ఆస్పత్రి వద్దంది... అంబులెన్స్లో ప్రసవించింది

20 May, 2015 14:48 IST|Sakshi

ముజఫర్ నగర్: పౌర సేవలు అందించాల్సిన ప్రభుత్వ వైద్యాలయం దారి తప్పిన ఉదంతమిది. పురిటి నొప్పులతో బాధపడుతూ ఆస్పత్రికి కొచ్చిన మహిళకు సేవలు అందించాల్సిందిపోయి.. కనీసం మానవత్వం కూడా లేకుండా లంచం ఇస్తేనే చేర్చుకుంటామని ఓ ప్రభుత్వాస్పత్రికి చెందిన నర్సులు చేసిన వాలకం వల్ల ఆమె అంబులెన్స్లోనే ప్రసవించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం అమీర్ అనే వ్యక్తి నిండు గర్భవతి అయిన తన భార్యకు ప్రసూతి నొప్పులు రావడంతో సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు అంబులెన్స్లో తీసుకొచ్చాడు.

అయితే, అందులోని ఆస్పత్రి సిబ్బంది లంచం ఇస్తేనే చేర్చుకుంటామని ఇబ్బందిపెడుతూ ఆలస్యం చేయడంతో అమీర్ భార్య అంబులెన్స్లో ప్రసవించింది. అనంతరం ఆమెను మరో ఆస్పత్రికి తరలించారు. బాధితుల తరుపున బంధువులు, కుటుంబ సభ్యులు సదరు ప్రభుత్వాస్పత్రి వద్ద ధర్నాకు దిగడంతో ఈ విషయం బయటకు తెలిసి పోలీసులు ఆస్పత్రి సిబ్బందిపై కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.

మరిన్ని వార్తలు