బీజేపీ ఎంపీపై వల.. ఫొటోలతో బ్లాక్‌మెయిల్!

1 May, 2017 10:59 IST|Sakshi
బీజేపీ ఎంపీపై వల.. ఫొటోలతో బ్లాక్‌మెయిల్!

ఆయన అలాంటి ఇలాంటి వ్యక్తి కాదు.. ఏకంగా ఎంపీ పదవిలో ఉన్నారు. అలాంటి వ్యక్తినే ఓ మహిళ బురిడీ కొట్టించింది. ఆమె కోసం ఢిల్లీ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఓ మహిళ, ఆమె గ్యాంగు కలిసి తనకు మత్తుమందు ఇచ్చి అభ్యంతరకరమైన పరిస్థితిలో ఉన్నట్లు ఫొటోలు, వీడియోలు తీశారని.. ఇప్పుడు వాటి సాయంతో తన నుంచి రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని బీజేపీ ఎంపీ కేసీ పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము చెప్పిన డబ్బు ఇవ్వకపోతే ఆ ఫొటోలు, వీడియోలు ఇంటర్‌నెట్‌లోకి ఎక్కుతాయని వాళ్లు బెదిరిస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు, ఆ ఎంపీ తనపై అత్యాచారం చేశారంటూ కేసు కూడా పెడతానని ఆమె బెదిరించిందట.

కేసు నమోదైన విషయాన్ని ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ముకేష్ మీనా కూడా నిర్ధారించారు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యమైనదిగా భావిస్తున్నామని, త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని తెలిపారు. ఆ మహిళ ఏదో సాయం కోసం తనవద్దకు వచ్చిందని, తర్వాత ఘజియాబాద్‌లోని ఒక ఇంటికి తనను తీసుకెళ్లిందని, అక్కడ తనకు కూల్‌డ్రింకులో మత్తుమందు కలిపి ఇచ్చారని ఎంపీ చెప్పారు. అది తాగగానే ఆయన స్పృహ తప్పి పడిపోయారు. మెలకువ వచ్చాక చూసుకునేసరికి తాను ట్రాప్ అయిన విషయం ఆయనకు అర్థమైంది. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఆ మహిళ తన సహచరులతో కలిసి బ్లాక్ మెయిలింగ్ గ్యాంగు నడుపుతుందని, ఇదే పద్ధతిలో ఆమె పలువురు పెద్దవాళ్ల వద్దకు వెళ్లి సాయం అడిగి తన మెత్తటి మాటలతో బుట్టలో వేసుకుంటుందని పోలీసులు చెప్పారు. తర్వాత టీ తాగుదాం రమ్మని ఇంటికి తీసుకెళ్లి వాళ్లతో అభ్యంతరకరమైన పరిస్థితిలో ఉండగా ఫొటోలు తీయిస్తుందని, వాటి సాయంతో భారీగా డబ్బు గానీ.. పెద్ద పెద్ద ఉద్యోగాలు గానీ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తుందని అన్నారు. కాదంటే మాత్రం రేప్ కేసు పెడుతుందని చెప్పారు. గత సంవత్సరం మరో ఎంపీపై ఇదే మహిళ తప్పుడు కేసు పెట్టినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు