ఇక గ్రహాంతరవాసుల్ని పట్టేయొచ్చు!

4 Jul, 2016 18:56 IST|Sakshi

బీజింగ్: ఏలియన్ల(గ్రహాంతర జీవుల) జాడ కోసం ఏళ్లుగా కొనసాగుతోన్న పరిశోధనల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 30 ఫుట్ బాల్ మైదానాల సైజులో నిర్మించిన భారీ టెలీస్కోప్ సహాయంతో అంతరిక్షంలోని ఇతర జీవజాతుల ఆనవాళ్లు పసిగట్టేందుకు మార్గం సుగమమైంది. చైనా తాజాగా రూపొందించిన ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ తో మానవుడి అన్వేషణ కొత్త మలుపు తిరగనుంది. దాదాపు 4,450 ప్యానల్స్ ను ఉపయోగించి తయారుచేసిన ఈ భారీ టెలిస్కోప్ ను చైనా సైంటిస్టులు ఉదయం 10.47 నిమిషాల నుంచి వాడకంలోకి తెచ్చారు. నైరుతి చైనాలోని గుయ్జోయూ ప్రావిన్సులో గల కార్ట్స్ వ్యాలీలో దీనిని ఏర్పాటు చేశారు. గత ఏడాది సెప్టెంబర్ లో ప్రారంభమైన ఈ భారీ టెలీస్కోప్ నిర్మాణంలో 300 మందికి పైగా బిల్డర్లు, సైంటిస్టులు పాలుపంచుకున్నారు.

 
ఈ టెలీస్కోప్ ద్వారా భూమి, విశ్వం, మిగతా గ్రహాల గురించి తెలుసుకోవచ్చని, శాస్త్రజ్ఞులు తన ఊహల్ని నిజం చేస్తారని భావిస్తున్నట్లు ప్రముఖ ఫిక్షన్ రచయిత అన్నారు. టెలీస్కోప్ ద్వారా లభించిన సమాచారన్ని విశ్లేషించే పనిని శాస్త్రవేత్తలు త్వరలోనే ప్రారంభిస్తారని నేషనల్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్ సెంటర్(ఎన్ఏసీ) డిప్యూటీ హెడ్ తెలిపారు. ఇతర గ్రహాల మీద ఉన్న జీవజాతులు, ఏలియన్ల సమాచారన్ని త్వరగా కనుక్కునేందుకు వీలు కలుగుతుందని వివరించారు. వచ్చే రెండు నుంచి మూడేళ్ల కాలంలో టెలీస్కోప్ ను వినియోగించడంలో టెస్టింగ్ పీరియడ్ గా పేర్కొన్నారు. ఈ దశలో ప్రాథమిక అంశాల పరిశోధిస్తారని చెప్పారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూభాగాలను శోధిస్తారని తెలిపారు. ఈ టెలీస్కోప్ ను తయారుచేయడానికి దాదాపు 180 మిలియన్ డాలర్లు ఖర్చయినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు