యాకూబ్ వీలునామా రాయలేదు

30 Jul, 2015 08:20 IST|Sakshi
యాకూబ్ వీలునామా రాయలేదు
యాకూబ్ మెమన్ ఎలాంటి వీలునామానూ రాయలేదని ఆయన న్యాయవాది అనిల్ గెదామ్ తెలిపారు. సుప్రీంకోర్టు నుంచి కానీ, రాష్ట్రపతికి సమర్పించిన క్షమాభిక్ష పిటిషన్ ద్వారా కానీ తనకు ఏదో ఊరట లభిస్తుందని యాకూబ్ ఆశించినట్లు చెప్పారు. అందుకే వీలునామా రాయలేదని అన్నారు. మరణశిక్ష అమలు చేసిన తర్వాత అతడి మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు కోరే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
 
జైలు వద్ద పటిష్ట భద్రత
 
యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేసేందుకు అవసరమైన సన్నాహాలను అదనపు డీజీపీ (జైళ్లు) మీరా బోర్వాంకర్ పర్యవేక్షించారు. ఆమెకు డీఐజీ(జైళ్లు) రాజేంద్ర దామ్నె, జైలు సూపరింటెండెంట్ యోగేశ్ దేశాయి సహకరించారు. పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను పుణేలోని ఎరవాడ జైల్లో ఉరితీసిన సమయంలో కూడా యోగేశ్ దేశాయి అక్కడే విధుల్లో ఉన్నారు. జైలు భద్రతను పోలీసు ఉన్నతాధికారులు సమీక్షించారు. యాకూబ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చగానే బుధవారం మధ్యాహ్నం నాగ్‌పూర్ జైలు వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ముంబై పోలీసు విభాగానికి చెందిన సుశిక్షిత ‘క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్‌టీ)’ను రంగంలోకి దింపారు. యాకూబ్‌ను ఉంచిన సెల్ వద్ద కూడా పహారా బాధ్యతలను ఈ టీమ్‌కే అప్పగించారు. జైలు పరిసరాల్లో జనం గుమిగూడకుండా 144 సెక్షన్‌ను విధించారు. ఉరిఅనంతరం, మెమన్ మృతదేహాన్ని జైళ్లోనే ఖననం చేస్తారా? లేక బంధువులకు అప్పగిస్తారా? అనే విషయంపై జైలు సూపరింటెండెంట్ నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. ఒకవేళ, మృతదేహాన్ని బంధువులకు అప్పగించాలని నిర్ణయిస్తే.. పోస్ట్‌మార్టమ్ పూర్తిచేసి యాకూబ్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగిస్తారు.
మరిన్ని వార్తలు