సీఎం యోగి వ్యాఖ్యలతో వివాదం!

8 Apr, 2017 20:10 IST|Sakshi
సీఎం యోగి వ్యాఖ్యలతో వివాదం!

వందేమాతరం పాడకపోవడం దురుద్దేశమేనని కామెంట్‌

లక్నో: జాతీయగేయం వందేమాతరంపై ఉత్తరప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కొత్త వివాదానికి తెరలేపారు. వందేమాతరం పాడకపోవడం తీవ్రమైన విషయమని, దీనిని తీవ్రంగా పరిగణించి పరిష్కరించాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఈ విషయంలో దురుద్దేశపూరితంగా వ్యవహరించేవారితో ఎలా ఎదుర్కోవాలనే దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరముందని చెప్పారు.

‘కొంతమంది వ్యక్తులు ఇప్పుడు తాము వందేమాతరం పాడబోమని పేర్కొంటున్నారు. వందేమాతరం పాడకపోవడం తీవ్రమైన విషయం.. వందేమాతరం పాడకపోవడం దురుద్దేశపూరితమే. ప్రతి ఒక్కరూ వందేమాతరం పాడాల్సిందే’ అని సీఎం యోగి అన్నారు. లక్నోలో శనివారం జరిగన ఓ పుస్తకావిష్కరణ సభలో సీఎం యోగి ప్రసంగించారు. అయితే, తమ ప్రభుత్వం ఏకైక అజెండా అభివృద్ధి మాత్రమేనని స్పష్టం చేశారు. 21వ శతాబ్దంలో కూడా ‘వందేమాతరం’ పాడకపోవడం అనేది అత్యంత చర్చనీయాంశంగా మార్చకూడదని పేర్కొన్నారు. యూపీలోని కొన్ని మున్సిపాలిటీలలో వందేమాతరం పాడటంపై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో సీఎం యోగి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మీరట్‌ మున్సిపాలిటీ కార్పొరేషన్‌ సమావేశంలో వందేమాతరం పాడకపోవడంపై వివాదం రేగింది. అలాగే అలహాబాద్‌ మున్సిపాలిటీ కార్పొరేషన్‌ సమావేశంలో వందేమాతరం పాడటాన్ని తప్పనిసరి చేయాలంటూ బీజేపీ తీర్మానం పెట్టగా.. ఎస్పీ, ఇతర సభ్యులు తీర్మానాన్ని వ్యతిరేకించారు.

మరిన్ని వార్తలు