రైల్లో బాంబు పేలుళ్లు

2 May, 2014 02:37 IST|Sakshi

* గుంటూరుకు చెందిన యువతి మృతి
* 14 మందికి గాయాలు.. చెన్నై సెంట్రల్ స్టేషన్‌లో దుర్ఘటన
* బెంగళూరు నుంచి గువాహటి వెళుతున్న రైల్లోని ఎస్-4, ఎస్-5 బోగీల్లో పేలిన బాంబులు
* మరో రెండు పేలని బాంబులు స్వాధీనం!
* దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు అప్రమత్తం
* పేలుళ్లను ఖండించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి
* మృతురాలి కుటుంబానికి లక్ష ఎక్స్‌గ్రేషియూ: రైల్వే మంత్రి
* సీబీ-సీఐడీ విచార ణకు ఆదేశించిన తమిళనాడు ప్రభుత్వం.. దర్యాప్తులో కేంద్ర సహాయానికి నిరాకరణ

సాక్షి, చెన్నై/ న్యూఢిల్లీ/ బెంగళూరు:
 స్థలం: చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్ నంబర్.9
 సమయం: గురువారం ఉదయం 07.10 గంటలు
బెంగళూరు నుంచి చెన్నై, విజయవాడ మీదుగా గువాహటి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారు. రైలు అప్పటికే సుమారుగా గంటన్నర లేటు. ఇంతలో రైలు రాకగురించిన ప్రకటన విన్పించడంతో ప్రయాణికుల్లో హడావుడి మొదలైంది. రైలు ప్లాట్‌ఫామ్ మీదకి వస్తోందనగా ఐదు నిమిషాల వ్యవధిలోనే ఒకదాని వెంబడి మరొకటిగా రెండు పేలుళ్లు సంభవించాయి.. ఏం జరిగిందో అర్థం కాక ప్రయాణికులు పరుగులు పెట్టారు.

పేలుళ్లు సంభవించిన గువాహటి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-4, ఎస్-5 బోగీల్లో హాహాకారాలు చెలరేగాయి. ఎస్-5లో ప్రయూణిస్తున్న బెంగళూరులోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగి, గుంటూరుకు చెందిన పరుచూరి స్వాతి (24) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. గాయపడిన వారిని పోలీసులు స్థానిక రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమిళనాడు ప్రభుత్వం పేలుళ్లపై తమ ప్రత్యేక పోలీసు విభాగం సీబీ-సీఐడీ విచారణకు ఆదేశించింది.

ఛిద్రమైన స్వాతి శరీరం
గువాహటి ఎక్స్‌ప్రెస్ బెంగళూరులో బుధవారం రాత్రి 11.30లకు బయలుదేరింది. ఉదయం 07.10 ప్రాంతంలో రైలు స్టేషన్ సమీపిస్తుండగా మొదట ఎస్-4 బోగీలో సీటు నంబరు 28 కింద, స్వల్పతేడాతో ఎస్-5 సీటు నంబరు 69 కింద అమర్చిన తక్కువ తీవ్రత కలిగిన రెండు బాంబులు భారీ శబ్దంతో పేలాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికులు తలోదిక్కుగా పరుగులు తీశారు. అప్రమత్తమైన రైల్వే పోలీసులు ప్లాట్‌ఫామ్ నంబర్ 9లో గువాహటి ఎక్స్‌ప్రెస్‌లో పేలుళ్లు సంభవించినట్టు గుర్తించారు.

పేలుళ్ల ధాటికి మరణించిన స్వాతి ఎస్-5లో సీటు నంబరు 69లో ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. పేలుడు తీవ్రతకు ఆమె శరీరం ఛిద్రమైంది. రెండు బోగీల అడుగు భాగంలో పెద్ద రంధ్రాలు ఏర్పడ్డారుు. ఎస్-4లో సీటు నంబర్లు 25-32, ఎస్-5లో 65-72 సీటు నంబర్ల మధ్య పేలుళ్లు సంభవించడంతో ఆయా సీట్లలో ప్రయాణిస్తున్న వారే తీవ్రంగా గాయపడ్డారు. లోయర్ బెర్త్ కింద బాంబు అమర్చడంతో అధిక  శాతం మందికి కాళ్లు దెబ్బతిన్నాయి.

ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే, జీఆర్ పోలీస్, ఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు బాంబు స్క్వాడ్‌లు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారుు. బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న అనేక రైళ్లను నిలిపివేశారు. కొన్నింటిని రద్దుచేశారు. ఎస్-4లో పేలుడు ధాటికి ఎస్-3 బోగీ కూడా దెబ్బతింది.

బెంగళూరు నుంచి వచ్చిన వారితో పాటు చెన్నైలో ఎక్కాల్సిన వారి లగేజీని క్షుణ్నంగా తనిఖీ చేసి బోగీల్లోకి ఎక్కించారు. మధ్యాహ్నం 12.10 గంటలకు రైలు గువాహటి బయలుదేరింది. స్వాతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెంది న ఆంజనేయులు (29) అనే వ్యక్తి గొంతులో ఏదో దిగబడడంతో తీవ్ర రక్తస్రావమైంది. అతనికి శస్త్రచికిత్స చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మురళి (27), లోక్‌నాథ్ (విశాఖపట్నం)లు కూడా స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. సుమంతో దేవనాథ్ (37), గుర్తు తెలియని మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది.

