గల్ఫ్‌లో మనవాళ్ల గోస

16 May, 2015 04:05 IST|Sakshi
గల్ఫ్‌లో మనవాళ్ల గోస

అంతర్యుద్ధంతో
కష్టాల్లో కార్మికులు
వెనక్కు పంపేందుకు
అంగీకరించని యాజమాన్యాలు

 
మోర్తాడ్: సౌదీ అరేబియా, యెమెన్ దేశాల మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధ ప్రభావం తెలంగాణ కార్మికులపైనా పడుతోంది. సౌదీ సరిహద్దు పట్టణంలో పని చేస్తున్న ఈ ప్రాంతవాసులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. సౌదీ బల్దియూలో, పలు కంపెనీల్లో పని చేసేందుకు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ తదితర జిల్లాలకు చెందిన వందలాది మంది కార్మికులు వలస వెళ్లారు. ఇందులో అత్యధికంగా యెమెన్ దేశానికి అనుకుని ఉన్న సౌదీ సరిహద్దులోని నజరేన్ పట్టణంలో పని చేస్తున్నారు.

ఇప్పుడు ఇరు దేశాల మధ్య బాంబులు, తుపాకుల దాడి కొనసాగుతుండడంతో తెలంగాణ కార్మికులు అక్కడ పని చేయూలంటే భయపడుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన తమలో నెలకొందని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన రమేష్ అనే కార్మికుడు ‘సాక్షి’తో వాపోయాడు. కాగా, సౌదీలో పని చేస్తున్న వలస కార్మికుల పాస్‌పోర్టులు ఆయా కంపెనీల యాజమాన్యాలు స్వాధీనం చేసుకోవడంతో వారు తమ ప్రాంతాలకు రాలేకపోతున్నారు.  బాంబుల దాడుల మధ్య ఎలా పనిచేయాలని ప్రశ్నిస్తే యాజమాన్యాలు తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని రమేష్ చెప్పాడు. తెలంగాణ ప్రభుత్వం, విదేశాంగ శాఖ తమను స్వరాష్ట్రానికి చేర్చేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు