కశ్మీర్‌లో కీలక పరిణామం!

25 Oct, 2016 14:10 IST|Sakshi
కశ్మీర్‌లో కీలక పరిణామం!

శ్రీనగర్‌: గత మూడు నెలలుగా ఆందోళనలు, అశాంతితో అట్టుడుకుతున్న కశ్మీర్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కశ్మీర్‌ లోయలో శాంతియుత వాతావరణంపై కేంద్ర ప్రభుత్వం, వేర్పాటువాదుల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా ఒక ముందడుగు పడింది. కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంగళవారం వేర్పాటువాద అగ్రనేత సయెద్‌ అలీషా గిలానీతో భేటీ అయింది. గిలానీ-సిన్హా బృందం దాదాపు గంటపాటు సమావేశమై చర్చించింది. చర్చలు చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగినట్టు సిన్హా తెలిపారు. అయితే, తమది అధికారిక ప్రతినిధి బృందం కాదని, వ్యక్తిగత స్థాయిలో కశ్మీర్‌లోని పరిస్థితులను బేరీజు వేసేందుకు మాత్రమే తాము వచ్చినట్టు ఆయన చెప్పారు. కశ్మీర్‌లో తాజా పరిస్థితులపై కేంద్రం, వేర్పాటువాదుల మధ్య చర్చలకు వీలు కల్పించే కృషిలో భాగంగా ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. 

గత జూలై 8న హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ ఎన్‌కౌంటర్‌ అనంతరం కశ్మీర్‌ లోయ ఆందోళనలతో అట్టుడికిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ లోయలో అశాంతి నెలకొంది.  ఆందోళనలు కొనసాగుసతుండటంతో లోయలో జనజీవనం చాలావరకు స్తంభించింది. ఈ నేపథ్యంలో గృహనిర్బంధంలో ఉన్న గిలానీతో భేటీ అయ్యేందుకు సిన్హా నేతృత్వంలోని ప్రతినిధుల బృందానికి వీలు కల్పించారు. కశ్మీర్‌లో ప్రతిష్టంభన తొలగించేందుకు అవసరమైన రాజకీయ చర్చలకు వీలు కల్పించే దిశగా ఈ బృందం ఉదారవాద వేర్పాటువాద నేత, హురియత్‌ కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ మిర్వాయిజ్‌ ఉమర్‌ ఫరుఖ్‌, జేకేఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ యాసిన్‌ మాలిక్‌లతో కూడా చర్చలు జరుపనుంది.
 

మరిన్ని వార్తలు