లక్ష కేంద్రాల్లో యోగా...

20 Jun, 2016 18:08 IST|Sakshi
లక్ష కేంద్రాల్లో యోగా...

హైదరాబాద్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం దేశవ్యాప్తంగా ఒకేసారి 1,00,260 కేంద్రాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రాంతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా పది మెగా ఈవెంట్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన పట్టణాలు వారణాసి, ఇంఫాల్, జమ్ము, వదోదరా, లక్నో, బెంగుళూరు, విజయవాడ, భువనేశ్వర్, సిమ్లా, హోషియార్ పూర్ లలో ఈ మెగా ఈవెంట్స్ జరగనున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చంఢీఘర్ లోని క్యాపిటల్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేస్తున్న ప్రధాన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు.

యోగా థీమ్ పై దేశవ్యాప్తంగా ప్రజలను భాగస్వామ్యం చేయాలన్న లక్ష్యంతో ఈ భారీ కార్యక్రమం చేపట్టినట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా లక్ష యోగా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగినట్టు చెప్పారు. స్థానికంగా ఉండే యువజన సంఘాలతో కలిపి లక్ష యోగా కార్యక్రమాలతో పాటు దేశవ్యాప్తంగా 391 యూనివర్సిటీలు, 16 వేల కాలేజీలు, 12 వేల పాఠశాలల్లో ఒకేసారి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

మెగా ఈవెంట్స్ నిర్వహించే ప్రధాన పట్టణాల్లో గడిచిన అయిదు రోజులుగా యోగా శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎన్ సీసీ, ఎన్ ఎస్సెస్, పతంజలి, ఆర్ట్ ఆఫ్ లివింగ్, భారతీయ యోగా సంస్థాన్, బ్రహ్మ కుమారీస్ వంటి అనేక సంస్థలు ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాయి.

2014 సెప్టెంబర్ 27 న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగా ప్రాధాన్యతను వివరించడమే కాకుండా అంతర్జాతీయ యోగా దినోత్సవరం పాటించాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత మూడు నెలలకు 2014 డిసెంబర్ 11 న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఆ ప్రతిపాదనను ఆమోదించింది. జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించాలని తీర్మానించింది. యూఎన్ జనరల్ అసెంబ్లీలో 193 దేశాలకు గాను 177 దేశాలు ఆ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశాయి.

యోగా గీతం
గతేడాది ప్రారంభమైన అంతర్జాతీయ యోగా దినోత్సవంపై ప్రభుత్వం ఈసారి ప్రత్యేక పాట కూడా విడుదల చేసింది. హిందీ భాషలో రూపొందించిన ఈ పాట 3 నిమిషాల 15 సెకండ్ల పాటు సాగుతుంది. దీరజ్ సారస్వత్, ఎస్ హెచ్ గంధార్ ఈ పాటను రూపొందించగా, టీడీ జాదవ్ గధా జాదవ్ ఆలపించగా, సుమంతో రాయ్ సంగీతం సమకూర్చారు.

యోగా ఒలింపియాడ్
అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకుని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ తొలిసారిగా జాతీయ యోగా ఒలింపియాడ్ ను నిర్వహించింది. ఈ నెల 18, 19 తేదీల్లో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో యోగా ఒలింపియాడ్ ను నిర్వహించింది. యోగాను విశ్వవిద్యాలయాల్లో ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అందుకోసం కేంద్ర ప్రభుత్వం స్వామి వివేకానంద యోగా అనుస్థానంధన సంస్థానం చాన్సలర్  ప్రొఫెసర్ హెచ్ ఆర్ నాగేంద్ర నేతృత్వంలో ఒక కమిటీని కూడా నియమించింది.

ఆరు సెంట్రల్ యూనివర్సిటీల్లో 2016-2017 సంవత్సరం నుంచి యోగిగ్ సైన్సెస్ అంశంపై జాతీయ అర్హత పరీక్ష (నెట్) నిర్వహించాలని యూజీసీ ఇప్పటికే నిర్ణయించింది. సెమావతి నందన్ బహుగుణ గర్వాల్ యూనివర్సిటీ (ఉత్తరాఖంఢ్), విశ్వభారతి (పశ్చిమ బెంగాల్), సెంట్రల్ యూనివర్సిటీ రాజస్థాన్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ, ఇందిరాగాంధీ జాతీయ గిరిజన యూనివర్సిటీ (మధ్యప్రదేశ్) మణిపూర్ యూనివర్సిటీ లలో యోగా డిపార్ట్ మెంట్లు ప్రారంభిస్తున్నారు.

రాష్ట్రపతి భవన్ లో
ఉదయం 6.30 గంటలకు రాష్ట్రపతి భవన్ లో వెయ్యి మందితో నిర్వహించే సామూహిక యోగా ప్రదర్శనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభిస్తారు. మురార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా