ఛాందస దేశంగా మార్చేస్తున్నారు

30 Oct, 2015 08:13 IST|Sakshi
ఛాందస దేశంగా మార్చేస్తున్నారు

పద్మ అవార్డును వెనక్కిచ్చిన పీఎం భార్గవ  
భార్గవ బాటలో మరికొందరు శాస్త్రవేత్తలు

నిరసన వ్యక్తం చేసిన 53మంది చరిత్రకారులు
* వాదనలకు బుల్లెట్లతో జవాబిస్తున్నారని ఆరోపణ
* బీజేపీపై వ్యతిరేకతే కారణం: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: రచయితలు, కళాకారులు.. సినీ ప్రముఖుల కోవలో శాస్త్రవేత్తలు, చరిత్రకారులు కూడా చేరారు. భారత దేశంలో ‘అసహన’ వాతావరణం పెచ్చుమీరుతోందని..

దీన్ని నియంత్రించటానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ విధమైన హామీ ప్రకటన చేయకపోవటాన్ని నిరసిస్తూ గురువారం దేశంలోని 53మంది ప్రముఖ చరిత్రకారులు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ప్రఖ్యాత శాస్త్రవేత్త పీఎం భార్గవ తనకు ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు హైదరాబాద్‌లో ప్రకటించారు.  సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)వ్యవస్థాపక డెరైక్టర్ అయిన పుష్ప ఎం భార్గవ 1986లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు.‘‘ఎన్నో దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయి.

మోదీ ప్రభుత్వం భారత్‌ను హిందూ ఛాందసవాద దేశంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఇది నాలాంటి వారికి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు..’’ అని పేర్కొన్నారు. దేశ పౌరులందరూ శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించాలని భారత రాజ్యాంగం నిర్దేశిస్తోంటే... కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నమైన రీతిలో ప్రవర్తిస్తోందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నేతలు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన సంస్థ (సీఎస్‌ఐఆర్) సమావేశాల్లో పాల్గొనడం ఇలాంటిదేనన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ లాంటి సంస్థలకు తన దృష్టిలో ఏమాత్రం సానుభూతి లేదని... బీజేపీ ఆ సంస్థకు రాజకీయ విభాగంగా పనిచేస్తుండటం మరింత ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు.

భార్గవతో పాటు పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు అశోక్‌సేన్, పీ.బలరాం, మాడభూషి రఘునాథన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డీ.బాలసుబ్రమణియన్‌లు కూడా తమ అవార్డులను వెనక్కి ఇవ్వాలని ఇంతకుముందే నిర్ణయించుకున్నారు. వీరంతా తమ నిరసనను వెబ్‌సైట్‌లో ప్రకటన ద్వారా తెలియజేశారు.  
 
బుల్లెట్లా సమాధానం?: దేశంలో వాతావరణం మునుపెన్నడూ లేని విధంగా కలుషితమైపోయిందని దేశంలోని ప్రఖ్యాత చరిత్రకారులు ఆందోళన వ్యక్తం చేశారు. రొమిల్లా థాపర్, ఇర్ఫాన్ హబీబ్, కేఎన్ ఫణిక్కర్, మృదులా ముఖర్జీలతో సహా మొత్తం 53మంది చరిత్రకారులు దేశంలో ప్రస్తుతం కల్లోల పరిస్థితి నెలకొన్నదంటూ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దాద్రీ ఘటన, సుధీంద్ర కులకర్ణిపై ఇంక్‌తో దాడి వంటి ఘటనలను ప్రస్తావిస్తూ.. ‘అభిప్రాయభేదాలను వ్యక్తం చేస్తే వాటికి భౌతిక దాడులకు పరిష్కారం చూపాలని ప్రయత్నిస్తున్నారు.

వాదనలకు ప్రతివాదనలు చేయకుండా బుల్లెట్లతో సమాధానాలిస్తున్నారు. ఒకరి తరువాత మరొకరు అవార్డులు వెనక్కి ఇస్తుంటే, రచయితలను రాయడం ఆపేయమని సలహా ఇవ్వ టం, మేధావులను మౌనంగా ఉండమని అన్యాపదేశంగా చెప్పటమే...’ అని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోదీ మౌనం గా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు రక్షణ కల్పించటం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను, భిన్నత్వాన్ని పరిరక్షించటం ప్రభుత్వ బాధ్యత అని వారన్నారు. ఇప్పటికే 36 మంది రచయితలు తమ అవార్డులను వెనక్కి ఇవ్వటం, మరో అయిదుగురు తమ అధికారిక పదవులను విడిచిపెట్టడం, ఫిల్మ్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియావిద్యార్థులు 139రోజులు సమ్మె చేయటంతో పాటు 10మంది సినీ కళాకారులు అవార్డులను వెనక్కి ఇవ్వటం తెలిసిందే.
 
అదొక ప్రదర్శన
హైదరాబాద్: శాస్త్రవేత్తలు, చరిత్రకారులు అవార్డులను వెనక్కి ఇవ్వటం ఒక ప్రదర్శన అని ఇస్రో మాజీ చైర్మన్, ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త మాధవన్ నాయర్ గురువారం ఆరోపించారు. భారత్ లాంటి పెద్ద దేశంలో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయని.. వాటన్నిం టికీ ప్రభుత్వమే కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. జీవిత సాఫల్యానికి గుర్తింపుగా దేశం గౌరవంగా ఇచ్చిన అవార్డులను వెనక్కి ఇచ్చి వాటిని అవమానించటం తగదని ఆయన హితవు చెప్పారు. కాగా, ఈ నిరసనలతో మోదీసర్కారు ఇరుకున పడిందని తొలుత తన అవార్డును వెనక్కి ఇచ్చిన ప్రఖ్యాత రచయిత్రి నయనతార సెహగల్ అన్నారు.
 
వీరంతా బీజేపీ వ్యతిరేకులు: అరుణ్‌జైట్లీ
పట్నా/ముంబై: అవార్డులు వెనక్కి ఇస్తున్న వారంతా ‘తయారుచేయబడిన తిరుగుబాటుదారుల’ని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆరోపించారు. అవార్డులు వెనక్కి ఇస్తు న్న వారంతా రాజకీయం చేస్తున్నారు. ‘నా మాటకు నేను కట్టుబడి ఉన్నా.. అవార్డులు వెనక్కి ఇస్తున్న వారి సామాజిక, రాజకీయ వ్యాఖ్యానాలను ఫేస్‌బుక్, ట్విటర్‌లలో జాగ్రత్తగా గమనించండి. వారు బీజేపీపై పిచ్చి వ్యతిరేకతతో ఉన్నవారన్నది స్పష్టం అవుతుంది.’అని జైట్లీ అన్నారు.

జైట్లీ మాట లు విమర్శను సహించని వైఖరిని ప్రతిబింబిస్తోందని కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్‌శర్మ పేర్కొన్నారు. వీరంతా భారత ప్రతిష్టను, హిందూ ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. బీజేపీ వ్యతిరేక పక్షాలు, వామపక్ష భావజాల వర్గాలు పనిగట్టుకుని దుష్ర్పచారానికి పూనుకున్నాయని వెంకయ్య ఆరోపించారు. పీఎం భార్గవ బీజేపీ వ్యతిరేక సైన్యానికి నాయకుడని,  బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు ఆరోపించారు. మరోవైపు తనకు ఇచ్చిన అవార్డును వెనక్కి ఇవ్వబోనని ప్రముఖ నటి విద్యాబాలన్ తేల్చి చెప్పారు.

మరిన్ని వార్తలు