చరిత్రలో అతిపెద్ద సైబర్ దాడి!

16 Dec, 2016 08:12 IST|Sakshi
చరిత్రలో అతిపెద్ద సైబర్ దాడి!

న్యూయార్క్: ప్రముఖ  ఇంటర్నెట్ దిగ్గజం యాహూ ఖాతాలో మరోసారి  పెద్ద ఎత్తున హ్యాక్ అయ్యాయి. గతంలోనే ఒకసారి  తమ ఖాతాలు భారీగా  హ్యాకింగ్ కు గురయ్యాయని ధృవీకరించిన  యాహూ  మరోసారి షాకింగ్ న్యూస్ వెల్లడించింది.  తమ ఖాతాలపై  మరో మేజర్ సైబర్ ఎటాక్  జరిగిందని   యాహూ వెబ్ సైట్ లో  ప్రకటించింది. దాదాపు 100కోట్ల (1బిలియన్‌)కు పైగా  ఖాతాలు హ్యాక్ అయినట్టు ప్రకటించడం ఆందోళన రేపింది.  తమ వినియోగదారుల ఖాతాల నుంచి వ్యక్తిగత సమాచారం అపహరణకు గురైనట్టు తెలిపింది. 2013 ఆగస్టులో  జరిగిన ఈ  దాడి చరిత్రలోనే అతిపెద్ద సైబర్ దాడిగా  పేర్కొంది.  ఈ నేప‌థ్యంలో త‌మ యూజ‌ర్ల‌కు ప‌లు సూచ‌న‌లు చేస్తూ త‌మ‌ పాస్‌వర్డ్‌లు, సెక్యూరిటీ ప్రశ్నల సమాధానాలు మార్చుకోవాలని యూహూ పేర్కొంది.  దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో పడిన యాహూ  మ‌రిన్ని కష్టాల్లో చిక్కుకుపో్యింది.
2014లోనూ యాహూ తమ నెట్‌వర్క్‌ నుంచి 50 కోట్ల యూజ‌ర్ల అకౌంట్ల వివ‌రాలు హ్యాకింగ్‌కు గుర‌య్యాయ‌ని తెలిపింది. 50 కోట్ల యూజ‌ర్ల స‌మాచారం హ్యాకింగ్ గుర‌వ‌డ‌మే ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద సైబర్‌ నేరంగా ఉంది. అయితే, తాజాగా 100 కోట్ల మంది యూజ‌ర్ల అకౌంట్లు హ్యాకింగ్ గుర‌య్యాయ‌ని తెలప‌డం క‌ల‌క‌లం రేపుతోంది. గతంలో త‌మ యూజ‌ర్ల వివ‌రాల‌ను త‌స్క‌రించిన హ్యాక‌ర్లు అప్ప‌టి లాగే ఇప్పుడు కూడా  యూజ‌ర్ల‌ పేర్లు, ఈమెయిల్‌ ఐడీలు, టెలిఫోన్‌ నంబర్లు, పాస్‌వర్డ్‌లతో పాటు, ఎన్‌క్రిప్టెడ్‌, అన్‌ ఎన్‌క్రిప్టెడ్‌ సెక్యూరిటీ ప్రశ్నలు, సమాధానాలు అప‌హ‌రించిన‌ట్లు  తెలిపింది. అయితే త‌మ యూజ‌ర్లకు  సంబంధించిన‌ బ్యాంక్‌ అకౌంట్‌ సమాచారం, పేమెంట్‌ డేటా మాత్రం అప‌హ‌ర‌ణ‌కు గురికాలేద‌ని యాహూ స్పష్టం  చేసింది.  
కాగా  ఇంటర్నెట్‌ వ్యాపారాన్ని  అమ్మకానికి పెట్టిన సంస్థ  అష్టకష్టాలు పడింది. చివరికి  అమెరికా టెలికాం కంపెనీ వెరిజాన్‌ 4.8బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. అయితే యాహూ న్యూస్ సర్వీస్ తోపాటు, బ్లాగింగ్ ప్లాట్ ఫాం టంబ్లర్,  ఫోటో షేరింగ్ సైట్ ఫ్లికర్, యాహూ  ఫినాన్స్ ద్వారా టెక్ సేవలందిస్తున్న సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు