ఉగ్రవాదుల వక్రభాష్యం

18 Mar, 2016 00:32 IST|Sakshi
ఉగ్రవాదుల వక్రభాష్యం

మతం సందేశంతోనే ఉగ్రవాదంపై పోరు
ఇస్లాం, మానవతా విలువల సందేశాన్ని అర్థం చేసుకోవాలి
{పపంచ సూఫీ ఫోరం వేదికపై ప్రధాని మోదీ

 
న్యూఢిల్లీ: మానవత్వంపై అమానవీయ శక్తులు చేసే పోరాటమే ఉగ్రవాదమని.. వీరు చేసే ఏ పనీ ఆమోదయోగ్యం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలో జరిగిన తొలి ప్రపంచ సూఫీ ఫోరంకు హాజరైన మోదీ.. ఉగ్రవాద సంస్థలు ఒక దేశం విధివిధానాల అమలుకు పావులుగా మారుతున్నాయన్నారు. పరోక్షంగా పాకిస్తాన్‌ను విమర్శిస్తూ.. ‘కొందరు ఉగ్రవాద క్యాంపుల్లో శిక్షణ పొందుతారు. కొందరు ఎల్లలులేని సైబర్ ప్రపంచం ద్వారా ప్రేరణ పొందుతారు. ఓ దేశం విధి విధానాలను, డిజైన్‌ను అమలుచేసేందుకు కొందరు ఉగ్రవాదులు పావులుగా మారతారు’ అని ప్రధాని అన్నారు. మతానికి వక్రభాష్యం చెబుతున్న ఉగ్రవాదుల కారణంగా.. వారుంటున్న ప్రాంతంలోనే ఎక్కువమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. ‘ఇస్లాం శాంతి సందేశం చాలా గొప్పది. అల్లాకున్న 99 పేర్లలో ఒక్కటీ హింసకు పర్యాయపదంగా నిలవదు’ అని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని ఒక మతానికి అంటగట్టడం సరికాదని.. మానవతా విలువలు, మతం చెప్పే సందేశాలను అమలు చేయటం ద్వారానే ఉగ్రవాదానికి సరైన సమాధానం ఇవ్వాలని పేర్కొ న్నారు. ఈ సమాధానాన్ని ‘మానవత్వం, అమానవీయ శక్తులకు మధ్య పోరాటం’గా ప్రధాని అభివర్ణించారు. మతవిద్వేషానికి ఉగ్రవాదం అని పేరుపెట్టి పోరాటం చేస్తున్నవారు సూఫీయిజం అందించిన ‘ఇస్లాం, ఉన్నతమైన మానవతా విలువల’ సందేశాన్ని అర్థం చేసుకోవాలన్నారు.

ఈ విలువలను దేశాలు, సమాజం, సాధుసంతులు, మేధావులు, కుటుంబాలు తప్పనిసరిగా అలవర్చుకోవాలన్నారు. ఈ శతాబ్దం ప్రారంభం నుంచి చాలామంది అమాయకులు ఉగ్రవాద రక్కసికి ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. దాదాపు వంద దేశాల్లోని తల్లిదండ్రులు.. సిరియాలో ప్రాణాలు కోల్పోతున్న తమ పిల్లలను (జిహాదీలుగా మారిన వారిని) తలుచుకుని రోదిస్తున్నారని మోదీ అన్నారు. ప్రతి ఏడాది ప్రపంచమంతా వేల కోట్ల రూపాయలను ఉగ్రవాదం అంతానికి ఖర్చు చేస్తోందని.. వాస్తవానికి ఈ మొత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదలకోసం ఖర్చుచేస్తే చాలా జీవితాల్లో మార్పు వస్తుందని మోదీ అన్నారు. గణాంకాల ద్వారానే మార్పును గుర్తించలేమని.. మన జీవితాల్లో మార్పు తీసుకురావటం ద్వారా ఉగ్రవాద ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని ప్రధానమంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో మోదీ సూఫీ సంగీతాన్ని ఆసక్తిగా ఆలకించారు. ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అఖిల భారత ఉలామా, మషైక్ బోర్డు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
 
జాతీయ దృక్పథమే ముఖ్యం: దోవల్

వ్యక్తిగత ఆలోచనలకు జాతీయ దృక్పథానికి మధ్య ఘర్షణ తలెత్తినపుడు.. దేశాభివృద్ధికే ప్రాధాన్యమివ్వాలని ఢిల్లీలో జరిగిన ఇండియాటుడే సదస్సులో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తికి దేశద్రోహి, దేశభక్తుడు అనే ముద్ర.. ఆ దేశం గురించి అతను ఆలోచిస్తున్నదాన్ని బట్టే ఉంటుందని ఎన్‌ఎస్‌ఏ చీఫ్ అజిత్ దోవల్ కుమారుడు, ఇండియా ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ శౌర్య దోవల్ అన్నారు. ‘ఫ్రాన్స్‌లో ఉగ్రదాడి జరగగానే.. వ్యక్తిగత స్వేచ్ఛను పక్కన పెట్టి దేశం కోసం రాత్రికి రాత్రే 90 చట్టాలను మార్చేశారు’ అని ఆయన అన్నారు.
 

మరిన్ని వార్తలు