అక్కడ పెద్ద నోట్లు, ఇంటర్నెట్ సేవలు రెండూ బంద్!

14 Nov, 2016 10:20 IST|Sakshi
అక్కడ పెద్ద నోట్లు, ఇంటర్నెట్ సేవలు రెండూ బంద్!
ఓ వైపు పెద్ద నోట్ల రద్దు.. మరోవైపు ఇంటర్నెట్ సేవలు బంద్. మరి ప్రజలు పరిస్థితేమిటి? ప్రస్తుతం కశ్మీర్ వ్యాలీలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలివే. సాధారణ ప్రజానీకం నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ ఇదే పరిస్థితిని చవిచూస్తున్నారు. జమ్మూకశ్మీర్‌కు మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కూడా లాల్ చౌక్‌లో ఓ దుకాణంలో అప్పు చేసి మరీ తనకు కావాల్సిన సరుకులు కొనుకున్నారట. 500, 1000 నోట్ల రద్దుతో పాటు, మరోవైపు మొబైల్ ఇంటర్నెట్ సేవలు కూడా కశ్మీర్ వ్యాలీలో నిలిచి ఉండటంతో ప్రజలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఉన్న ఏటీఎంలు కూడా అవుట్ ఆఫ్ సర్వీసు అనే బోర్డులను వేలాడదీస్తూ ఉండటంతో, ప్రజల కనీస అవసరాలకు నగదు కరువవుతోంది.  
 
కశ్మీర్ వ్యాలీలో ఇంటర్నెట్ సేవలు జూలై 8 నుంచి నిలిచిపోయిన సంగతి విదితమే. హిజ్బుల్ మెహిద్దీన్ మిలిటెండ్ బుర్హాన్ వానీ ఎన్కౌంటర్లో మరణించడంతో రగిలిన నిరసనలు, ఘర్షణలతో అక్కడ ఇంటర్నెట్, మొబైల్ సేవలను బంద్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ల్యాండ్ లైన్ ఇంటర్నెట్ కనెక్షన్లను పునరుద్ధించినప్పటికీ, అక్కడ 6వేల కంటే తక్కువగానే బ్రాండ్‌బ్యాండ్ సబ్స్క్రైబర్లే ఉన్నారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలవడంతో, జమ్మూకశ్మీర్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు సిమ్ కార్డుల ద్వారా అందిస్తున్న పీఓఎస్ మిషన్ల సేవలు నిలిచిపోయాయి. దీంతో డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరుగడం లేదు. లాల్ చౌక్, రెసిడెన్సీ రోడ్‌లోని శ్రీనగర్ బిజినెస్ హబ్‌లో కేవలం ఒకే ఒక్క డిపార్ట్మెంటల్ స్టోర్ డెబిట్, క్రెడిట్ కార్డులను అనుమతిస్తోంది.
 
వ్యాలీలోని 100కు పైగా పెట్రోల్ పంప్స్‌లో కూడా ఒకే పెట్రోల్ పంప్లో బ్రాండ్ బ్యాండ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. చాలామంది ప్రజల దగ్గర డెబిట్ కార్డులు ఉన్నప్పటికీ, కనీసం అవి పనికిరాకుండా మారాయని అసహనం వ్యక్తంచేస్తున్నారు. పాలు, కూరగాయాలు వంటి కనీస అవసరాలకు తమకు నగదు కావాలని ప్రజలు అభ్యర్థిస్తున్నారు. ప్రజల అభ్యర్థనలు సహేతుకమైనవిగా భావించిన, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలను కీలకంగా తీసుకున్నట్టు ప్రభుత్వ అధికార ప్రతినిధి, విద్యామంత్రి నయీమ్ అక్తర్ తెలిపారు. ఈ సమస్యల గురించి ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి తెలియజేయనున్నట్టు పేర్కొన్నారు.      
మరిన్ని వార్తలు