రైలు సుమారు గంటన్నర ఆలస్యంగా నడుస్తుండటంతో పేలుళ్లకు కుట్రదారుల లక్ష్యం చెన్నై కాకపోవచ్చనే అనుమానాన్ని తమిళనాడు డీజీపీ కె.రామానుజం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నట్టైతే.. పేలుళ్లు సంభవించిన 7.10 సమయూనికి ఆంధ్రప్రదేశ్‌లోని సూళ్లూరుపేటకు సమీపంలో రైలు ఉండేదని అంటున్నారు. టైమర్లను అమర్చి పేలుళ్లకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. ఎలాంటి పరికరాన్ని వినియోగించారో ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందన్నారు. టిఫిన్ బాక్సు, సిలిండర్ రూపంలో ఉన్న రెండు పేలని బాంబులను నిర్వీర్యం చేశారు.

గత కొన్నేళ్లలో చెన్నైలో పేలుళ్లు సంభవించడం బహుశా ఇదే మొదటిసారి. 1998లో వివిధ ప్రాంతాల్లో జరిగిన 12 పేలుళ్లలో సుమారు 60 మంది చని పోయారు. ఉగ్రవాది అనే అనుమానంతో రెండురోజుల క్రితం శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, అతనికి మన దేశానికి చెందిన ఉగ్ర మాడ్యూళ్లతో సంబంధాలున్నట్టుగా విశ్వసిస్తున్న నేపథ్యంలో తాజా పేలుళ్లు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ పేలుళ్ల దర్యాప్తులో కేంద్ర సహాయం తీసుకునేందుకు తమిళనాడు సీఎం జయలలిత నిరాకరించారు. దీనిని బట్టి ఇది ఉగ్రవాదుల చర్యగా ఆ రాష్ట్రం భావించడం లేదని తెలుస్తోంది.

బుద్ధిలేని హింసాకాండ... ప్రణబ్
రైల్లో పేలుళ్లను బుద్ధిలేని హింసాత్మక చర్యగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అభివర్ణించారు. పేలుళ్ల వార్త తెలుసుకుని తానెంతో విచారానికి గురైనట్టు తమిళనాడు గవర్నర్ రోశయ్యకు పంపిన సందేశంలో రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్, తమిళనాడు సీఎం జయలలిత, కాంగ్రెస్, బీజేపీ సహాపలు పార్టీల నేతలు పేలుళ్లను ఖండించారు. మృతురాలి కుటుంబానికి రూ.లక్ష ఎక్స్‌గ్రేషియూ అందిస్తున్నట్లు రైల్వే  మంత్రి మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.25 వేలు, స్వల్ప గాయాలైన వారికి 5 వేలను పరిహారంగా ఇస్తున్నట్టు తెలిపారు. 044 - 25357398 హెల్ప్‌లైన్‌ను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది.
 
ముష్కరుల ఫొటోల్లో చెన్నై సెంట్రల్!
సాక్షి, చెన్నై: గువాహటి ఎక్స్‌ప్రెస్‌లో పేలుళ్లకు తామే బాధ్యులమని ఇంతవరకు ఎవరూ ప్రకటించకున్నా ఇది ఐఎస్‌ఐ తీవ్రవాదుల పనేనని అధికారులు విశ్వసిస్తున్నారు. శ్రీలంకకు చెందిన ఐఎస్‌ఐ ఏజెంట్ జాకీర్ హుస్సేన్ పాత్ర ఉందేమో నని అనుమానిస్తున్నారు. అతన్ని గత నెల 29న చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. జాకీర్ అనుచరులు పలువురు అప్పటికే నగరంలో సంచరిస్తున్నట్లు తెలియడంతో గాలింపులు చేపట్టి  30న ముగ్గుర్ని అరెస్టు చేశారు.

ఈ ముఠా నగరంలో విధ్వంసాలు సృష్టించేందుకు అనువైన ముఖ్యమైన కూడళ్లు, రద్దీ ప్రాంతాలను ఫొటోలు తీసి శ్రీలంకకు పంపుతున్నట్లు తేలింది. ఈ ఫొటోల్లో సెంట్రల్ రైల్వే స్టేషన్, నగరంలోని జెమినీ ఫ్లై ఓవర్ బ్రిడ్జి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుళ్లకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న ఎస్-4లోని విశాఖపట్నం వాసి ఆనంద్ వినయ్, ఎస్-5లోని బీహార్‌కు చెందిన మహ్మద్ ఖాద్రీలను పోలీసులు విచారిస్తున్నారు.
 
విమానాశ్రయాల్లో బందోబస్తు పెంపు
న్యూఢిల్లీ: చెన్నైలో పేలుళ్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలను కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్) అప్రమత్తం చేసింది. బందోబస్తును తీవ్రం చేయడంతో పాటు క్విక్ రియూక్షన్ బృందాలను పెంచాల్సిందిగా, ప్రయాణికులకు వివిధ రకాల తనిఖీలు నిర్వహించాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలోనూ నిఘా విస్తృతం చేశారు.

మరిన్ని వార్తలు