గురుద్వారాపై పిడుగు.. కూలిన పైకప్పు

27 Jan, 2014 15:20 IST|Sakshi

బ్రిటన్లోని లీసెస్టర్ నగరంలో ఓ గురుద్వారాపై పిడుగుపడింది. దాంతో దాని పైకప్పు కూలిపోయినా.. అదృష్టవశాత్తు భక్తులంతా బయటపడ్డారు. లీసెస్టర్ నగరంలోని రాంగర్హియా గురుద్వారాలో దాదాపు 11 మంది పెద్దవయసు మహిళలు ప్రార్థనలు చేస్తుండగా, ఉన్నట్టుండి పిడుగు పడి, పైకప్పునకు రంధ్రం పడింది. దీంతో భక్తులంతా భయపడి బయటకు పరుగులు తీశారు. కాసేపటికే పైకప్పుతో పాటు వెనకవైపు గోడ కూడా కూలిపోయింది. అయితే అప్పటికే పిడుగు శబ్దం విన్న భక్తులు బయటకు పరుగులు తీయడంతో కేవలం ఒక్క వ్యక్తికి మాత్రం కొద్దిపాటి గాయాలయ్యాయి.

అదే ఒక అరగంట ముందు గనక పిడుగు పడి ఉంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని, అప్పుడు దాదాపు 250 మంది భక్తులు లోపల ఉన్నారని ఆలయ కమిటీ అధ్యక్షుడు ఇండీ పనేసర్ తెలిపారు. ఎవరూ గాయపడకపోవడం దేవుడి దయ అని, పైకప్పు కూలిపోయినా కూడా ఆలయంలోని పవిత్ర గ్రంథాలు కూడా ఏమాత్రం పాడవ్వలేదని ఆయన చెప్పారు. భజనలు చేస్తున్న వృద్ధమహిళల్లో ఒకరు వాటిని జాగ్రత్తగా తీసుకుని సురక్షిత ప్రదేశంలో పెట్టారని, ఇది కూడా చాలా అదృష్టమేనని పనేసర్ అన్నారు.

మరిన్ని వార్తలు