ఐదువేల సంవత్సరాల కిందటే క్యాష్‌లెస్‌: యోగి

25 Apr, 2017 18:16 IST|Sakshi
ఐదువేల సంవత్సరాల కిందటే క్యాష్‌లెస్‌: యోగి

లక్నో: పెద్దనోట్ల రద్దుతో కలిగే ప్రయోజనాలను ఒప్పుకోనివారి కోసం.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సరికొత్త పాయింట్‌ను తెరపైకి తెచ్చారు. నోట్ల రద్దు ప్రయోజనాలను వివరించడానికి ఆయన కృష్ణుడిని ఆశ్రయించారు. సోమవారం లక్నోలో ఓ అధికారిక కార్యక్రమంలో సీఎం యోగి మాట్లాడుతూ.. ‘సుధామా (కుచేలుడు) శ్రీకృష్ణుడిని కలిసినప్పుడు.. కృష్ణుడు అతనికి నగదురహితరూపంలోనే సాయం చేశాడు. ఐదువేల కిందట ఇలాంటి లావాదేవి జరిగినప్పుడు ఇప్పుడెందుకు జరగదు?’ అని ప్రశ్నించారు.

మన పురాణాలు తెలిసినవారందరికీ శ్రీకృష్ణుడు-కుచేలుడి కథ తెలిసిందే. శ్రీకృష్ణుడు కుచేలుడి బాల్యస్నేహితుడు. అనంతరకాలంలో నిరుపేద అయిన అతడు సాయం అర్థించేందుకు కృష్ణుడి వద్దకు వస్తాడు. అతనికి అటుకులు కానుకగా ఇస్తాడు. కానీ సాయం కోరేందుకు నోరు రాదు. నిరాశగా ఇంటికి వెనుదిరిగిన కుచేలుడు తన ఇల్లు భోగభాగ్యాలతో విలసిల్లడం చూసి విస్తుపోతాడు. కుచేలుడు సాయం కోరకపోయినా స్నేహితుడిగా అతని స్థితిని అర్థం చేసుకొని శ్రీకృష్ణుడు సాయం చేస్తాడు. గత నవంబర్‌లో ప్రధాని మోదీ అమలుచేసిన నోట్లరద్దు ప్రయోజనాలను వివరిస్తూ.. సీఎం యోగి ఈ ఘట్టాన్ని గుర్తుచేశారు.   
 

మరిన్ని వార్తలు