చంద్రబాబు తోలుమందం.. గట్టిగా ఒత్తిడి చేద్దాం

20 May, 2017 12:25 IST|Sakshi
చంద్రబాబు తోలుమందం.. గట్టిగా ఒత్తిడి చేద్దాం

- ఉద్దానం కిడ్నీ బాధితులతో వైఎస్‌ జగన్‌
- శ్రీకాకుళం జిల్లా జగతిలో ప్రతిపక్షనేత ముఖాముఖి
- ఏడాదిన్నరలో వచ్చేది ప్రజా ప్రభుత్వమే..
- మహానేత కలల పథకం ఆరోగ్యశ్రీని ఇంకా ఉన్నతంగా తీర్చి దిద్దుకుందాం


జగతి:
ఉద్ధానం కిడ్నీబాధితులను ఆదుకునే విషయంలో చంద్రబాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నదని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. ఉద్ధానం ప్రాంతంలోని జగతి గ్రామంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో కిడ్నీ బాధితులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ బాధలు జగన్‌కు విన్నవించుకున్నారు. ఆరోగ్యశ్రీని, 108, 104 సర్వీసులను నిర్వీర్యం చేస్తోన్న సీఎం చంద్రబాబుకు తోలు మందమని, అంతా కలిసి గట్టిగా ఒత్తిడి చేద్దామని వైఎస్‌ జగన్‌.. కిడ్నీ బాధితులతో అన్నారు.

‘ప్రభుత్వాసుపత్రుల్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. పేదలకు సంజీవిని లాంటి 108 వాహనాలు మూలన పడ్డాయి. 108కి ఫోన్‌ చేస్తే డీజిల్‌ లేదనే సమాధానం వస్తోంది. 104 వాహనాల పరిస్థితీ అంతే తయారైంది. గతంలో కిడ్నీ పేషెంట్లకుగానీ, మూగ, చెవిటి పిల్లలకుగానీ ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లు చేసేవారు. చంద్రబాబు సర్కారు ఇప్పుడు వాటిని ఎత్తేసింది. కిడ్నీ వ్యాధి బారిన పడివాళ్లకు మొదట మందులు ఇస్తారు. బ్లడ్‌ లెవెల్స్‌ మెయింటెనెన్స్‌ కోసం వారం లేదా రెండు రోజులకు ఒకసారి ఇంజక్షన్‌ ఇస్తారు. ఒక్కో ఇంజక్షన్‌కు రూ.650 ఖర్చవుతుంది. మందులకు రూ.2 వేల నుంచి రూ.5వేల దాకా ఖర్చవుతోంది. అప్పటికీ జబ్బు తగ్గకపోతే డయాలసిస్‌లోకి వెళతారు. దీనికి నెలకు రూ.20 వేల దాకా ఖర్చవుతుంది. ఇక చివరిస్టేజ్‌.. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌. ఈ ఆపరేషన్‌ ఖర్చు రూ.10 లక్షలు, ఆపరేషన్‌ తర్వాత మందులకు అయ్యే ఖర్చు అదనం. వ్యాధికిగురయ్యేవారిలో అధికులు పేదలే. వాళ్లందరిదీ వైద్యం చేయించుకోలేని పరిస్థితే. అలాంటి వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.


ఆరోగ్యశ్రీని మరింత ఉన్నతంగా తీర్చి దిద్దుతా
తలకు మించిన భారాన్ని మోస్తున్న ఉద్దానం బాధితులు ఇంకొక్క ఏడాదిన్నర ఓపిక పట్టాలని, వచ్చేది ప్రజాప్రభుత్వమేనని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. ‘ఆరోగ్యశ్రీ.. వైఎస్సార్‌ కలల పథకం. వచ్చే ప్రభుత్వంలో ఆ పథకాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాం. ఏ పేదవాడూ అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకూడదు. ప్రైమరీ సెంటర్లల్లోనే డయాలసిస్‌ సెంటర్లు పెట్టిస్తాం’ అని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.


ఇదీ బాబుగారి విధానం!
‘ఉద్దానం ప్రాంతంలో అసలు కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయనేదానిని పరిశోధించడానికి రీసెర్చ్‌ సెంటర్‌ పెట్టాల్సి ఉండగా, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు కూడా తీసుకోలేదు. గడిచిన మూడేళ్లలో ఆ ఆలోచనైనా చేయలేదు. కనీసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎయిమ్స్‌ ద్వారానైనా సెంటర్‌ ఏర్పాటుకు ప్రత్నించారా అంటే, అదీ చేయలేదు. గత పార్లమెంట్‌ సమావేశాల్లో వైసెస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి ఉద్దానం సమస్యలపై పార్లమెంటులో ప్రశ్నించారు. ‘ఉద్ధానంలో రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి వచ్చిందా?’ అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని కేంద్రం సమాధానం చెప్పంది. ఇదీ బాబుగారి విధానం. ఆయన తోలు మందం అన్న సంగతి మనకు తెలుసుకాబట్టి, ప్రభుత్వంపై గట్టిగా పోరాడుతూనే, రాబోయే ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసుకుందాం’ అని వైఎస్‌ జగన్‌ చెప్పారు.
 

 

మరిన్ని వార్తలు