కుట్రలు షురూ!

23 Sep, 2015 03:06 IST|Sakshi

జగన్ దీక్షను ఆపేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు
ప్రభుత్వ స్థలంలో కార్యక్రమానికి అనుమతి నిరాకరణ
ప్రైవేట్ స్థలాన్ని ఎంపిక చేసుకున్నా అడ్డంకులు
మరోవైపు రాజధానిలో 144 సెక్షన్ అమలు

సాక్షి, గుంటూరు/విజయవాడ బ్యూరో: కేంద్రంలో అధికార పక్షమైన బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవాల్సింది పోయి... అందుకోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటాన్ని అడుగడుగునా అడ్డుకొనే ప్రయత్నం చేస్తోంది.

మొన్న తిరుపతిలో,తాజాగా విశాఖలో నిర్వహించిన యువభేరి సదస్సును అడ్డుకొనేందుకు ప్రయత్నించి విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం గుంటూరులో ఈ నెల 26వ తేదీ నుంచిజగన్ చేపట్టబోయే నిరవధిక నిరాహార దీక్షకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతోంది.  
 
అనుమతి ఇస్తున్నట్లా.. లేనట్లా.. : ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించకపోతే ఈ నెల 26 నుంచి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో దీక్ష కోసం వైఎస్సార్‌సీపీ నాయకులు గుంటూరులో మూడు ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేశారు. ఈ నెల 12న పోలీసులను అనుమతి కోరారు. ప్రభుత్వ స్థలాల్లో దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో నగరంలోని ఏసీ కళాశాల ఉల్ఫ్‌హాల్ స్థలాన్ని ఎంపిక చేశారు.

దీక్షకు ప్రభుత్వం నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేయడంతోపాటు వైఎస్ జగన్‌కు భద్రత కల్పించాలని సోమవారం గుంటూరు అర్బన్, రూరల్ ఎస్పీలను కలిసి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ నేతలు ఎస్పీలను కలిసి బయటకు వచ్చిన రెండు గంటల వ్యవధిలోనే.. దీక్షకు స్థలం అనువుగా లేదంటూ గుంటూరు ఈస్ట్ డీఎస్పీ సంతోష్ లేఖ పంపారు. దీక్షా స్థలి విద్యాసంస్థలు, ఆసుపత్రులకు సమీపంలో ఉందని, వినాయక నిమజ్జనాలు జరిగే మార్గంలో ఉండటం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని, పార్కింగ్‌కు చూపిన స్థలం కూడా సరిపోదని లేఖలో పేర్కొన్నారు. అనుమతి ఇస్తున్నట్లు గానీ, నిరాకరిస్తున్నట్లు గానీ అందులో స్పష్టం చేయలేదు.
 
ఇదే సెంటర్‌లో టీడీపీ దీక్ష చేయలేదా? : ఉల్ఫ్‌హాల్ స్థలం ఉన్న హిందూ కళాశాల సెంటర్‌లోని ప్రధాన కూడలిలో 2009 డిసెంబర్‌లో టీడీపీ నాయకులు నడిరోడ్డుపై వేదికను ఏర్పాటు చేసి, నిరాహార దీక్షలు చేపట్టిన విషయం ప్రభుత్వానికి గుర్తులేదా? అని  హోదా కోరుతున్న ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ స్థలంలో జగన్ చేపట్టనున్న దీక్షను భగ్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్న ప్రభుత్వానికి పుట్టగతులుండవని నిప్పులు చెరుగుతున్నారు.   
 
ప్రజా నిరసనలపై ఉక్కుపాదం : రాజధాని ప్రాంతంలో ప్రజా పోరాటాలపై ప్రభుత్వం ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సభలు, సమావేశాలు, ఆందోళనలు, నిరసనలకు అవకాశం లేకుండా సెక్షన్ 144ను అమలులోకి తెచ్చింది. నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదంటూ ఈ నెల 11 నుంచి పోలీసులు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.
 
సీఆర్‌డీఏ సమీక్షలోనే సంకేతాలు: రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లోకి రావడానికి సీఎం చంద్రబాబు ఆదేశాలే కారణం. ఉద్యమాలను అణచివేయాలంటూ ఇటీవల నిర్వహించిన సీఆర్‌డీఏ సమీక్షలో అధికారులకు సంకేతాలు ఇచ్చారు. దీంతో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మందడంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆందోళనకు పోలీసులు అనుమతి నిరాకరించి అడ్డుకోవడంతో మంగళగిరిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సి వచ్చింది. ఇటీవల సీపీఎం తుళ్లూరులో నిరాహార దీక్షలు చేపట్టడంతో నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ చేపట్టిన సామూహిక సత్యాగ్రహాన్ని భగ్నం చేశారు.

మరిన్ని వార్తలు