ఆమె బోనులో ఉండగానే పులి వచ్చేసింది!

30 May, 2017 10:46 IST|Sakshi
ఆమె బోనులో ఉండగానే పులి వచ్చేసింది!

లండన్‌: ఆగ్నేయ ఇంగ్లండ్‌లోని ఓ జూపార్కులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా ఉద్యోగి సరిగ్గా బోనులో ఉన్న సమయంలోనే పులి అందులోకి ప్రవేశించి.. ఆమెపై దాడి చేసి చంపేసింది. కేంబ్రిడ్జ్‌షైర్‌లోని హమ్మర్టన్‌ జూపార్కులో సోమవారం ఉదయం 11. 45 గంటలకు ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 33 ఏళ్ల మహిళా జూకీపర్‌ రోజా కింగ్‌ ప్రాణాలు కోల్పోయింది.

రోజా కింగ్‌ బోనులో ఉండగానే అదే సమయంలో పులి కూడా రావడంతో ఆమె ప్రాణాలు కాపాడటానికి సహచర సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. పులికి మాంసం ముక్కలను విసిరి దాని దృష్టి మళ్లించేందుకు యత్నించారు. అయినా పులి ఏమాత్రం తగ్గకుండా రోజాకింగ్‌పై దాడి చేసింది. దీంతో ఆమె కేకలతో జూపార్కు దద్దరిల్లింది. వెంటనే జూపార్కులో ఉన్న వందమంది సందర్శకులను వెంటనే బయటకు పంపేశారు. సహచర సిబ్బంది కళ్లముందే రోజాకింగ్‌పై పులి దాడి చేసి ఉంటుందని ప్రత్యక్ష సాక్షి పీట్‌ డేవిస్‌ తెలిపారు.


‘అప్పుడు వినిపించిన కేకలు ఆమెవే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె కేకలతో ఏదో భయంకర ఘటన సంభవించిందని అనుకున్నాం. పులి ఆమెపై దాడిచేసినట్టు కనిపించింది’ అని ఆ సమయంలో జూలో ఉన్న డేవిస్‌ చెప్పారు. పులి లేదని రోజాకింగ్‌ బోనులోకి ప్రవేశించిందని, ఆ వెంటనే తోటి సిబ్బంది కేకలు వేయడంతో ఆమె తేరుకుందని, అంతలోనే పులి ఆమెపై విరుచుకుపడిందని మరో సాక్షి తెలిపారు. రోజాకింగ్‌కు జంతువులంటే ఎంతో ప్రాణమని, ఆమె జంతువులను ఎంతో ప్రేమగా చూసుకునేదని స్నేహితులు, బంధువులు చెప్తున్నారు. ఇది అసాధారణ ఘటన అని జూ నిర్వాహకులు చెప్తుండగా.. ఈ సీరియస్‌ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు కేంబ్రిడ్జ్‌షైర్‌ కౌంటీ పోలీసులు తెలిపారు.


మరిన్ని వార్తలు