మణికట్టుపై ఏసీ!

28 Oct, 2013 02:58 IST|Sakshi
మణికట్టుపై ఏసీ!

వాషింగ్టన్: బయటి వాతావరణానికి తగ్గట్లుగా శరీరం ఉష్ణోగ్రతను తగ్గించే, పెంచే బ్రాస్‌లెట్ లాంటి సరికొత్త పరికరాన్ని అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు రూపొందిం చారు. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు చల్లటి నీటిలో తడిపిన వస్త్రాన్ని నుదుటిపై ఉంచుకుంటాం.. తద్వారా శరీరం ఉష్ణోగ్రత తగ్గినట్లనిపించి ఉపశమనం కలుగుతుంది. ఈ తరహాలో మన శరీరం స్పందించే విధానం ఆధారంగా ఈ బ్రాస్‌లెట్‌ను రూపొందించారు.

ఇందులో ఉండే సెన్సర్లు వాతావరణంలోని ఉష్ణోగ్రతని, మన శరీర ఉష్ణోగ్రతని పరిశీలిస్తాయి. దానికి అనుగుణంగా బ్రాస్‌లెట్‌లో ఏర్పాటు చేసిన థర్మో ఎలక్ట్రిక్ పరికరం.. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు చల్లగా.. చలిగా ఉన్నప్పుడు వేడిని మణికట్టుపై కలిగిస్తుంది. దాంతో మన శరీర ఉష్ణోగ్రత కూడా దానికి తగినట్లుగా మారి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు ఈ పరికరంతో ఎవరికి నచ్చినట్లుగా వారు వేడిని, చల్లదనాన్ని కలిగించేలా మార్పులు చేసుకోవచ్చు. అయితే, ప్రస్తుతం ఈ పరికరం ఇంకా ప్రయోగదశలోనే ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాగలదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
 
ఓ ఇంటివాడైన ‘పొడగరి’

పెళ్లిళ్లు స్వర్గంలోనే నిశ్చయమ వుతాయన్న సంగతి ఈ జంటను చూస్తే నిజమనిపించక మానదు. ప్రపంచంలోనే అత్యంత పొడగరి గా గిన్నిస్ రికార్డు కెక్కిన సుల్తాన్ కోసెన్ అనే ఈ టర్కీ యువరైతు ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు.

8 అడుగుల 3 అంగుళాల ఎత్తున్న కోసెన్ తోడు కోసం ఎన్నో ఏళ్లు వెతికి విసిగి వేసారిపోయాడు. ఎట్టకేలకు అన్వేషణ ఫలించి మిర్వే దిబో అనే వధువు దొరికింది.

దిబో ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు. వరుడి ఎత్తుకంటే 2 అడుగుల 7 అంగుళా లు తక్కువ. మార్దిన్‌లో ఆదివారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది.
 
సాగరంలో సిటీ..
సముద్రంలో సిటీలాంటిది.. చూడ్డానికి అద్భుతంగా ఉంది కదూ.. లండన్‌కు చెందిన ఫిల్ పాలే డిజైన్ ఇదీ. సబ్-బయోస్పియర్-2 అని పిలుస్తున్న ఈ డిజైన్ రూపకల్పనకు ఫిల్ 20 ఏళ్లు శ్రమించారు. ఇందులో 100 మంది నివాసముండవచ్చు.

ఇందులో ఉండేవారు ఆహారం, గాలి వంటివాటి కోసం బయటి ప్రపంచంపై ఆధారపడాల్సిన అవసరముండదట. ఈ సాగరంలో సిటీకి సంబంధించి ఫిల్ పలు పుస్తకాలనూ రాశారు. తన జీవిత కాలంలో ఈ సాగర నగరాన్ని నిర్మించి తీరుతానని ఫిల్ చెబుతున్నారు.
 
సువాసనల సందేశం..
ఏదైనా సందేశం, ఈమెయిల్ లేదా ఫేస్‌బుక్‌లో ఎవరైనా మీ పోస్ట్‌కు లైక్ కొట్టిన నోటిఫికేషన్ ఫోన్‌కు వచ్చినప్పుడు.. ఆ సందేశం తనతోపాటు మీకు నచ్చిన సువాసనలను తెస్తే ఎలాగుంటుంది? చిత్రంలోని ‘సెంట్’ అనే పరికరాన్ని మీ ఫోన్‌కు తగిలిస్తే.. మీకు వచ్చే సందేశాలు సువాసనలను వెదజల్లుతాయి.

ఈ పరికరంలో అమర్చే ఒక్కో క్యాట్రిడ్జ్ 100 సందేశాల వరకూ పనిచేస్తుంది.
తర్వాత దాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. దీన్ని జపాన్‌కు చెందిన సెంట్ అనే కంపెనీ తయారుచేసింది. మల్లెలు, గులాబీ, యాపిల్,  కాఫీ, లావెండర్.. చివరికి కార్న్ సూప్ కూడా.. ఇలా పలు సువాసనలకు సంబంధించిన క్యాట్రిడ్జ్‌లను మనం ఎంచుకోవచ్చు. సందేశం వచ్చినప్పుడు.. ఆ పరికరం నుంచి సెంట్ స్ప్రే అవుతుందన్నమాట. పరికరం ధర రూ.2,100. క్యాట్రిడ్జ్ వెల రూ.300.

మరిన్ని వార్తలు