కేసీఆర్ ఫోన్ చేసినట్టు రుజువుచేస్తే....

4 Sep, 2015 10:32 IST|Sakshi
కేసీఆర్ ఫోన్ చేసినట్టు రుజువుచేస్తే....

హైదరాబాద్: కేసీఆర్ తనకు ఫోన్ చేసినట్టు రుజువు చేస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రుజువు చేయకపోతే లేదంటే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు.

అసెంబ్లీలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ... ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏదైనా సమాచారం సభకు చెబుతున్నామంటే, ఆరోపణలు చేస్తున్నామంటే అందులో నిజాయితీ ఉండాలన్నారు. కేసీఆర్ తో చంద్రబాబు ఎన్నికల పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన విషయం మరిచిపోయారా అని నిలదీశారు. కేసీఆర్, చంద్రబాబు పొత్తు పెట్టుకున్న ఫోటోలను స్పీకర్ కు వైఎస్ జగన్ చూపించారు.

దొంగతనం చేస్తూ పట్టుబడి పట్టుకున్నవారిదే తప్పన్నట్టుగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసును రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరించారని ధ్వజమెత్తారు. ఆడియో టేపుల్లో ఉన్న వాయిస్ చంద్రబాబుది అవునో, కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని పంపింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. 'వీటికి ఎవరూ సమాధానాలు చెప్పరు. సీఎం లంచాలు తీసుకుని, ఆ డబ్బును ఎమ్మెల్యేలకు ఇస్తూ పట్టుబడితే ఈ సభలో చర్చ జరగకూడదా? వీడియో, ఆడియో ఆధారాలు ఉన్నా.. చంద్రబాబు పేరు చార్జిషీట్ లో 22 సార్లు ఉన్నా చర్చ జరపారా? కానీ రోజూ నా గురించి ఎవరంటే వాళ్లు మాట్లాడొచ్చా? ఎవరంటే వాళ్లు తిట్టొచ్చా? అక్కడితో ఆగరు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా విడిచిపెట్టకుండా దూషణలు చేస్తారు. మైకు అధికారపక్ష సభ్యులకు ఎక్కువసార్లు వస్తుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు' అని వైఎస్ జగన్ అన్నారు.

ఓటుకు కోట్లు కేసులో సమాధానం చెప్పకుండా చంద్రబాబు తప్పించుకుని తిరుగుతున్నారని అన్నారు. చంద్రబాబు సభలోకి వచ్చి ఎందుకు సమాధానం చెప్పరని నిలదీశారు. ఈ అంశంపై తప్పుదోవ పట్టించేందుకు సభను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.

మరిన్ని వార్తలు