చైన్ స్నాచింగ్ తప్పించుకుందని.. తుపాకితో కాల్చారు

3 Sep, 2016 12:00 IST|Sakshi
చైన్ స్నాచింగ్ తప్పించుకుందని.. తుపాకితో కాల్చారు

చైన్ స్నాచర్లు వెంట పడినప్పుడు ఏం చేయాలి.. వీలైతే తప్పించుకోవాలి, లేకపోతే వాళ్లకు మన ఆభరణాలు సమర్పించుకోవాలి. అంతేతప్ప ఎదిరిస్తే ప్రాణాలకే ప్రమాదం. దేశ రాజధానిలో తల్లీకొడుకులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఢిల్లీలోని ఖజూరీ ఖాస్ ప్రాంతంలో ఓ బస్టాపు వద్ద ఈ ఘటన జరిగింది. ఓ మహిల తన ఆరేళ్ల కొడుకును స్కూలు నుంచి ఇంటికి తీసుకెళ్తూ బస్టాపు వద్ద వేచి ఉన్నారు. అంతలో ఇద్దరు యువకులు బైకు మీద వచ్చి, ఆమెను ఏదో అడ్రస్ అడిగారు. ఆమె వాళ్లకు ఆ అడ్రస్ చెప్పేలోగా వాళ్లలో ఒకడు ఆమె మెడలోని బంగారు గొలుసు లాగేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె ఆ యువకుడి చొక్కా పట్టుకుంది.

అతడు వెంటనే జేబులోంచి పిస్టల్ తీసి.. ఆమెవైపు కాల్చాడు. అదృష్టవశాత్తు ఆమె బుల్లెట్ తగలకుండా తప్పించుకుంది. అంతలోనే తుపాకి పేలిన శబ్దం విని అక్కడకు చుట్టుపక్కలవాళ్లు వచ్చి ఏం జరిగిందని గట్టిగా అడగడంతో.. ఆ యువకులు ఇద్దరూ గాల్లోకి కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో తీవ్రంగా షాకైన సదరు మహిళను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నామని, వాళ్లు ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగు సభ్యులు అయి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. వాళ్లపై దోపిడీ, హత్యాయత్నం కేసులు నమోదుచేశారు.

మరిన్ని వార్తలు