ద్వితీయార్థంలో మెరుగైన వృద్ధి: మాంటెక్‌సింగ్

6 Nov, 2013 01:47 IST|Sakshi
ద్వితీయార్థంలో మెరుగైన వృద్ధి: మాంటెక్‌సింగ్

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థకు కష్టకాలం దాదాపు గడిచిపోయిందని, ఇక ఈ ఆర్థిక సంవత్సరం  ద్వితీయార్థంలో వృద్ధి మెరుగుపడొచ్చని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లువాలియా పేర్కొన్నారు. మౌలిక రంగం పనితీరు ఈ దిశగా కొన్ని సంకేతాలు ఇచ్చిందని ఆయన చెప్పారు. అయితే, రికవరీకి సంబంధించి ఇంకా పటిష్టమైన సంకేతాలు రావాల్సి ఉంద ని శివ నాడార్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అహ్లువాలియా చెప్పారు. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఇటీవల రెపో రేటును మరో పావు శాతం పెంచడంపై స్పందిస్తూ.. ఆర్‌బీఐ పరిస్థితిని సరిగ్గా చక్కబెట్టిందని ఆయన పేర్కొన్నారు. క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మళ్లీ సాధారణ స్థాయికి రావడం చాలా ముఖ్యమని చెప్పారు.
 
 ఒకవైపు ద్రవ్యోల్బణం సమస్యాత్మకంగానే ఉన్నప్పటికీ.. ఆర్థిక వృద్ధికి ఊతం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని అహ్లువాలియా తెలిపారు. అటు కిరీట్ పారిఖ్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా పెట్రోలియం ధరలను మార్కెట్ రేట్లను అనుసంధానించి, సబ్సిడీలను దశలవారీగా ఎత్తేయాల్సిన అవసరం ఉందని ప్రణాళిక సంఘం భావిస్తున్నట్లు వివరించారు. డీజిల్, కిరోసిన్, వంట గ్యాస్ రేట్లను ఇప్పటికిప్పుడు పెంచలేకపోయినప్పటికీ.. తగిన చర్యలు తక్షణ మే తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు