విరబూసిన విప్రో.. !

23 Oct, 2013 01:00 IST|Sakshi
విరబూసిన విప్రో.. !

బెంగళూరు: దేశీ ఐటీ దిగ్గజాల్లో మూడోస్థానంలో ఉన్న విప్రో... అంచనాలను మించిన మెరుగైన ఫలితాలతో ఆకట్టుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2013-14; క్యూ2)లో రూ.1,932 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,611 కోట్లతో పోలిస్తే 20 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ఆదాయం కూడా 19 శాతం పెరిగి రూ.9,528 కోట్ల నుంచి రూ.11,332 కోట్లకు ఎగబాకింది. డాలరుతో రూపాయి మారకం విలువ క్షీణత(క్యూ2లో 11 శాతం పైగా పతనమైంది), అంతర్జాతీయంగా ఐటీపై క్లయింట్ల వ్యయాలు జోరందుకోవడం వంటివి ఇందుకు దోహదం చేశాయి. బ్రోకరేజీ కంపెనీల విశ్లేషకులు విప్రో లాభం క్యూ2లో సగటున రూ.1,860 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు.
 
 త్రైమాసికంగానూ జోరు...
 ఈ ఏడాది జూన్ క్వార్టర్(క్యూ1)తో పోలిస్తే త్రైమాసిక ప్రాతిపదికన కూడా క్యూ2లో విప్రో లాభం(కన్సాలిడేటెడ్) జోరందుకుంది. క్యూ1లో రూ.1,623 కోట్లతో పోలిస్తే 19 శాతం దూసుకెళ్లింది. కాగా, అన్ని వ్యాపార విభాగాల నుంచి విస్తృత స్థాయిలో ఆదాయ వృద్ధిని తాము సాధించగలిగామ విప్రో సీఈఓ టీకే కురియన్ వ్యాఖ్యానించారు. ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజు కుంటున్నట్లు సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో ఐటీ క్లయింట్లలో విశ్వాసం కూడా పెరుగుతోంది. వ్యయాలు జోరందుకుంటున్నాయి. ఇవన్నీ మా క్యూ2 ఆర్థిక ఫలితాల్లో ప్రతిఫలించింది’ అని విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ పేర్కొన్నారు.
 
 గెడైన్స్ పెంపు...: ఐటీ సేవల ఆదాయం(డాలరు రూపంలో) క్యూ2లో వార్షిక ప్రాతిపదికన 5.9 శాతం ఎగబాకి 163 కోట్ల డాలర్లుగా నమోదైంది. త్రైమాసికంగా 2.7% పెరిగింది. రూపాయల్లో ఈ ఆదాయం రూ.10,068 కోట్లు. కాగా, క్యూ2 ఆదాయం 162-165 కోట్ల డాలర్లుగా ఉండొచ్చని విప్రో గతంలో అంచనా వేసింది. ఇక ప్రస్తుత క్యూ3(అక్టోబర్- డిసెంబర్)లో ఐటీ సేవల ఆదాయ అంచనా(గెడైన్స్)ను 166-169 కోట్ల డాలర్లుగా కంపెనీ సీఎఫ్‌ఓ సురేశ్ సేనాపతి ప్రకటించారు.
 
 ఇతర ముఖ్యాంశాలివీ...

  •     క్యూ2లో45 మంది కొత్త క్లయింట్లు జతయ్యారు.
  •        సెప్టెంబర్ చివరినాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య(ఐటీ సేవలు) 1,47,216 మంది. జూన్ చివరికి ఈ సంఖ్య 1,47,281గా ఉంది.
  •    కంపెనీ షేరు ధర మంగళవారం బీఎస్‌ఈలో 1.67 శాతం లాభపడి రూ.515 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిశాక ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి.

మరిన్ని వార్తలు