మరోసారి చైనా అధ్యక్షుడి ఘాటు వ్యాఖ్యలు

1 Aug, 2017 16:12 IST|Sakshi
మరోసారి చైనా అధ్యక్షుడి ఘాటు వ్యాఖ్యలు
  • చైనా విచ్ఛిన్నాన్ని అంగీకరించం
  • దురాక్రమణలన్నింటినీ ఓడిస్తాం..
  • శాంతి ఇష్టమే కానీ.. రాజీపడం: మరోసారి జిన్‌పింగ్‌ వ్యాఖ్యలు
  • బీజింగ్‌: తమ దేశ సార్వభౌమత్వం, భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడబోమని, అన్ని దురాక్రమణలను ఓడించే ఆత్మవిశ్వాసం తమ సైన్యానికి ఉందని చైనా అధ్యక్షుడు గ్జీ జిన్‌పింగ్‌ అన్నారు. ' చైనాలోని ఏ మూల భూభాగాన్ని కూడా విచ్ఛిన్నం కానివ్వం.. ఏ వ్యక్తికానీ, వ్యవస్థకానీ, రాజకీయ పార్టీగానీ ఇందుకు ప్రయత్నిస్తే.. విఫలం చేస్తాం' అని జిన్‌పింగ్‌ అన్నారు. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) 90వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంగళవారం నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో జిన్‌పింగ్‌ ప్రసంగించారు.

    సిక్కిం సెక్టార్‌లో భారత్‌-చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 'చైనీస్‌ ప్రజలు శాంతిని ప్రేమిస్తారు. దురాక్రమణకు పాల్పడాలనిగానీ, విస్తరించాలనిగానీ మేం ఎప్పుడు కోరుకోం. కానీ అన్ని దురాక్రమణలను ఓడించే ఆత్మవిశ్వాసముంది' అని గ్జీ అన్నారు. 'మా సార్వభౌమత్వానికి, మా అభివృద్ధి ప్రయోజనాలకు హాని కలిగించే చేదుఫలాన్ని మాతో మింగించాలని ఎవరూ ఆశించకూడదు' అని ఘాటుగా పేర్కొన్నారు. దురాక్రమణలను చిత్తుచేసే సామర్థ్యం ఉందని హెచ్చరిస్తూ గత మూడురోజుల్లో గ్జీ వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి.
     

మరిన్ని వార్తలు