిల్స్
 పంపాల్సిన చిరునామా: ఎడిటర్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-34
 sakshihealth15@gmail.com

మరిన్ని వార్తలు