హెచ్1-బీ వీసాదారుల జీవిత భాగస్వాములకూ వర్క్ పర్మిట్

26 Feb, 2015 01:52 IST|Sakshi
హెచ్1-బీ వీసాదారుల జీవిత భాగస్వాములకూ వర్క్ పర్మిట్

- మే 26 నుంచి అమలు చేయనున్న అమెరికా


వాషింగ్టన్: అమెరికాలో హెచ్1-బీ వీసా ద్వారా ఉద్యోగం చేస్తున్న విదేశీయుల జీవిత భాగస్వాములూ ఇకపై వివిధ ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కానుంది. హెచ్1-బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అత్యున్నత నైపుణ్యం గల ఉద్యోగాలు చేసేందుకు వర్క్ పర్మిట్‌ను అమెరికా ప్రభుత్వం మే 26 నుంచి అమలు చేయనుంది. దీంతో గ్రీన్ కార్డుల కోసం దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న విదేశీయులకు, ప్రధానంగా వేలాది మంది భారతీయులకు ఎంతో ఊరట కలగనుంది.

వలస విధానంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్ణయం మేరకు గతేడాది ఖరారైన ఈ ప్రతిపాదన  త్వరలో అమలులోకి రానుంది. ప్రస్తుతం ఉన్న విధానం వల్ల హెచ్1-బీ వీసాదారుల భాగస్వాములకు ఉద్యోగం చేసేందుకు అనుమతి లేకపోవడంతో వారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. తాజా మార్పు వల్ల వచ్చే ఏడాది కాలంలో 1.79 లక్షల మందికి, తర్వాతి సంవత్సరాల్లో మరో 55 వేల మందికి ప్రయోజనం కలగనుంది.
 
 అత్యున్నత నైపుణ్యం గల ఉద్యోగుల జీవిత భాగస్వాములకు తాత్కాలిక వీసాల విషయంలో ఆస్ట్రేలియా, కెనడాలు ఇలాంటి మార్పులను ఇంతకుముందే అమలు చేశాయి. దీంతో అమెరికాలో కూడా నిబంధనలను మార్చేలా వచ్చిన ఒత్తిడి మేరకు ఒబామా ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో గ్రీన్‌కార్డులు పొందేందుకు విదేశీయులకు కొన్నిసార్లు పదేళ్లకు పైగా సమయం పడుతోన్న నేపథ్యంలో ఆ ప్రక్రియను వేగవంతం చేసేందుకు, హెచ్1-బీ వీసాలపై పరిమితిని ఎత్తేసేందుకూ ఒబామా గత నవంబర్‌లో ఆమోదం తెలిపారు.

మరిన్ని వార్తలు