ఆ దెబ్బకు గూగుల్కు 5వేల కోట్లు తుస్

28 Mar, 2017 18:32 IST|Sakshi
ఆ దెబ్బకు గూగుల్కు 5వేల కోట్లు తుస్
మార్కెట్లో దిగ్గజ కన్జ్యూమర్ బ్రాండు కంపెనీలన్నీ దాదాపు వీడియో-హౌస్టింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ ను బ్లాక్ చేసేశాయి. అభ్యంతరకర వీడియోల దగ్గర తమ ప్రకటనలు ప్రచురిస్తున్నారనే కారణంతో యూట్యూబ్ కు ప్రకటనలు ఇవ్వమని తేల్చేశాయి. దీంతో యూట్యూబ్ పేరెంట్ కంపెనీ గూగుల్ కు భారీగానే దెబ్బతగలనుందట. సుమారు రూ.4,879 కోట్ల రెవెన్యూలను గూగుల్ కోల్పోతుందని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. కొన్ని వారాలుగా కన్జ్యూమర్ బ్రాండు దిగ్గజాలు జాన్సన్ అండ్ జాన్సన్, పెప్సీకో, మెక్ డొనాల్డ్ కంపెనీలు తమ వ్యాపార ప్రకటనలు యూట్యూబ్ ప్లాట్ ఫామ్ నుంచి ఉపసంహరించుకుంటున్నాయి. వీటితో పాటు పలు టెలికాం కంపెనీలు, ప్రముఖ కంపెనీలు యూట్యూబ్ కు ప్రకటనలు ఇవ్వకూడదని నిర్ణయించేశాయి.
 
టెర్రరిజంకు సంబంధించిన గ్రూప్లు పోస్టు చేసే వీడియోల దగ్గర తమ వ్యాపార ప్రకటనలను యూట్యూబ్ ఇస్తుందని కంపెనీలు ఆగ్రహించాయి. ఈ సమస్యను పరిష్కరిస్తామని గూగుల్ చెప్పినప్పటికీ, ఇప్పటికీ దీనిపై ఆందోళన  కొనసాగుతూనే ఉంది. దీంతో సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ షేరు ధర అంతర్జాతీయంగా పడిపోతుంది. ఈ సమస్యను గూగుల్ వెంటనే పరిష్కరించాలని లేదంటే భారీ మూల్యాన్నే కంపెనీ మూటకట్టుకోవాల్సి ఉంటుందని బ్రోకరేజ్ సంస్థ నోముర ఇన్స్టినెట్ చెబుతోంది. యూట్యూబ్ వార్షిక రెవెన్యూలు ఈ ఏడాది 10.2 బిలియన్ డాలర్ల వరకు అంటే రూ.66,344కోట్లకు పైనే ఉంటాయని అంచనాలు వెలువడుతున్నాయి. కానీ ఈ వివాదంతో 7.5 శాతం మేర రెవెన్యూలను కోల్పోవాల్సి ఉంటుందని నోమురా హెచ్చరిస్తోంది. 
 
మరిన్ని వార్తలు