16 మంది మహిళలను రేప్‌ చేసిన పోలీసులు!

9 Jan, 2017 07:44 IST|Sakshi
16 మంది మహిళలపై పోలీసుల అకృత్యాలు!

న్యూఢిల్లీ: 16 మంది మహిళలపై అత్యాచారంతోపాటు లైంగిక, శారీరక దాడులు చేసినట్టు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్చార్సీ) ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొంటూ శనివారం నోటీసులు జారీచేసింది. మరో 20 మంది బాధితుల వాంగ్మూలం కోసం తాము ఎదురుచూస్తున్నట్టు కమిషన్‌ స్పష్టం చేసింది.

ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల చేతిలో 16 మంది మహిళలు అత్యాచారానికి గురవ్వడంతోపాటు లైంగికంగా, శారీరకంగా దాడులు ఎదుర్కొన్నట్టు ప్రాథమిక ఆధారాలను బట్టి ఎన్‌హెచ్చార్సీ గుర్తించింది. కాబట్టి బాధితులకు రూ. 37లక్షల పరిహారం ఎందుకు సిఫారసు చేయకూడదో తెలుపాలంటూ ఆ రాష్ట్ర సీఎస్‌ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చిన నోటీసులలో పేర్కొంది. ఈ పరిహారంలో రూ. 3 లక్షలు చొప్పున రేప్‌కు గురైన ఎనిమిది మంది బాధితులకు, రూ. 2 లక్షలు చొప్పున లైంగిక దాడులు ఎదుర్కొన్న ఆరుగురు బాధితులకు, రూ. 50వేల చొప్పున శారీరక దాడులు ఎదుర్కొన్న ఇద్దరు బాధితులకు ఇవ్వాలని కమిషన్‌ పేర్కొంది. భద్రతా దళాల చేతిలో బాధితుల మానవహక్కుల ఉల్లంఘన తీవ్రస్థాయిలో జరిగిందని, కాబట్టి ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కమిషన్‌ స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు