నేనేంటో కొన్ని గంటలలో చూపిస్తా: పన్నీర్ సెల్వం

8 Feb, 2017 13:37 IST|Sakshi
నేనేంటో కొన్ని గంటలలో చూపిస్తా: పన్నీర్ సెల్వం
నిన్న మొన్నటి వరకు అత్యంత విశ్వాసపాత్రుడిగా, అసలు నోరు విప్పని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. ఒక్కసారిగా తిరుగుబాటు చేశారు. తానేంటో కొన్ని గంటల్లోనే చూపిస్తానని సవాలు చేశారు. ఇప్పటివరకు తాను నోరు విప్పింది కేవలం పది శాతమేనని, ఇంకా 90 శాతం మిగిలే ఉందని అన్నారు. అవన్నీ తనతో చెప్పించే ప్రయత్నం చేయొద్దని అవతలి పక్షాన్ని హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం నుంచి తన దీక్ష, వ్యాఖ్యలు, పార్టీ పదవి తొలగింపు వంటి పరిణామాలతో తీవ్ర ఉత్కంఠ రేపిన పన్నీర్ సెల్వం.. ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
(చదవండి: సంచలన నిజాలు వెల్లడించిన పన్నీర్)
 
తాజాగా బుధవారం ఉదయం మరోసారి ఆయన తమిళ మీడియాతో మాట్లాడారు. తాను ప్రతిపక్షాలతో కుమ్మక్కయ్యానని వాళ్లు ఆరోపించడం సహజమేనని అన్నారు. తిరుగుబాటు చేసినప్పుడు ఎవరిమీదైనా ఇలాగే బురద చల్లుతారన్నారు. శశికళకు ఇంత అర్జంటుగా ముఖ్యమంత్రి అయిపోవాలని ఎందుకు అనిపిస్తోందని, తమిళనాడులో పరిస్థితులను ఆమె అర్థం చేసుకోవట్లేదా అని అన్నారు. తాను ప్రతిరోజూ అపోలో ఆస్పత్రికి వెళ్లానని, కానీ అమ్మను ఆస్పత్రిలో ఒక్కసారి కూడా చూసే అవకాశం తనకు రాలేదని, అమ్మను ఆస్పత్రిలో చూడలేని దురదృష్టవంతుడినని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే పార్టీకి, జయలలితకు నిజమైన విశ్వాసపాత్రుడిని తానేనని పన్నీర్ సెల్వం చెప్పారు. షీలా బాలకృష్ణన్ రాజీనామా గురించి ఇప్పుడేమీ చెప్పలేనని, ఆమెకు ఇప్పటికే ఎక్స్‌టెన్షన్ ఇచ్చామని అన్నారు. తమిళనాడులో ఇప్పుడు జరుగుతున్న ప్రతి పరిణామం వెనుక ఒక శక్తి ఉందని చెప్పారు.