పురుషుల కన్నా మహిళలే అధికంగా..

17 Oct, 2015 15:29 IST|Sakshi
పురుషుల కన్నా మహిళలే అధికంగా..

బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో మహిళా ఓటర్లు.. పురుష ఓటర్ల కన్నా క్రియాశీలకంగా మారారు. 5 దశల ఎన్నికలలో భాగంగా ఈ నెల 13, 17వ తేదీలలో జరిగిన తొలి రెండుదశల పోలింగ్లో ఈ విషయం వెల్లడైంది. దీనిపై ఎలక్షన్ కమిషన్ సభ్యులు మాట్లాడుతూ.. పోలింగ్ సమయంలో మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరి మరి ఓటు హక్కును వినియోగించుకున్నారని, పురుషుల కంటే ఎక్కువగా మహిళలు పోలింగ్లో ఆసక్తిగా పాల్గొన్నారన్నారు.


 రెండవ దశ ఎన్నికలలో మొత్తం 54.8 శాతం పోలింగ్ నమోదవగా అందులో మహిళా ఓటర్ల శాతం 57.5 కాగా పురుష ఓటర్లు 52 శాతం. అలాగే అక్టోబర్ 13న జరిగిన మొదటి దశ ఎన్నికలలో సైతం మహిళా ఓటర్లు 59.5 శాతం పాల్లొనగా పురుష ఓటర్లు కేవలం 54.5 శాతం మంది పాల్గొన్నారు. ఈ తాజా పరిణామాలతో రాజకీయ నేతల చూపు మహిళా ఓటర్లపై పడింది. దీంతో మిగిలి ఉన్న మూడు దశల ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు కుల ఓటుబ్యాంకు, యువతరాన్ని ఆకర్శించే ప్రచార కార్యక్రమాల కన్నా.. మహిళలను ఆకర్శించే పనిలో పడ్డారు.


 పోలింగ్ సరళిని గమనిస్తున్న విశ్లేషకులు.. గత నితీష్ కుమార్ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం చేపట్టిన పథకాల ఫలితంగానే మహిళలు క్రియాశీలకంగా ఓటింగ్లొ పాల్గొంటున్నారని అంచనా వేస్తున్నారు. పంచాయితీ రాజ్ ఎన్నికలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు పోలీసు, ఉపాధ్యాయ నియామకాలలో మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించడం వంటి చర్యలు మహిళా చైతన్యానికి కారణాలుగా అంచనా వేస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే బాలికల కోసం సైకిళ్లను పంపిణీ చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో బాలికా విద్య మెరుగు పడడం వంటి కారణాలు ప్రస్తుతం మహిళా ఓటింగ్ పెరగడానికి కారణాలుగా చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు